బ్యాన్ నెట్‌ఫ్లిక్స్.. మెగా ఫ్యాన్స్ బిగ్ షాక్

ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ భార‌త్ స‌హా చాలా దేశాల్లో త‌న స్పీడ్ పెంచేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌ణాళిక‌ల‌తో సిద్ధ‌మ‌వుతున్న వేళ ఇది ఊహించ‌ని పంచ్

Update: 2024-07-27 17:44 GMT

ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ భార‌త్ స‌హా చాలా దేశాల్లో త‌న స్పీడ్ పెంచేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌ణాళిక‌ల‌తో సిద్ధ‌మ‌వుతున్న వేళ ఇది ఊహించ‌ని పంచ్. నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రీడ్ హేస్టింగ్స్ డెమాక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థి, భార‌తీయురాలైన‌ కమలా హారిస్‌ను ఆమోదించి, ఆమెకు 7 మిలియన్ల డాల‌ర్లు విరాళంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోగా, ప్ర‌త్య‌ర్థి నాయ‌కుడైన‌ ట్రంప్ మెగాభిమానులు బిగ్ షాకిచ్చారు. చాలా మంది ట్రంప్ మద్దతుదారులు నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని రద్దు చేసుకుంటున్న ఫోటోలను వెబ్ లో పోస్ట్ చేస్తున్నారు.

కొన్ని చ‌ర్చ‌ల త‌ర్వాత మేం మ‌ళ్లీ గేమ్‌లో ఉన్నాము! అని హేస్టింగ్స్ ఒక ప్ర‌క‌ట‌న‌లో వ్యాఖ్యానించ‌డ‌మే గాక‌, తాను ఒక్క రాజ‌కీయ పార్టీ అభ్యర్థికి అందించిన అతిపెద్ద విరాళం ఇదేనని పేర్కొన్నారు. రీడ్ హేస్టింగ్స్ తన భారీ విరాళాన్ని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ అభిమానులు నెట్‌ఫ్లిక్స్‌కు గుణపాఠం చెప్పాలనుకున్నారు. న్యూయార్క్ టైమ్స్ వివ‌రాల‌ ప్రకారం.. హేస్టింగ్స్ అతడి భార్య ప్యాటీ క్విలిన్ ఇటీవలి కొన్నేళ్ల‌లో డెమోక్రటిక్ పార్టీకి 20 మిలియన్ డాల‌ర్ల‌కు పైగా విరాళం ఇచ్చారు. ''కమలా హారిస్‌కు అభినందనలు - ఇప్పుడు గెలవాల్సిన సమయం వచ్చింది'' అన హేస్టింగ్స్ త‌న ప్ర‌క‌ట‌న‌లో ఆకాంక్షించారు.

అయితే అత‌డి ప్ర‌క‌ట‌న అనంత‌రం ప్రధానంగా ట్రంప్ MAGA మద్దతుదారులతో కూడిన మస్క్ X సైన్యం ఆయుధాలను సిద్ధం చేసారు. భారీ విరాళం కారణంగా నెట్ ఫ్లిక్స్ స‌భ్య‌త్వాల‌ను రద్దు చేసుకుంటున్నామ‌ని చాలా మంది స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తున్నారు. జోబిడెన్ అధ్య‌క్షు రేసులో క‌మ‌లా హారిస్ పేరును ప్ర‌క‌టించిన‌ మొదటి 24 గంటల్లో పార్టీ మ‌ద్ధ‌తు కోసం 81 మిలియన్ డాల‌ర్లు వసూలయ్యాయి. ఇప్పుడు బరాక్ ఒబామా- మిచెల్ ఒబామా ఆమోదం తర్వాత కమలా ... ట్రంప్‌కు వ్యతిరేకంగా బలమైన ప్రచారాన్ని తెర‌పైకి తేవాల‌ని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ బ్రాండ్లు , నాయకులు క‌మ‌లా హారిస్‌కు మద్దతు ఇవ్వడంతో ట్రంప్ మద్దతుదారులు సోషల్ మీడియాల్లో తమ కోపాన్ని వెళ్లగక్కుతున్నారు.

కమ్యూనిస్టులకు మద్దతు ఇచ్చే కంపెనీలకు నేను మద్దతు ఇవ్వను #CancelNetflix అని ఒక నెటిజ‌న్ స్పందించ‌గా, ఇది కేవలం విరాళం మాత్రమే కాదు.. వారు తీవ్ర వామపక్ష ఎజెండాకు మద్దతు ఇస్తున్నారని చాలా మంది నెట్ ఫ్లిక్స్ అధినేత‌ను విమ‌ర్శించారు. ''మీరు ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్ కస్టమర్ అయినా మీరు అమెరికాను ప్రేమిస్తున్నట్లయితే, మీరు మార్క్సిస్ట్ కమలా హారిస్‌కు నిధులు సమకూరుస్తున్నందున నెట్‌ఫ్లిక్స్‌ను రద్దు చేయాల్సిన సమయం వచ్చింద‌ని ఒక నెటిజ‌న్ రాసారు.

అయితే నాణేనికి మ‌రో వైపు కూడా ఉంది. హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే Netflix హారిస్‌కు డబ్బును విరాళంగా ఇవ్వలేదు. నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ తన వ్యక్తిగత సంపద నుండి విరాళం ఇచ్చారు. అతడు ఇకపై నెట్ ఫ్లిక్స్ కు సీఈవో కూడా కాదు. కాబట్టి నెట్‌ఫ్లిక్స్‌ను రద్దు చేయడం ద్వారా మీరు అతడికి ఎలాంటి న‌ష్టం క‌లిగించ‌డం లేదు! అని ఒక నెటిజ‌న్ రాసారు. కానీ చాలా మంది హేస్టింగ్ నిర్ణయానికి మద్దతు పలికారు. వారి సభ్యత్వాన్ని మరో 8 సంవత్సరాలు పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నామ‌ని కూడా తెలిపారు.

Tags:    

Similar News