దెబ్బ మీద దెబ్బ..గాయం ముదురుతోందా!

ఈ వైఫ‌ల్యం అజిత్ కి పెద్ద లెక్క కాదు. కానీ లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి మాత్రం మ‌రో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్లే.

Update: 2025-02-13 05:52 GMT

త‌ల అజిత్ స‌క్సెస్ స్పీడ్ కి `విదాముయార్చీ` బ్రేకులు వేసిన సంగ‌తి తెలిసిందే. సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నా ల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. తెలుగు స‌హా త‌మిళ్ లోనూ తేలిపోయింది. భారీ యాక్ష‌న్ సన్నివేశాలకు మంచి పేరొచ్చిన‌ప్ప‌టికీ...అజిత్ ఇమేజ్ తో భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్టినప్ప‌టీకీ లాంగ్ ర‌న్ లో సినిమా నిలబ‌డ‌లేక‌పోయింది. దీంతో అజిత్ ఖాతాలో మ‌రో ప్లాప్ చిత్రంగా `విదాముయార్చి` మిగిలి పోయింది.

ఈ వైఫ‌ల్యం అజిత్ కి పెద్ద లెక్క కాదు. కానీ లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి మాత్రం మ‌రో గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్లే. ఈ సినిమా బ‌డ్జెట్ 200 కోట్ల‌పైనే వినిపించింది. వ‌సూళ్లు చూస్తూ క‌నీసం అందులో స‌గం కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది. 75 నుంచి 90 కోట్ల మ‌ధ్య‌లోనే రిక‌వ‌రీ చేసిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో వ‌స్తోన్న వార్త‌లు. ఇప్ప‌టికే లైకా సంస్థ తీవ్ర న‌ష్టాల్లో ఉంది. గ‌త కొంత కాలంగా ఆ సంస్థ నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలేవి కూడా విజ‌యం సాధించ‌డం లేదు.

ఆ సంస్థ‌కు `పొన్నియ‌న్ సెల్వ‌న్ 2` త‌ర్వాత ఒక్క విజ‌యం కూడా లేదు. 'చంద్ర‌ముఖి-2',' మిష‌న్ చాప్ట‌ర్ 1', 'లాల్ స‌లామ్', 'ఇండియ‌న్ -2', 'వెట్టేయాన్' చిత్రాల‌న్నీ కూడా ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. వీటిలో కొన్ని చిత్రాలు డిజాస్ట‌ర్ల‌ను న‌మోదు చేసాయి. రూపాయి లాభం మాట ప‌క్క‌న‌బెట్టు... క‌నీసం పెట్టుబ‌డి కూడా తేలేక పోయాయి. అన్నీ భారీ కాన్వాస్ పై తెర‌కెక్కిన చిత్రాలే. రాజీ లేని నిర్మాణం తో రూపొందినవే.

అన్ని సినిమాల‌కు వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసారు. కానీ వాటి ఫ‌లితాలు మాత్రం తీవ్ర నిరాశ‌నే మిగిల్చాయి. ప్ర‌స్తుతం 'ఇండియ‌న్ 3'ని కూడా లైకా సంస్థ‌నే నిర్మిస్తుంది. 'ఇండియ‌న్ 2' ఫెయిలైన నేప‌థ్యంలో ఈ సినిమాపై ఎలాంటి బ‌జ్ లేదు. ఈ సినిమా పూర్తి చేసి..రిలీజ్ చేసే వ‌ర‌కూ గానీ గ్యారెంటీ లేద‌న ప్ర‌చారం ఇప్ప‌టికే జ‌రుగుతోంది. అలాగే మాలీవుడ్ లో లూసీఫ‌ర్ 2ని కూడా ఇదే సంస్థ నిర్మిస్తుంది. 'లూసీఫ‌ర్' భారీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో రెండ‌వ భాగంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. మ‌రి ఈసినిమా అయినా లైకాకి ఊర‌ట‌నిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News