1000 జన్మల పుణ్యంతో హీరో అయ్యాడు!
అలాంటి పుణ్యం పురుషార్థం ఉన్నవాడు గనుకే శరవణన్ స్టోర్స్ అధిపతి శరవణన్ హీరో అయ్యారని విశ్లేషిస్తున్నారు.
ఎవరైనా ఒక సాధారణ యువకుడు హీరో అవ్వాలంటే 1000 జన్మల పుణ్యఫలం అడ్వాన్స్‌గా ఉండాలని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఒకానొక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇది కచ్ఛితంగా నిజం. అలాంటి పుణ్యం పురుషార్థం ఉన్నవాడు గనుకే శరవణన్ స్టోర్స్ అధిపతి శరవణన్ హీరో అయ్యారని విశ్లేషిస్తున్నారు.
టెక్స్టైల్ పరిశ్రమలో వ్యాపార దిగ్గజంగా పేరున్న అతడిని ఇప్పుడు లెజెండ్ శరవణన్ అని పిలుస్తున్నారు. గత సంవత్సరం పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా `ది లెజెండ్`తో తన సినీ రంగ ప్రవేశం చేయడంతో అతడి పేరుకు ముందు లెజెండ్ తగలించేశాడు. ఈ చిత్రాన్ని శరవణన్ స్వయంగా నిర్మించారు. జెడి జెర్రీ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్ ని వెచ్చించారు. ఊర్వశి రౌతేలా లాంటి అందగత్తెను బాలీవుడ్ నుంచి రప్పించి కథానాయికను చేసారు. తనకు భారీగానే ప్యాకేజీ చెల్లించారు. అయితే ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హీరో అందం నటనను తీవ్రంగా విమర్శించారు.
అయితే ఒకటో ప్రయత్నం ట్రయల్ గా భావించిన శరవణన్ వేటినీ ఖాతరు చేయడం లేదు. హీరోగా తన ప్రయత్నాలను మాత్రం విడువడం లేదు. త్వరలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. లెజెండ్ 02 అని తాత్కాలిక టైటిల్ తో దీనిని ప్రారంభిస్తున్నారు. ఈసారి హారర్ కామెడీ జానర్‌ని ఎంపిక చేసుకుని ముందుకు వెళుతున్నాడు. ది లెజెండ్ రేంజుకు తగ్గని బడ్జెట్ ని దీనికోసం ఖర్చు చేస్తారని టాక్ వినిపిస్తోంది. లెజెండ్ శరవణన్ సరసన పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటిస్తుంది. ఆండ్రియా జెరోమియా, కిక్ షామ్ కీలక పాత్రలు పోషించనున్నారు. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, గిబ్రాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. 2025 ఏప్రిల్‌లో ఈ చిత్రం పెద్ద ప్రేక్షకుల ముందుకు రానుంది.