మూవీ రివ్యూ : మదగజరాజా
విశాల్ హీరోగా తమిళ సీనియర్ దర్శకుడు సుందర్.సి ఎప్పుడో పుష్కర కాలం కిందట చేసిన సినిమా.. మదగజరాజా.
'మదగజరాజా' మూవీ రివ్యూ
నటీనటులు: విశాల్-అంజలి-వరలక్ష్మి శరత్ కుమార్-సంతానం-సోనూ సూద్-ఆర్య-శరత్ సక్సేనా-సుధ-సుబ్బరాజు-సదగోపన్ రమేష్-మనోబాల తదితరులు
సంగీతం: విజయ్ ఆంటోనీ
ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం.నాథన్
నిర్మాతలు: అక్కినేని మనోహర్ ప్రసాద్-అక్కినేని ఆనంద్ ప్రసాద్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుందర్.సి
విశాల్ హీరోగా తమిళ సీనియర్ దర్శకుడు సుందర్.సి ఎప్పుడో పుష్కర కాలం కిందట చేసిన సినిమా.. మదగజరాజా. అనివార్య కారణాలతో సుదీర్ఘ కాలం విడుదలకు నోచుకోని ఈ చిత్రం.. సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజై ఘనవిజయం సాధించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
మదగజరాజా (విశాల్) తన ఊరిలో కేబుల్ టీవీ వ్యాపారం చేస్తూ రాజాలా బతుకుతున్న కుర్రాడు. అతను ఒక కేసు పని మీద తన తండ్రితో కలిసి తన ఊరికి వచ్చిన మాధవి (అంజలి)తో ప్రేమలో పడతాడు. కానీ రాజా తండ్రి వాళ్లిద్దరిని అవమానించి ఊరి నుంచి పంపించేస్తాడు. ఆమె కోసం వెతుకుతుతున్న క్రమంలోనే తన చిన్ననాటి టీచర్ ఇంట్లో పెళ్లికి స్నేహితులతో కలిసి వెళ్తాడు రాజా. అక్కడ పెళ్లికూతురికి ఎదురైన సమస్యను పరిష్కరించి ఇంటికి బయల్దేరుదామని అనుకున్న సమయంలోనే తన స్నేహితుల్లో ఇద్దరు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు వెల్లడవుతుంది. వారి జీవితాలను అంధకారం చేసింది విశ్వనాథ్ (సోనూ సూద్) అనే బడాబాబు అని తెలుసుకుంటాడు రాజా. మీడియా అధినేతగా, రాజకీయాల్లో చక్రం తిప్పే వ్యక్తిగా తిరుగులేని స్థాయిలో ఉన్న విశ్వనాథ్ తో సామాన్యుడైన రాజా సమరానికి సై అంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన ఇబ్బందులేంటి.. వాటిని అధిగమించి విశ్వనాథ్ మీద అతను ఎలా విజయం సాధించాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
హీరో కేబుల్ టీవీ నడిపే మామూలు కుర్రాడు. విలనేమో ఓవైపు టీవీ ఛానెళ్లు నడుపుతూ, ఇంకోవైపు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ.. మరోవైపు రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటాడు. తాను అభినందించడానికి వస్తే వెయిట్ చేయించాడని ఏకంగా ముఖ్యంత్రినే మార్చడానికి సిద్ధపడే లెవెల్లో ఉంటాడు విలన్. అతణ్ని కలవాలంటే అపాయింట్మెంట్ కోసం ఆరు నెలలు ఆగాల్సిన పరిస్థితి. అలాంటి వ్యక్తి ఇంటికి ఆవారా గాడిలా కనిపించే హీరో తాను సీబీఐ ఆఫీసర్ అని చెప్పి వెళ్లిపోతాడు. అంతే కాదు.. మా ఫ్రెండుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేయ్.. లేదంటే నిన్ను నడి రోడ్డు మీదికి తీసుకొచ్చేస్తా అని సవాల్ చేస్తాడు. చివరికి చెప్పినట్లే విలన్ని రోడ్డు మీదికి తీసుకొచ్చేస్తాడు కూడా. విలన్ ఎంత పెద్ద వాడైనా.. సామాన్యుడైన హీరోకు ఎదురే లేనట్లు చూపించే ఇలాంటి సగటు కమర్షియల్ కథలు దశాబ్దాల కిందట వచ్చేవి. అయినా ఇప్పుడీ కథకు తమిళ ప్రేక్షకులు పట్టం కట్టేశారు. వాళ్లకు అంతగా ఇందులో ఏం నచ్చిందో కానీ.. తమిళ సినిమాలను ఎప్పుడో వెనక్కి నెట్టేస్తూ.. వినూత్నమైన కథలతో.. పెద్ద కాన్వాసుల్లో రూపొందుతున్న తెలుగు సినిమాలకు అలవాటు పడ్డ మన ప్రేక్షకులకు మాత్రం 'మదగజరాజా' చాలా సాధారణమైన సినిమాలాగే అనిపించొచ్చు. కొత్తదనం రవ్వంతైనా లేని ఈ చిత్రంలో కామెడీ.. యాక్షన్.. గ్లామర్.. ఇలా కమర్షియల్ సినిమాలకు అవసరమైన దినుసులన్నింటినీ లెక్కలేసి దట్టించాడు సుందర్.
