2024లో డిజాస్టర్లు అందుకున్న హీరోలు వీరే!
2024లో డిజాస్టర్ ఫలితాలను అందుకున్న ఆ హీరోలెవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
టాలీవుడ్ లో ఇప్పుడు బ్లాక్ బస్టర్లు, భారీ డిజాస్టర్లు మాత్రమే ఉన్నాయి. అయితే హిట్టు, లేకపోతే ఫట్టు. అంతేకానీ యావరేజ్ సినిమా అనే మాటే వినిపించడం లేదు. పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వస్తున్నాయి.. నెగెటివ్ టాక్ వస్తే మాత్రం ఫస్ట్ వీకెండ్ లోనే వాష్ అవుట్ అయిపోతున్నాయి. ఈ ఏడాదిలో భారీ అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాలు చవిచూశాయి. 2024లో డిజాస్టర్ ఫలితాలను అందుకున్న ఆ హీరోలెవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
వెంకటేశ్ - సైంధవ్:
విక్టరీ వెంకటేశ్ నటించిన 'సైంధవ్' ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ పరిచింది. దీంతో ఇప్పుడు వెంకీ వచ్చే పొంగల్ కు రాబోతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. అనిల్ రావిపూడి దీనికి దర్శకుడు.
రవితేజ - ఈగల్ & మిస్టర్ బచ్చన్:
మాస్ మహారాజా రవితేజ ఈ సంవత్సరంలో రెండు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లు ఎదుర్కున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో చేసిన 'ఈగల్' సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన హ్యాట్రిక్ మూవీ 'మిస్టర్ బచ్చన్' మూవీ ఘోర పరాజయం అందుకుంది. అయితే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో 'మాస్ జాతర' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు రవితేజ.
విజయ్ దేవరకొండ - ఫ్యామిలీ స్టార్:
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సమ్మర్ లో "ది ఫ్యామిలీ స్టార్" అంటూ వచ్చి డిజాస్టర్ అందుకున్నారు. పరశురామ్ తీసిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు తప్పించడంలో ఫెయిల్ అయింది. దీంతో చాలా కాలంగా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్న విజయ్ ఖాతాలో మరో పెద్ద ఫ్లాప్ వచ్చి చేరినట్లైంది. అయితే VD క్యామియో రోల్ చేసిన 'కల్కి 2898 ఏడీ' మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. విజయ్ వచ్చే ఏడాది గౌతమ్ తిన్ననూరితో కలిసి 'VD 12' సినిమాతో రాబోతున్నారు.
రామ్ పోతినేని - డబుల్ ఇస్మార్ట్:
ఉస్తాద్ రామ్ పోతినేని ఖాతాలో 'డబుల్ ఇస్మార్ట్' వంటి డబుల్ డిజాస్టర్ పడింది. 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. రామ్ కు గతేడాది బోయపాటి 'స్కంధ' వంటి సినిమా ఇస్తే, ఈ ఏడాది పూరీ డబుల్ ఇస్మార్ట్ ఇచ్చారు. దీంతో మాస్ ని పక్కనపెట్టి క్లాస్ సినిమాలపై రామ్ ఫోకస్ పెట్టారు. ఇటీవలే పి.మహేష్ బాబు డైరెక్షన్ లో 'RAPO 22' సెట్స్ మీదకి తీసుకెళ్ళారు.
వరుణ్ తేజ్ - ఆపరేషన్ వాలెంటైన్ & మట్కా:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సంవత్సరంలో డబుల్ డిజాస్టర్లు రుచి చూశారు. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో పాన్ ఇండియాని టార్గెట్ చేసి ఫెయిల్ అయ్యారు. రీసెంట్ గా కరుణ కుమార్ తో కలిసి 'మట్కా' అంటూ మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ ను అందుకున్నారు. దీంతో వరుణ్ కాస్త బ్రేక్ తీసుకొని, తదుపరి ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడతారని టాక్ వినిపిస్తోంది.
గోపీచంద్ - భీమా & విశ్వం:
మ్యాచో స్టార్ గోపీచంద్ చాలా ఏళ్లుగా హిట్టు కొట్టాలని పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు ఈ ఏడాది కూడా నిరాశ ఎదురైంది. హర్ష అనే కన్నడ డైరక్టర్ తో చేసిన 'భీమా' మూవీ పెయిల్యూర్ గా మారింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వం' సినిమాపై ఎన్నో హోప్స్ పెట్టుకున్న గోపీకి.. ఆశించిన సక్సెస్ మాత్రం దక్కలేదు. మేకర్స్ మాత్రం ఇది హిట్టయిందని చెబుతున్నారు. దీని తర్వాత గోపీచంద్ చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు.
నిఖిల్ - అప్పుడో ఇప్పుడో ఎప్పుడో:
నిఖిల్ సిద్దార్థ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ బాక్సాఫీసు దగ్గర నిలబడలేకపోయింది. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పెద్దగా ప్రచారం లేకుండా థియేటర్లలోకి వచ్చింది. మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి దానికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ వచ్చాయి. నిఖిల్ ప్రస్తుతం 'స్వయంభు', 'ది ఇండియా హౌస్' వంటి రెండు పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు.
అల్లు శిరీష్ - బడ్డీ:
అల్లువారబ్బాయి శిరీష్ కు ఈ ఏడాది కూడా నిరాశే ఎదురైంది. రెండేళ్ల గ్యాప్ తీసుకొని 'బడ్డీ' అనే సినిమాతో వస్తే, ప్రేక్షకులు తిరస్కరించారు. ఆదిత్య రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏ దశలోనూ ఆకట్టుకోలేకపోయింది. అల్లు శిరీష్ ఇంకా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు.
ఆనంద్ దేవరకొండ - గం గం గణేశా:
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ 'గం గం గణేశా' సినిమాతో ఫ్లాప్ అందుకున్నారు. ఉదయ్ బొమ్మిసెట్టి డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కింది. గతేడాది బేబీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ రుచి చూసిన దేవరకొండ బ్రదర్.. ఈ ఏడాది మాత్రం పరాజయం ఎదుర్కోవాల్సి వచ్చింది.
అశోక్ గల్లా - దేవకీ నందన:
హీరో సినిమాతో హీరోగా పరిచయమైన సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా.. రెండో ప్రయత్నంగా ఇటీవలే 'దేవకి నందన వాసుదేవ' చిత్రంతో పలకరించారు. ప్రశాంత్ వర్మ రాసిన కథతో అర్జున్ జంధ్యాల తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ఆడియన్స్ ను ఆకట్టుకోలేపోయింది.
ఆశిష్ రెడ్డి - లవ్ మీ:
దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ రెడ్డికి ఈ ఏడాది కూడా హిట్టు దక్కలేదు. 'సెల్ఫిష్' ను హోల్డ్ లో పెట్టి, హోమ్ బ్యానర్ లో చేసిన 'లవ్ మీ - ఇఎఫ్ యూ డేర్' సినిమా డిజార్డర్ గా మారింది. అరుణ్ భీమవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇలా 2024 చాలామంది హీరోలకు కలిసి రాలేదు. మరి 2025లో వీరి జాతకం మారుతుందేమో చూడాలి.