సూపర్ హిట్ మూవీ పార్ట్ 2 డేట్ ఫిక్స్
లూసీఫర్ ప్రాంచైజీలో రాబోతున్న లూసీఫర్ 2 ను 2025, మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో 'లూసీఫర్' చిత్రం ఎంతటి భారీ విజయాన్నిసొంతం చేసుకుందో తెల్సిందే. లూసీఫర్‌ను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ పాదర్' గా రీమేక్ చేయడం జరిగింది. తెలుగు లోనూ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. లూసీఫర్ సినిమాకు సీక్వెల్ రూపొందిస్తున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. తాజాగా దీపావళి సందర్భంగా సూపర్ స్టార్ మోహన్ లాల్ నుంచి రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చింది. లూసీఫర్ రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్ లో ఉన్న గందరగోళంకు ఫుల్ స్టాప్ పెడుతూ అధికారిక ప్రకటన చేయడం జరిగింది.
లూసీఫర్ ప్రాంచైజీలో రాబోతున్న లూసీఫర్ 2 ను 2025, మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. లూసీఫర్ పార్ట్ 2 ను 'ఎంపురాన్' అనే టైటిల్ తో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి పార్ట్ తో సంబంధం లేకుండా పార్ట్ 2 ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. పాత్రలు కొన్ని రిపీట్ అయినా పూర్తిగా కొత్త కథతో లూసీఫర్ 2 ఉంటుందనే వార్తలు గత కొన్ని రోజులుగా మలయాళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అది నిజమే అన్నట్లుగా పార్ట్ 2 కి ఎంపురాన్ అనే టైటిల్ ను ఖరారు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు తెర తీసినట్లు అయింది.
లూసీఫర్ 2 ను మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి పార్ట్ ను కేవలం మలయాళంలో మాత్రమే విడుదల చేసి ఇతర భాషల్లో రీమేక్ చేయడం జరిగింది. తెలుగు లో చిరంజీవి చేసిన రీమేక్ కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కినా వసూళ్ల విషయంలో నిరాశే మిగిలింది. అందుకు కారణం చాలా మంది లూసీఫర్ ను ఓటీటీ లేదా ఇతర మార్గాల ద్వారా చూశారు. అందుకే గాడ్ ఫాదర్ సినిమాను ఎక్కువ మంది చూడలేదు అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేశారు. కనుక లూసీఫర్ 2 ను తెలుగు లో రీమేక్ చేసే విషయంలో మేకర్స్ కి ఆసక్తి లేదని సమాచారం అందుతోంది.
మోహన్ లాల్ కి తెలుగు లో మంచి క్రేజ్ ఉంది. కనుక ఆయన పేరుతో సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తే తప్పకుండా మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే లూసీఫర్ సినిమాను తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారట. మోహన్ లాల్ తో పాటు ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం కీలక పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు, ఇతర ముఖ్య పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.