'మదగజరాజా' ఆద్యంతం ఒక సగటు కమర్షియల్ సినిమా టెంప్లేట్లో సాగిపోతుంది. ఆపదలో ఉన్న హీరోయిన్-ఆమె తండ్రిని కాపాడ్డానికి సూపర్ హీరోలా ఎంట్రీ ఇచ్చి ఫైటింగ్ చేసే ఇంట్రో ఎపిసోడ్ నుంచి.. ప్రతి సీనూ ఎక్కడో చూసినట్లే అనిపిస్తుంది. తన వాళ్లకు కష్టమంటూ వస్తే ఏం చేయడానికైనా.. ఎక్కడిదాకా వెళ్లడానికైనా సిద్ధపడే హీరో పాత్ర మూస ధోరణిలో సాగుతుంది. ఐతే ఆరంభంలోనే సినిమా ఎలా ఉండబోతోందో ఒక అంచనా వచ్చేస్తుంది కాబట్టి.. దానికి అలవాటు పడిపోయి ఉన్నంతలో వినోదం వెతుక్కోవడానికి ప్రయత్నించాలి. ఎంత రొటీన్ గా సాగుతున్నా సరే.. సంతానం తన వింటేజ్ ఫాంను చాటుకుంటూ.. పంచుల వర్షం కురిపించడం 'మదగజరాజా'లో అతి పెద్ద రిలీఫ్. తన టైమింగుకి సూటయ్యేలా డబ్బింగ్ కూడా బాగా కుదరడంతో అతను స్క్రీన్ మీద కనిపించినపుడల్లా నవ్వులు పండుతాయి. విశాల్ నుంచి ఆశించే భారీ ఫైట్లకు ఢోకా లేదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో అవి వస్తూ ఉంటాయి. ఇక అంజలి.. వరలక్ష్మి శరత్ కుమార్ గ్లామర్ విందు కూడా బాగానే చేశారు. ముఖ్యంగా వరలక్ష్మి రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. హీరో ఏదో ఒక మంచి పని చేయడం.. లేదంటే మంచి మాట చెప్పడం.. అవతల హీరోయిన్లు ఫ్లాట్ అయిపోవడం.. అలా పాట అందుకోవడం.. ఇలా నరేషన్ పరంగా చాలా ఏళ్ల వెనక్కి తీసుకెళ్తాడు సుందర్.
