మూవీ రివ్యూ : వీర ధీర శూర
సామి.. పితామగన్.. అపరిచితుడు చిత్రాలతో ఒకప్పుడు మామూలు హిట్లు కొట్టలేదు విక్రమ్. కానీ ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో ఆ స్థాయి విజయం ఒక్కటీ అందుకోలేకపోయాడు.;

'వీర ధీర శూర' రివ్యూ
నటీనటులు: విక్రమ్-దుషారా విజయ్-ఎస్.జె.సూర్య- సూరజ్-పృథ్వీ తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: తేని ఈశ్వర్
నిర్మాత: రియా షిబు
రచన-దర్శకత్వం: ఎస్.యు.అరుణ్ కుమార్
సామి.. పితామగన్.. అపరిచితుడు చిత్రాలతో ఒకప్పుడు మామూలు హిట్లు కొట్టలేదు విక్రమ్. కానీ ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో ఆ స్థాయి విజయం ఒక్కటీ అందుకోలేకపోయాడు. గత ఏడాది వచ్చిన 'తంగలాన్' సైతం అనుకున్నంతగా ఆడలేదు. ఇప్పుడు తన నుంచి వచ్చిన కొత్త చిత్రం.. వీర ధీర శూర. ప్రామిసింగ్ ప్రోమోలతో ఆకట్టుకున్న ఈ సినిమా.. విక్రమ్ నిరీక్షణకు తెరదించేలా ఉందా? తెలుసుకుందాం పదండి.
కథ:
కాళి (విక్రమ్) ఒక మామూలు మధ్య తరగతి మనిషి. అతను కిరాణా కొట్టు నడుపుతుంటాడు. తనకు భార్య (దుషారా విజయన్) ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇంటి అవసరాల రీత్యా ఆమె కూడా చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఐతే ఒక రోజు రాత్రి కాళి మాజీ యజమాని అయిన రవి (పృథ్వీ).. ఓ అవసరం మీద కాళిని కలుస్తాడు. ఎస్పీ నుంచి కాపాడి తన కొడుకు కన్నా (సూరజ్)ను తీసుకు రావాలని కోరతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో కాళి ఆ పనికి ఒప్పుకుంటాడు. ఐతే ఈ పనికి కాళినే అడగడానికి కారణం ఉంటుంది. పదేళ్ల ముందు కాళికి ఒక భయానక గతం ఉంటుంది. అప్పుడు అతనేం చేశాడు.. తర్వాత ఎందుకు మారిపోయాడు.. ఇప్పుడు తిరిగి పాత దారిలోకి వెళ్లిన అతను అనుకున్నది సాధించాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
కమర్షియల్ సినిమాల్లో హీరోను అనేక రకాల పాత్రల్లో చూశాం. సాధారణంగా కనిపిస్తూ అసాధారణమైన పనులు చేయడం 'బాషా' రోజుల నుంచి ఉన్నదే. ఐతే 'వీర ధీర శూర' కోసం ఇప్పటిదాకా ఏ స్టార్ హీరోనూ చూడని ఒక కొత్త పాత్రలో చూపించాడు దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్. హీరో ఇందులో కిరాణా కొట్టు నడుపుకుంటూ ఉంటాడు. అలాంటి పాత్రలోనూ హీరోయిజం పండించవచ్చన్న ఆలోచన సూపర్. ఈ ఐడియా అనే కాదు.. 'వీర ధీర శూర'లో దర్శకుడు ఎగ్జిక్యూట్ చేసిన కొన్ని సీన్లు చూసి వావ్ అనుకుంటాం. 'పార్టులు పార్టులుగా చూస్తే ఇది కూడా బాగుందే' అనే డైలాగుని గుర్తుకు తెచ్చేలా.. ఈ చిత్రంలోనూ కొన్ని సీన్లను విడివిడిగా చూస్తే భలేగా అనిపిస్తాయి. కానీ ఒక సినిమాగా చూస్తే మాత్రం 'వీర ధీర శూర' మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. అసలు విషయం ఏంటో క్లారిటీగా చెప్పకుండా.. హీరో నేపథ్యం సహా సినిమాలో కాన్ఫ్లిక్ట్ కు దారి తీసే విషయాలను విడిపించి విడిపించనట్లు చూపించిన దర్శకుడు.. ప్రేక్షకులను ఆరంభం నుంచి చివరిదాకా కన్ఫ్యూజ్ చేస్తూనే ఉంటాడు. ఈ గందరగోళం వల్ల సినిమాను సరిగా ఆస్వాదించలేం. సినిమా అయ్యాక కొన్ని సీన్లు గుర్తుండిపోతాయి కానీ.. ఓ సంతృప్తికర సినిమాను చూశాం అనే ఫీలింగ్ మాత్రం కలగదు.
