'నా అన్వేషణ' అన్వేష్‌పై తెలుగు నటి ఆరోపణలు
ఇదే సమయంలో బెట్టింగ్ యాప్ ల ఎదుగుదలకు నా అన్వేష్ కారణం అంటూ మాధవీలత లింక్ పెట్టడం ఆశ్చర్యపరిచింది.;

బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన చాలా మంది నటీనటులు, యూట్యూబర్లపై విచారణ సాగుతోంది. ఇటీవల యాప్ ల ప్రచారాన్ని పోలీసులు నిషేధించారు. ఇలాంటి సమయంలో నటి మాధవీలత ఓ కొత్త పేరును తెరపైకి తెచ్చారు. ప్రపంచ యాత్రికుడిగా పాపులరైన వైజాగ్ వాసి, 'నా అన్వేషణ' అన్వేష్ పేరును తెరపైకి తేవడమే గాక, ఇతడి వల్లనే బెట్టింగ్ యాప్‌లను నమ్మి యూత్ డబ్బు కోల్పోతున్నారంటూ ఆరోపించింది.
రవిబాబు నచ్చావులే సినిమాతో కథానాయికగా పరిచయం అయిన తెలుగమ్మాయి మాధవీలత రకరకాల వివాదాలతో మీడియా హెడ్ లైన్స్‌లోకొచ్చారు. ఇటీవల సోషల్ మీడియాల్లో బోల్డ్ ఇంటర్వ్యూలతోను పాపులరయ్యారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ల వెనక ఉన్న నటీనటులు, ఇతరుల భోగోతం బయటపెడుతూ నా అన్వేష్ చేస్తున్న వీడియోలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
ఇదే సమయంలో బెట్టింగ్ యాప్ ల ఎదుగుదలకు నా అన్వేష్ కారణం అంటూ మాధవీలత లింక్ పెట్టడం ఆశ్చర్యపరిచింది. ``ఏ వ్యక్తి అయితే బెట్టింగ్ తప్పు అని అంటున్నాడో.. అదే వ్యక్తి మీరు కూడా విదేశాలకి వస్తే పాపలతో తిరగవచ్చు. మీరు కూడా విదేశాలకు వస్తే ఈ పిచ్చి మీద బ్యాటింగ్ చేయొచ్చుని చెబుతున్నాడు`` అని మాధవి లత అన్నారు. ``ఇతడి మాటలు ఏం నేర్పుతున్నాయి. ఇది ఎలా కరెక్టు.. ఇప్పుడు ఈ వీడియోను చూసే ఫాలోవర్స్ నన్ను బూతులు తిడతారు. అయినా నాకేం సమస్య లేదు. నేను నిజాన్ని నిర్భయంగా చెబుతాను. ఆ వీడియోలు చూసిన ఎవరైనా సరే.. విదేశాలకు వెళ్తే మనం కూడా పాపలతో తిరుగొచ్చు కదా అనే ఆలోచనలు వస్తాయి. డబ్బు కావాలంటే ఈజీగా బెట్టింగ్ యాప్స్ వాడి డబ్బులు సంపాదించొచ్చు.. మనం కూడా ఈజీగా డబ్బు సంపాదించుకుంటే లగ్జరీగా బ్రతికేయొచ్చు. వేరే ప్రాంతాలకు వెళ్లొచ్చు. వేరే దేశాల పాపలతో తిరగవచ్చు అని ఆలోచనలో పడి ఆ బెట్టింగ్ యాప్స్ లో డబ్బు పెడతాడు. దాంతో ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు పోగొట్టుకొని, చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు`` అంటూ మాధవి లత వ్యాఖ్యానించారు.