హిందీ సినిమాలను సౌత్ ఆడియన్స్ చూడరు!
ఉత్తరాది దర్శకులు ఎంత గొప్ప చిత్రం చేసినా? హిందీ సినిమాలు అనే సరికి సౌత్ ఆడియన్స్ అంత ప్రాధాన్యత ఇవ్వరు. ఇది ఎప్పటి నుంచో సౌత్ లో ఉన్నదే;

బాలీవుడ్ సినిమాలకు సౌత్ లో పెద్దగా ఆదరణ ఉండదన్నది వాస్తవం. ఉత్తరాది దర్శకులు ఎంత గొప్ప చిత్రం చేసినా? హిందీ సినిమాలు అనే సరికి సౌత్ ఆడియన్స్ అంత ప్రాధాన్యత ఇవ్వరు. ఇది ఎప్పటి నుంచో సౌత్ లో ఉన్నదే. ఇప్పటికీ కొనసాగుతుంది. ఓటీటీ కంటెంట్ వచ్చిన తర్వాత హిందీ సినిమాలకు ఇప్పుడిప్పుడే సౌత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ప్రత్యేకంగా తెలుగు ఆడియన్స్ ఈ మధ్య కాలంలో ఆసక్తి చూపిస్తున్నారు.
డిఫరెంట్ జానర్ సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా `సికిందర్` ప్రమోషన్ లో భాగంగా సల్మాన్ ఖాన్ ఇదే విషయాన్ని వెల్లడించారు. `సౌత్ సినిమాలను హిందీ ఆడియన్స్ చూస్తారు. కానీ హిందీ సినిమాలను సౌత్ ఆడియన్స్ చూడరు. నేను ఎంతో మంది సౌత్ టెక్నీషియన్లతో పనిచేసాను. కానీ నా సినిమాలు దక్షిణాదిలోపెద్దగా ఆడటం లేదు. భారీ బడ్జెట్ సినిమాలు తీయడం అన్నది చాలా కష్టంతో కూడిన పని. అందుకు బలమైన స్క్రిప్ట్ ఉండాలి` అన్నారు.
అయితే బాలీవుడ్ సినిమాలు సౌత్ లో చూడకపోవడానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. హిందీ సినిమా రిలీజ్ అన్నది కేవలం మెట్రో పాలిటన్ సిటీస్ లో కూడా పరిమితంగానే రిలీజ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా హిందీ సినిమా గురించి ముంబై నుంచి హైదరాబాద్, చెన్నై, వైజాగ్, బెంగుళూరు లాంటి పట్టణాలకు ప్రత్యేకంగా వచ్చి ప్రమెట్చేయడం జరగదు. ఒక వేళ చేసినా ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లేలా ఆ ప్రమోషన్ ఉండదు.
బేసిక్ గా బాలీవుడ్ సినిమాలు ప్రమోషన్ అనేదే సరిగ్గా ఉండదు. రిలీజ్ కు ముందు ముంబైలో ఓ ప్రెస్ మీట్ పెట్టి తేల్చేస్తారు. ప్రీరిలీజ్ ఈవెంట్లు..ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లు...టీజర్ రిలీజ్ ఈవెంట్లు లాంటివి హిందీ సినిమాలు ప్రత్యేకంగా చేయరు. నేరుగా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తారు. అలాంటి ప్రచారం సౌత్ లో చేస్తే వర్కౌట్ అవ్వదు. మా సినిమా చూడండి చూడండి అని రిలీజ్ వరకూ ప్రేక్షకుల్లోనే హీరో, హీరోయిన్లు ఉండాలి.
సౌత్ సినిమాలు హిందీ ఆడియన్స్ చూస్తున్నారంటే? కారణం రిలీజ్ వరకూ సౌత్ సినిమాల ప్రచారం పీక్స్ లో ఉంటుంది గనుకే. ఇటీవల రిలీజ్ అయిన ఛావా సినిమా హిందీ వెర్షన్ కి మంచి టాక్ రావడంతో? అదే చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి హిందీ వెర్షన్ తోపాటు రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు వచ్చేవి అన్నది ట్రేడ్ కూడా భావించింది. తెలుగు ఆడియన్స్ తెలుగులో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అడిగే వరకూ గానీ రిలీజ్ చేయలేదు. హిందీ సినిమాలు తెలుగులో ఆ రకంగా వెనుకబడుతున్నాయన్నది కాదనలేని వాస్తవం.