నెపోటిజంపై మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

'కన్నప్ప' ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఓ నేషనల్ మీడియాతో బంధుప్రీతి గురించి మాట్లాడారు.

Update: 2025-01-23 04:43 GMT

ఇండియన్ సినిమాలో నెపోటిజం మీద ఎన్నో దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నాయి. బంధుప్రీతి అనేది ప్రతిభావంతులైన అవుట్ సైడర్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే అంశంపై ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతూ వచ్చారు. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించినప్పుడు ఈ విషయం మీద విపరీతంగా డిస్కసన్ జరిగింది. నటి కంగనా రనౌత్ లాంటి వారు కొందరు తరచుగా నెపో స్టార్స్ ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. లేటెస్టుగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఇండస్ట్రీలోని నెపోటిజంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు

'కన్నప్ప' ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఓ నేషనల్ మీడియాతో బంధుప్రీతి గురించి మాట్లాడారు. సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉందనే విషయాన్ని అంగీకరించిన విష్ణు.. అయితే అది డెబ్యూకు మాత్రమే ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. టాలెంట్ ఉంటేనే జనాలు ఎంకరేజ్ చేస్తారని, లేకపోతే పరిశ్రమలో నిలబడలేరని అన్నారు. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తనలో ఏదో టాలెంట్ ఉందని ఆడియన్స్ నమ్మారని, తనను యాక్సెప్ట్ చేశారన్నారు. అందుకే తాను ఇన్నేళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నానని విష్ణు పేర్కొన్నారు.

“నెపోటిజం అనే పదాన్ని ఒక దశాబ్ద కాలం నుంచి మనం ఎక్కువగా వింటున్నాం. స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి రావడం ఈజీ అని ప్రజలు మాట్లాడినప్పుడు నాకు నవ్వొస్తుంది. బంధుప్రీతి అనేది ఫస్ట్ మూవీకి అడ్వాంటేజ్ అవుతుంది. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మా తండ్రి ఒక లెజెండరీ యాక్టర్, ప్రొడ్యూసర్ కాబట్టి నాకు ఫస్ట్ ఫిలిం చేసే అవకాశం వచ్చింది. ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు. అయినా సరే ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేశారు. నాలో ఏదో టాలెంట్ ఉందని, నేనేదో చేయలగనని వాళ్ళు నమ్మారు కాబట్టే, నేను ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను. ఒక యాక్టర్ గా నా మీద వాళ్ళకి హోప్స్ లేకపోతే, నా సినిమాలు చూడటానికి థియేటర్ కు ఎందుకు వస్తారు?, ఈరోజుకీ నా గురించి ఎందుకు మాట్లాడుకుంటారు?" అని మంచు విష్ణు అన్నారు.

సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు తనయుడిగా 'రగిలే గుండెలు' అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేశారు విష్ణు. 2003లో 'విష్ణు' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. 'ఢీ' సినిమాతో ఫస్ట్ కమర్షియల్ సక్సెస్ రుచి చూశారు. దేనికైనా రెడీ, దూసుకెళ్తా, ఈడో రకం వాడో రకం వంటి చిత్రాల్లో అలరించారు. చివరగా 2022లో 'జిన్నా' మూవీతో ఆడియన్స్ ను పలకరించిన విష్ణు.. ఇప్పుడు తన రాబోయే చిత్రం 'కన్నప్ప'ను దూకుడుగా ప్రమోట్ చేస్తున్నాడు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఇందులో మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు నటించారు. చాలా కాలంగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న విష్ణు.. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Tags:    

Similar News