ఒకే ఏడాదిలో 6 పురస్కారాలతో లిరిసిస్ట్ ఘనత
``తెలుగులో పుట్టాం.. తెలుగులో పెరిగాం... తెలుగులో ఎదుగుతాం.. తెలుగులో బతుకుతాం.. తెలుగులో చనిపోతాం..`` అని ఉద్విగ్నంగా వ్యాఖ్యానించారు
``తెలుగులో పుట్టాం.. తెలుగులో పెరిగాం... తెలుగులో ఎదుగుతాం.. తెలుగులో బతుకుతాం.. తెలుగులో చనిపోతాం..`` అని ఉద్విగ్నంగా వ్యాఖ్యానించారు చంద్రబోస్. జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ ని ప్రముఖ సినీ నటుడు శ్రీ ప్రదీప్ హైదరాబాద్ శిల్పకళావేదికలో సన్మానించారు. చంద్రబోస్ రచించిన గీతాల గురించి మనసులోని మాటలను తెలియజేస్తూ సాగించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో బోస్ కృషిని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని I FLY STATION ఆధ్వర్యంలో నిర్వహించారు. గాయనీ గాయకులు గీతామాధురి దీపు పి విఎన్ఎస్ రోహిత్, సత్య యామిని, అతిథి భావరాజు, సాయి చరణ్ బోస్ పాటలతో వేదికను రక్తి కట్టించారు. ఈ కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరు అయ్యారు. వారిలో మురళీ మోహన్ , సంగీత దర్శకురాలు శ్రీలేఖ, రచయిత రామ జోగయ్య శాస్త్రి, జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.
చంద్రబోస్ మాట్లాడుతూ... ``ఎవరు హీరో అంటే.. పాట హీరో.. సంగీతం హీరో... సాహిత్యం హీరో. నేను నా మొదటి పాటకు శ్రీలేఖ గారు అద్భతమైన బాణి ఇచ్చారు. అప్పుడు నేను ఇంజినీరింగ్ చదువుతున్నాను. అప్పుడు నన్ను రామానాయుడు గారు ఎంతో ప్రోత్సహించారు. 95లో మొదలైన నా ప్రయాణం... 2023 వరకు 28 సంవత్సరంలో 800 సినిమాల్లో 3600పైగా పాటలు రాశాను. నాకు నా జీవితానికి పరిపూర్ణత తీసుకువచ్చిన సంతవత్సరం 2023, ఫిబ్రవరిలో గోల్డెన్ గ్లోబ్, రెండవదిహాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్, మూడవది క్రిటిక్స్ అవార్డ్స్, నాలుగవది ఆస్కార్, ఐదవది బాంబే హంగామా అవార్డు, ఆరవది జాతీయ పురస్కారం. ఇలా ఈ ఏడాదిలో ఆరు అవార్డుల వర్షం కురిసింది. తెలుగుకి వెయ్యి ఏళ్ల సాహిత్య చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాష చరిత్ర ఉంది. తెలుగులో పుట్టాం.. తెలుగులో పెరిగాం... తెలుగులో ఎదుగుతాం, తెలుగులో బతుకుతాం, తెలుగులో చనిపోతాం.. ఇక నాటు నాటు సాంగ్ రాసే అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, కీరవాణి గారికి ఈ పాటను అలపించిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ గారికి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ గారికి ధన్యవాదాలు. నాటు నాటు పాటను 45 నిమిషాల్లో రాసినప్పటికీ.. దాన్ని పూర్తి చేయడానికి ఏడాదికి పైగా పట్టింది. అంత సహనంగా ఉన్నందుకు ప్రతిఫలం దక్కింది. ప్రతి గాయకుడికి, ప్రతి దర్శకుడికి, ప్రతి సంగీత దర్శకుడికి ధన్యవాదాలు`` అని అన్నారు. వేదికపై బోస్ తన ప్రయాణానికి సహకరించిన మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ప్రదీప్ రుణం తీర్చుకోవాలని అన్నారు.
ముఖ్య అతిథి మురళి మోహన్ మాట్లాడుతూ... చంద్రబోస్ మొట్ట మొదటి సారిగా తెలుగు సినిమాకు ఆస్కార్ తీసుకువచ్చిన మహానీయుడు. భారతీయ చిత్రసీమ ఆయన్ని చూసి గర్వపడుతుంది. ఒకే సంవత్సరంలో అస్కార్ అవార్డు.. అదే సంవత్సరంలో జాతీయ అవార్డు తీసుకువచ్చిన ఏకైనా లిరిసిస్ట్ చంద్రబోస్. ఆయన గెలుపు వెనుక సతీమణి సుచిత్ర ఉన్నారు. వీరి పాట ఆట అద్భుతం... వీరు ఆదర్శంగా ఉన్నారు. సుచిత్ర మా పక్కింటి అమ్మాయి. వాళ్ల నాన్న గారు మ్యూజిక్ డైరెక్టర్. బోస్ - సుచిత్ర ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్ అదర్. ఇక ఆస్కార్ అవార్డుకు వెళ్లే ముందు చంద్రబోస్ సుచిత్రను పిలిచారు. కానీ ఆమె రాను మీరు వెళ్లండని చెప్పింది. దానికి కారణం పూజ గదిలో నుంచి బయటకు రాకుండా పూజలు నిర్వహించింది`` అని తెలిపారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ... సభా ముఖంగా చంద్రబోస్ గారికి అభినందనలు. చాలా గర్వంగా అనిపిస్తుంది. నా మనసు ఉప్పోంగిపోతుంది. ఎవరి ప్రయాణం అయినా చిన్నగా మొదలు అవుతుంది. పెద్దగా ముగుస్తుంది. నిరంతరం నిత్య విద్యార్థిగా ఉంటూ.. చంద్రబోస్ ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన జీవితం గొప్పది. ఆదర్శం అంటూ కొనియాడారు.