‘రెయిడ్’ 2 టీజర్.. మిస్టర్ బచ్చన్ గుర్తొస్తోంది!
అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన రెయిడ్ (2018) చిత్రం కమర్షియల్ గా బాలీవుడ్ లో బాగానే ఆడింది.;

అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన రెయిడ్ (2018) చిత్రం కమర్షియల్ గా బాలీవుడ్ లో బాగానే ఆడింది. కానీ ఆ సినిమాపై కొంత నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. అయితే తన నిజాయితీతో కూడిన ఐఆర్‌ఎస్ ఆఫీసర్ పాత్ర ద్వారా మంచి అజయ్ మంచి మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్‌గా రెయిడ్ 2 వస్తుండటంతో బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా హైలెట్ అవుతోంది. శుక్రవారం ఉదయం విడుదలైన టీజర్‌తో ఈ సినిమా హడావుడి మొదలైంది.
ఇందులో అజయ్ మరోసారి అమయ్ పట్నాయక్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈసారి అతని టార్గెట్ చోటా అవినీతి చేపలపై కాదు.. ఓ రాజకీయ తిమింగలం ‘దాదాభాయ్’గా నటిస్తున్న రితేష్ దేశ్‌ముఖ్ పైన. టీజర్‌లోనే అమయ్ పట్నాయక్ తన సర్వీసులో 74 రైడ్స్ చేయడం, 74 సార్లు ట్రాన్స్‌ఫర్ కావడం చూపించడంతో పాత్రకు బలం చేకూర్చింది. మొదటి భాగంలో విలన్‌గా కనిపించిన సౌరభ్ శుక్లా జైలులో నుంచి ఈసారి స్టోరీని నెరేట్ చేస్తూ కనిపించడం ఆసక్తికరం.
ఇక రితేష్ దేశ్‌ముఖ్ స్టైలిష్ రాజకీయ నాయకుడిగా చూపించడమే కాకుండా, అజయ్ దేవగణ్‌తో డైలాగ్ యుద్ధం పడేలా డిజైన్ చేయడమే హైలైట్. యాక్షన్, భారీగా డబ్బు మూటలు, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది. మే 1న సినిమా రిలీజ్ కానుండగా, ఫ్యాన్స్ దీన్ని భారీ హిట్‌గా ఊహిస్తున్నారు. కానీ ఇది చూసిన తెలుగు ఆడియెన్స్ మాత్రం తక్షణమే గత ఏడాది వచ్చిన మిస్టర్ బచ్చన్ గుర్తు చేసుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా రెయిడ్ కు రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
రవితేజ నటించినప్పటికీ, ఇందులో కథలో కమర్షియల్ అంశాలు జోడించడంతో అసలు టోన్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రేక్షకులు అసలు కనెక్ట్ కాలేకపోయారు. చివరికి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఈ నేపధ్యంలో ఇప్పుడు రెయిడ్ 2 కి అంచనాలున్నా, ఓ అనుమానం ప్రేక్షకులలో నెలకొంది. తెలుగులో కథలు మార్చడమే కాకుండా, కథలోని అసలు స్ఫూర్తిని కూడా మార్చడం వల్లే మిస్టర్ బచ్చన్ విఫలమైంది. కానీ హిందీలో మాత్రం మేకర్స్ ఆ రిస్క్ తీసుకోకుండా, కథను న్యాచురల్‌గా కొనసాగించడమే కాకుండా, విలన్ పాత్రకు బలమైన నటుడిని ఎంపిక చేయడం హైలైట్‌గా నిలిచింది.
రితేష్ దేశ్‌ముఖ్ గతంలో కూడా విలన్‌గా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఆయనను పూర్తిగా పవర్ఫుల్ లీడర్ గా చూపించేందుకు దర్శకుడు రాజ్ కుమార్ గుప్తా ప్లాన్ చేసిన తీరు టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.. అజయ్ దేవగణ్, రితేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటోంది. మొత్తానికి బాలీవుడ్‌లో రెయిడ్ 2 సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. మరి పూర్తిస్థాయి సినిమా ఎలా ఉంటుందనేది చూడాలి.