27 మంది టాప్ స్టార్స్ ఒకే సినిమాలో
మార్వెల్ స్టూడియోస్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీ `అవెంజర్స్: డూమ్స్‌డే` రాక కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు;

మార్వెల్ స్టూడియోస్ నుంచి మోస్ట్ అవైటెడ్ మూవీ `అవెంజర్స్: డూమ్స్‌డే` రాక కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్‌డేట్ అభిమానులను ఉర్రూతలూగించేదే. తాజాగా ఈ మూవీ తారాగణాన్ని ఎంసియు వెల్లడించింది. నిజానికి ఇందులో సుపరిచితమైన మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) ముఖాలు -X-మెన్, ఫెంటాస్టిక్ ఫోర్ ఫ్రాంచైజీల నుండి కొత్త నటీనటులను చిత్రబృందం ఎంచుకుంది. మొత్తం 27 మంది టాప్ స్టార్లు ఈ సినిమాలో నటిస్తుండడం నిజంగా సంచలనం.
మార్వెల్ స్టూడియోస్ షేర్ చేసిన వివరాల ప్రకారం... తారాగణంలో క్రిస్ హెమ్స్‌వర్త్ (థోర్), టామ్ హిడిల్‌స్టన్ (లోకీ), ఆంథోనీ మాకీ (కెప్టెన్ అమెరికా), పాల్ రూడ్ (యాంట్-మ్యాన్), లెటిటియా రైట్ (బ్లాక్ పాంథర్), సిము లియు (షాంగ్-చి), విన్‌స్టన్ డ్యూక్ (ఎం బాకు) ఉన్నారు.
ఇతర తారాగణంలో సెబాస్టియన్ స్టాన్ (ది వింటర్ సోల్జర్), ఫ్లోరెన్స్ పగ్ (యెలెనా బెలోవా), వ్యాట్ రస్సెల్ (యుఎస్ ఏజెంట్) వంటి త్వరలో రానున్న థండర్‌బోల్ట్స్ చిత్రం నుండి నటులు కూడా ఉన్నారు. ఈ చిత్రంలో ఎక్స్-మెన్ నటులు పాట్రిక్ స్టీవర్ట్ (ప్రొఫెసర్ X), ఇయాన్ మెక్‌కెల్లెన్ (మాగ్నెటో), జేమ్స్ మార్స్‌డెన్ (సైక్లోప్స్), రెబెక్కా రోమిజ్న్ (మిస్టిక్) లను చేర్చినట్లు మార్వెల్ ప్రకటించింది. గతంలో గాంబిట్ సినిమాలో నటించిన చానింగ్ టాటమ్ కూడా ఈ చిత్రంలో కనిపిస్తారు. `ది ఫెంటాస్టిక్ ఫోర్` స్టార్లు పెడ్రో పాస్కల్ (మిస్టర్ ఫెంటాస్టిక్), వెనెస్సా కిర్బీ (ది ఇన్విజిబుల్ ఉమెన్), ఎబోన్ మోస్-బాచ్రాచ్ (ది థింగ్), జోసెఫ్ క్విన్ (ది హ్యూమన్ టార్చ్) తారాగణంలో చేరతారు. 2023లో లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొన్నా కానీ... `బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్`లో నామోర్ పాత్ర పోషించిన టెనోచ్ హుయెర్టా మెజియా కూడా తారాగణంలో చేరుతున్నారు.
హాలీవుడ్ రిపోర్టర్ కథనం ప్రకారం... ఎంసియు చిత్రంలో రాబర్ట్ డౌనీ జూనియర్ (డాక్టర్ డూమ్) చేరిక కూడా ఆశ్చర్యకరం. ఈ చిత్రంలో డౌనీ నటిస్తున్నారనే విషయం మొదట జూలైలో శాన్ డియాగో కామిక్-కాన్‌లో ప్రకటించారు. అవెంజర్స్: డూమ్స్‌డే 1 మే 2026న విడుదల కానుంది. తదుపరి చిత్రం `అవెంజర్స్: సీక్రెట్ వార్స్` 7 మే 2027న విడుదల కానుంది.