ఇప్పుడొచ్చిన 'వీర ధీర శూర'ను పార్ట్-2 పేరుతో రిలీజ్ చేయడం విశేషం. పార్ట్-1 తర్వాత వస్తుందట. ఐతే ఇది అర్థం కావాలంటే పార్ట్-1 చూసి తీరాల్సిందే అని చాటి చెప్పడం కోసమే దర్శకుడు ఈ సినిమాలో ఎక్కడ లేని గందరగోళాన్ని నింపేశాడేమో అనిపిస్తుంది. సినిమాలో అత్యంత కీలకమైన విషయాలను విడమరిచి చెప్పకపోవడంలో ఆంతర్యమేంటో దర్శకుడికే తెలియాలి. ఉదాహరణకు హీరో ట్రిగ్గర్ అయి తన విశ్వరూపం చూపించడానికి ఒక సంఘటన దారి తీస్తుంది. తన మిత్రుడిని ఒక పోలీస్ చంపేస్తే.. అతను బదులుగా తన ఉగ్రరూపం చూపిస్తాడు. పోలీస్ స్టేషన్లోకి అర్ధనగ్నంగా వెళ్లి హీరో రెచ్చిపోయే సీన్ ప్రేక్షకులకు షాకిస్తుంది. దీన్ని ఎగ్జిక్యూట్ చేసిన తీరు సూపర్. కానీ ఆ మిత్రుడు ఎలా చనిపోయాడో దృశ్యరూపంలో చూపించకపోగా.. కనీసం మాటల్లో కూడా క్లారిటీ ఉండదు. ఇక ఆ ఫ్రెండు హీరోకు ఎంత ముఖ్యం అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ జరగనపుడు హీరో రివోల్ట్ లో ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది? కథను.. పాత్రలను కనెక్ట్ చేయకుండా కేవలం సన్నివేశాలు బాగా తీసినంత మాత్రాన ప్రేక్షకులు ఎగ్జైట్ అయిపోరు కదా? ఈ సమస్య సినిమా అంతా కొనసాగుతుంది. తన గతాన్ని అంతా పక్కన పెట్టేసి పదేళ్లుగా కిరాణా కొట్టు నడుపుకుంటున్న హీరో.. మళ్లీ తన పాత అవతారంలోకి మారడానికి కూడా సరైన కారణం కనిపించదు. అసలు తన ఉద్దేశమేంటో సరిగా చూపించలేదు.
ద్వితీయార్ధంలో హీరో ఒక టాస్క్ మీద వచ్చాక తనతో పాటు అతను టార్గెట్ చేయాల్సిన ఎస్పీ.. హీరోను ముగ్గులోకి దింపిన విలన్ గ్యాంగ్.. ఇలా అందరూ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు చూపించి కథను రక్తి కట్టించడానికి ప్రయత్నించాడు కానీ.. ఎవరు ఎందుకు అలా చేస్తున్నారన్న దానిపై క్లారిటీ ఉండదు. దీంతో ఏ పాత్ర ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్థం కాదు. దీని వల్ల కథ మీద ప్రేక్షుకులకు ఏకాగ్రత కుదరదు. అంతకంతకూ ఆసక్తి తగ్గిపోతుంది. ఐతే ఈ గందరగోళాన్ని పక్కన పెడితే.. చివరి అరగంటలో ఎపిసోడ్లు మాత్రం అదిరిపోతాయి. అప్పటిదాకా కామ్ గా కనిపించే హీరో.. ఉన్నట్లుండి విజృంభించడం మొదలయ్యాక అన్నీ మరిచిపోయి తెరకు కళ్లప్పగించేస్తాం. కథలో వచ్చే మలుపులు.. యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటాయి. విక్రమ్ పెర్ఫామెన్స్ పీక్స్ అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పతాక సన్నివేశాల్లో అదిరిపోయింది. ఒక దశలో పూర్తిగా ట్రాక్ తప్పేసిన 'వీర ధీర శూర' చివరి అరగంటలో మాత్రం ఎంగేజ్ చేస్తుంది. కానీ చివరికి వచ్చేసరికి సమాధానాలు లేని ప్రశ్నలు మాత్రం వెంటాడుతాయి. అసలీ కథలో లాజిక్కులే కుదరలేదు. బహుశా భవిష్యత్తులో వచ్చే 'పార్ట్-1'తో అన్ని ప్రశ్నలకూ సమాధానాలు లభిస్తాయేమో. కానీ 'పార్ట్-2'లోని గందరగోళం ఈ సినిమాకు ఎలాంటి ఫలితాన్నిస్తుందన్నదే ప్రశ్న.