'మదగజరాజా'లో ప్రధానంగా టైంపాస్ చేయించేది కామెడీనే. కథ పరంగా ఎక్కడా ఎగ్జైట్మెంట్ కలగదు. విలన్ కు ఇచ్చే బిల్డప్పుకి.. అతడి ప్రవర్తనకు అసలు పొంతన ఉండదు. హీరోకు అసలు ఛాలెంజ్ అంటూ ఏమీ ఉండదు. చిన్న లాక్ వేయడం.. దాన్ని అతను ఛేదించి తాను ఏమనుకుంటే అది చేసేయడం.. ఇలా వన్ సైడెడ్ గా నడుస్తుంది కథ. అలాంటపుడు ఇక కథలో సంఘర్షణ ఏముంటుంది? చచ్చిపోయిన వ్యక్తిని బతికున్నట్లుగా చూపించి డ్రామా నడుపుతూ కామెడీ పండించే ప్రయత్నం ఎన్నో సినిమాల్లో చూశాం. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం'లోనూ చూసిన అదే కామెడీని.. ఇందులో ఒక లెంగ్తీ ఎపిసోడ్ గా పెట్టారు. రెండేళ్ల కిందటే చనిపోయిన మనోబాల ఆ పాత్రలో కనిపించడం చూసి నవ్వాలో బాధ పడాలో అర్థం కాదు. పన్నెండేళ్ల కిందటే చనిపోయిన మణివణ్ణన్ సైతం ఇందులో ఒక పాత్ర చేయడం గమనార్హం. కథకు తోడు ఈ పాత్రలు.. ముఖ్య పాత్రధారుల లుక్స్.. ఇదెంత పాత సినిమా అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. కాబట్టి 'మదగజరాజా' మన ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కుతుంది అన్నది సందేహమే.
నటీనటులు:
విశాల్ కు ఇలాంటి మాస్ పాత్రలు కొట్టిన పిండి. తన ఆహార్యానికి.. ఇమేజ్ కు సరిపోయే మాస్ పాత్ర కావడంతో అతను చాలా హుషారుగా నటించాడు. 12-13 ఏళ్ల ముందు చేసిన సినిమా కావడంతో అప్పుడు తన లుక్ కూడా బాగుంది. యాక్షన్ సీక్వెన్సుల్లో ఎప్పట్లాగే అదరగొట్టాడు. అంజలి కెరీర్ ఆరంభంలో చేసిన సినిమా కావడంతో తన నటనలో ఇప్పుడున్న పరిణతి కనిపించదు. పెద్దగా నటించడానికి స్కోప్ ఉన్న పాత్ర కూడా కాదు. గ్లామర్ పరంగా మాత్రం ఆకట్టుకుంది. గత కొన్నేళ్లలో తెలుగులో విలక్షణ పాత్రల్లో అదరగొట్టిన వరలక్ష్మిని ఇందులో గ్లామర్ గర్ల్ గా చూసి ఆశ్చర్యపోతాం. అందాల ఆరబోతలో ఆమె ఏమాత్రం తగ్గలేదు. విలన్ పాత్రలో సోనూ సూద్ రొటీన్ అనిపిస్తాడు. ఇలాంటి పాత్రలు ఆయన చాలానే చేశాడు. సంతానం కామెడీ సినిమాలో మేజర్ హైలైట్. అతడి కామెడీనే లేకుంటే.. 'మదగజరాజా'ను తట్టుకోవడం కష్టమయ్యేది. సుబ్బరాజు.. సుధ.. సత్యకృష్ణ.. గాయత్రిరావు లాంటి తెలుగు నటులు ఇందులో నటించారు. ఐతే వాళ్ల పాత్రలకు ప్రాధాన్యం అంతంతమాత్రమే. మిగతా ఆర్టిస్టులంతా మామూలే.
సాంకేతిక వర్గం:
ఇప్పుడు హీరోగా బిజీగా ఉన్న విజయ్ ఆంటోనీ.. కేవలం సంగీతానికే పరిమితమైన రోజుల్లో చేసిన సినిమా ఇది. ఒక సగటు మాస్ మూవీకి అవసరమైన సంగీతాన్ని అందించాడతను. పాటలు ఊర మాస్ గా సాగుతాయి. కొంచెం శబ్ద కాలుష్యం ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. నేపథ్య సంగీతం ఓకే. రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు ఈ సినిమా తీసిన రోజుల ప్రమాణాల మేరకు బాగానే ఉన్నాయి. ఇక కథకుడు-దర్శకుడు సుందర్.సి అంటేనే రొటీన్ మాస్ సినిమాలకు పెట్టింది పేరు. సినిమా ఆయన స్టయిల్లో సాగిపోయింది. కామెడీ విషయంలో తన బలాన్ని సుందర్ మరోసారి చూపించాడు. అంతకుమించి సుందర్ ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. రొటీన్ కథను అంతే రొటీన్ గా నరేట్ చేశాడు.
చివరగా: మదగజరాజా.. రొటీన్ మాస్ రాజా
రేటింగ్ - 2.5/5