పాకిస్తానీ న‌టుల బ్యాన్.. రాజ్ థాక్రే సీరియ‌స్ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని, ఆ దేశ‌ నటులు భారతదేశంలో పనిచేయడానికి అనుమతించడం ఉగ్ర‌వాదాన్ని ప్రోత్సహించడమేన‌ని..;

Update: 2025-04-02 13:29 GMT
పాకిస్తానీ న‌టుల బ్యాన్.. రాజ్ థాక్రే సీరియ‌స్ హెచ్చ‌రిక‌

చాలా కాలంగా పాకిస్తానీ న‌టుల‌పై బాలీవుడ్‌లో నిషేధం అమ‌ల్లో ఉంది. పాక్ న‌టుల‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తే రావ‌ణ కాష్టం ర‌గులుతుంద‌ని చాలా కాలంగా మ‌హారాష్ట్ర న‌వ‌నిర్మాణ సేన హెచ్చ‌రిస్తూనే ఉంది. అయితే కొంత గ్యాప్ త‌ర్వాత వాణీ క‌పూర్ క‌థానాయిక‌గా, పాకిస్తానీ సూప‌ర్ స్టార్ ఫవాద్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `అబీర్ గులాల్` ఇండియాలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లై ఆక‌ట్టుకుంది. అయితే ఈ విడుద‌ల‌ను రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరతి బగాడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రావాల్సి ఉండ‌గా పొలిటిక‌ల్ కాక చెల‌రేగింది. థాక్రే పార్టీ హెచ్చ‌రించ‌డంతో భార‌త‌దేశంలో ఈ సినిమా భవితవ్యం ఇప్పుడు సందేహంగా మారింది. థాక్రే పిలుపున‌కు మ‌ద్ధ‌తిస్తూ ప‌లువురు ప్ర‌త్య‌క్షంగా సోష‌ల్ మీడియాల్లో ఈ సినిమాని వ్య‌తిరేకిస్తున్నారు. పాకిస్తానీ న‌టుడి పునః ప్ర‌వేశాన్ని నిరాక‌రించిన ఎంఎన్ఎస్, సినిమా రిలీజ్ ని అడ్డుకుంటామ‌ని హెచ్చరించింది.

 

పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందని, ఆ దేశ‌ నటులు భారతదేశంలో పనిచేయడానికి అనుమతించడం ఉగ్ర‌వాదాన్ని ప్రోత్సహించడమేన‌ని.. ఇది పాకిస్తానీ ఉగ్ర‌వాదుల‌కు ఆర్థిక ప్రయోజనాలను అందించ‌డ‌మేన‌ని ఎంఎన్ఎస్ పార్టీ నాయకులు వాదించారు. ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌కు మ‌ద్ధ‌తునిచ్చి మ‌న దేశాన్ని అస్థిర‌ప‌రిచే పాకిస్తానీలు దేశంలో పేరు సంపాదించ‌డాన్ని అనుమ‌తించ‌బోమ‌ని థాక్రే పార్టీ హెచ్చ‌రించింది.

నిజానికి పాకిస్తాన్‌తో సాంస్కృతిక సహకారాన్ని థాక్రే పార్టీ చాలా కాలంగా వ్యతిరేకిస్తోంది. తాజా హెచ్చ‌రిక‌ల‌తో అబీర్ గులాల్ రిలీజ్ సందిగ్ధంలో ప‌డిన‌ట్ట‌యింది. నిజానికి పుల్వామా దాడి తర్వాత అబీర్ గులాల్‌కు భారతీయ స్టూడియోలు మద్దతు ఇవ్వ‌డం లేదని, భారతీయ చిత్రాలలో పాకిస్తాన్ కళాకారుల ప్రవేశాన్ని నిర్మాతల‌ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ పండిట్ పేర్కొన్నారు.

భారతదేశంలో పనిచేస్తున్న పాకిస్తానీ కళాకారులపై చట్టపరమైన నిషేధం లేనప్పటికీ, వారితో సహకరించకూడదని చిత్ర పరిశ్రమ స్వతంత్ర నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. సినిమా విడుదలను సమీక్షించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సి)ని ఆయన కోరారు. భవిష్యత్తులో పరిశ్రమ సాంకేతిక నిపుణులు వారితో క‌లిసి ప‌ని చేయ‌డాన్ని నిషేధిస్తూ భారతీయ చిత్రనిర్మాతలకు హెచ్చరిక జారీ చేశారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ అధ్యక్షుడు బిఎన్ తివారీ ఈ సినిమా గురించి తనకు తెలియదని అన్నారు. అయితే ప‌లు సంఘాలు పాకిస్తానీ నటుల ప్ర‌వేశాన్ని వ్యతిరేకిస్తున్నా కానీ.. భారత ప్రభుత్వం వారిని ఇంకా అధికారికంగా నిషేధించలేదు. ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో పాకిస్తానీ న‌టుల‌తో ప‌ని చేయాలా వ‌ద్దా? అనే గంద‌ర‌గోళం ప్ర‌స్తుతానికి ఉంద‌ని కూడా ఇండ‌స్ట్రీ వ్య‌క్తులు ప్ర‌స్థావిస్తున్నారు.

Tags:    

Similar News