దీపావళి 'క'.. కిరణ్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు
ఇప్పటికే పలు సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన ఆయన.. ఇప్పుడు మొదటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్ లో తన కంటూ ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను మెప్పించిన ఆయన.. ఇప్పుడు మొదటి పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'క' తో సందడి చేయనున్నారు. సుజీత్, సందీప్ దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు.
ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'క' మూవీ.. దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 1970 బ్యాక్ డ్రాప్ తో రూపొందిన ఆ సినిమాను బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉన్నా ధైర్యంగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కంటెంట్ మీద నమ్మకంతో విడుదల చేస్తున్నట్లు రీసెంట్ గా కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇచ్చారు. పండుగకు అందరికీ పాత జ్ఞాపకాలు గుర్తు చేద్దామనే ఉద్దేశంతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపారు.
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో 'క' మూవీపై కిరణ్ కు నమ్మకం మామూలుగా లేదుగా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అందుకు దీపావళికి పోటీ ఉన్నా సినిమా రిలీజ్ చేస్తుండడం ఒక కారణమైతే.. మార్కెటింగ్ మరో కారణమని చెబుతున్నారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాధ్యతలు దగ్గరుండి కిరణ్ చూసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ నుంచి ప్రొడక్షన్ వరకు అన్ని విషయాలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ డిసిషన్స్ తీసుకున్నారట.
ఇప్పుడు మూవీ రిలీజ్ విషయంలో కూడా అంతే దూకుడుగా కిరణ్ ముందుకెళ్తున్నారని చెబుతున్నారు. బయ్యర్లకు సినిమా చూపించి మరీ థియేట్రికల్ హక్కులు విక్రయిస్తున్నారని అంటున్నారు. ఫస్ట్ మూవీ చూడండి, తర్వాత డీల్ కుదుర్చుకుందామని చెబుతున్నారట. కొత్త దర్శకులు.. కొత్త క్యాస్టింగ్.. కాబట్టి 'క' సినిమా పబ్లిసిటీని కూడా ఆయనే చేస్తున్నారు. వరుసగా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. ఓ రేంజ్ లో చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు.
మొత్తానికి 'క' మూవీ కోసం కిరణ్ అబ్బవరం.. బాగా కష్టపడుతున్నారనే చెప్పాలి. ఎలా అయినా హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. సినిమాల పరంగా తన క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ట్రై చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఫస్ట్ టైమ్ తన లక్ ను టెస్ట్ చేసుకుంటున్నారు. ఏదేమైనా కంటెంట్ పై నమ్మకంతో దీపావళికి తమిళం తప్ప మిగతా భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి 'క' సినిమాతో ఎలాంటి విజయం సాధిస్తారో వేచి చూడాలి.