నటీనటులు:
తన సినిమాలు ఫెయిలైనా నటుడిగా విక్రమ్ ఫెయిలవడం అరుదు. పాత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే అతను.. క్యారెక్టర్ కు తగ్గట్లు తనను తాను గొప్పగా మలుచుకోవడం.. అందులో ఒదిగిపోవడంలో దిట్ట. 'వీర ధీర శూర'లోనూ విక్రమ్ అదే చేశాడు. కిరాణా కొట్టు నడుపుకునే ఒక సాధారణ వ్యక్తిగా విక్రమ్ ప్రేక్షకులను కొన్ని నిమిషాల్లోనే ఒప్పిస్తాడు. అదే సమయంలో అవసరం వచ్చినపుడు తన వీరత్వాన్ని చూపించే సన్నివేశాల్లోనూ అదరగొట్టాడు. తనకు జోడీగా నటించిన దుషారా విజయన్ కూడా బాగా చేసింది. ఎస్పీ పాత్రలో ఎస్.జె.సూర్య జస్ట్ ఓకే అనిపిస్తాడు. తన విలక్షణతను చాటే అవకాశం ఈ క్యారెక్టర్ ఇవ్వలేదు. సూర్య మీద అంచనాలు పెట్టుకున్న వాళ్లకు నిరాశ తప్పదు. మలయాళ నటుడు సూరజ్ కీలక పాత్రలో మెప్పించాడు. తెలుగు నటుడు పృథ్వీకి ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్ర దక్కింది. ఎక్కువగా కామెడీ చేసే పృథ్వీ సీరియస్ పాత్రలోనూ ఆకట్టుకున్నాడు.
సాంకేతిక వర్గం:
జి.వి.ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు పెద్ద అసెట్. ప్రేక్షకులకు ఒక మూడ్లోకి తీసుకెళ్లేలా ఆర్ఆర్ సాగుతుంది. కీలకమైన సన్నివేశాల్లో ఇంటెన్సిటీని పెంచిన తీరు ఆకట్టుకుంటుంది. పాటలకు సినిమాలో పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్న రెండు పాటలు సోసోగా అనిపిస్తాయి. తేని ఈశ్వర్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ ఎస్.యు.అరుణ్ కుమార్ విక్రమ్ ను ఇలాంటి పాత్రలో చూపించాలనుకోవడం మంచి ఎత్తుగడే. కాన్సెప్ట్ కూడా బాగానే రాసుకున్నాడు. కానీ ఎగ్జిక్యూషన్లో గందరగోళం సినిమాను కిందికి లాగేసింది. చివరి అరగంటను మినహాయిస్తే రేసీ స్క్రీన్ ప్లే లేకపోవడం మైనస్ అయింది. కొన్ని సీన్ల వరకు బాగా డీల్ చేసినా.. సినిమా అంతా ఒక ఫ్లోలో సాగేలా చూసుకోలేకపోయాడు.
చివరగా: వీర ధీర శూర.. సీన్లు బావున్నాయ్ కానీ సినిమానే!
రేటింగ్- 2.25/5