ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో వస్తోన్న ఓటీటీ సూపర్ స్టార్!

ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సినిమాలను విడుదల చేసిన మనోజ్.. ''డిస్పాచ్'' అనే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవున్నారు.

Update: 2024-10-26 10:30 GMT

బాలీవుడ్‌ వర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన కెరీర్ లో నాలుగు నేషనల్ ఫిలిం అవార్డ్స్ అందుకున్నారంటేనే.. ఆయన ఎలాంటి నటుడో అర్థం చేసుకోవచ్చు. ప్రేమకథ, హ్యాపీ, కొమరం పులి, వేదం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు. 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ ఆయన్ను మరింత దగ్గర చేసింది. ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీసులు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు సినిమాలను విడుదల చేసిన మనోజ్.. ''డిస్పాచ్'' అనే మరో కొత్త చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవున్నారు.

మనోజ్ బాజ్‌పేయ్ ప్రధాన పాత్రలో, తిత్లీ ఫేమ్ కాను బెహ్ల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ''డిస్పాచ్''. వాస్తవ సంఘటనల ఆధారంగా, క్రైమ్ జర్నలిజం నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను రోనీ స్క్రూవాలా నిర్మించారు. ఇందులో ఇండియాలోని బిగ్గెస్ట్ స్కామ్ ను బయటపెట్టడానికి ప్రయత్నించే ఒక జర్నలిస్ట్ పాత్రలో మనోజ్ కనిపించనున్నారు. సహనా గోస్వామి, రితుపర్ణ సేన్, అర్చిత అగర్వాల్, నిఖిల్ విజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. చాలా నెలల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. విడుదలకు రెడీ అవుతోంది. కాకపోతే థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీ వేదికగా రిలీజ్ కాబోతోంది. అయితే జాతీయ ఉత్తమ నటుడు నటించిన ఈ సినిమాకి ఎందుకనో పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.

'డిస్పాచ్' సినిమా Zee5 ఓటీటీలో విడుదల కానుంది. మేకర్స్ ఇంకా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు. ఈ సినిమా ఇప్పటికే మామి (MAMI-2024) ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ చేయబడింది. యూనిక్ కాన్సెప్ట్ తో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లతో రూపొందిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. జీ5 టీమ్ ఈ విషయాన్ని తెలియజేస్తూ, మామి ఫెస్టివల్ లో ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ చూసి థ్రిల్ అయ్యామని చెప్పారు. ఎంటర్టైన్మెంట్ అందించే ఒరిజినల్ కంటెంట్ తీసుకురావాలనే తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కమిట్మెంట్ ను ఈ సక్సెస్ మరోసారి రుజువు చేసిందని తెలిపారు.

మరోవైపు, మనోజ్ బాజ్‌పేయ్ సైతం 'డిస్పాచ్‌' మూవీ ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. దర్శకుడు కాను బెహ్ల్ ను ప్రశంసించిన మనోజ్.. అతని పాత్ర కథనంతోపాటుగా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుందని అన్నారు. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం గురించి తాజాగా మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మంచి సినిమాని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే తన ఏకైక లక్ష్యమైన చెప్పారు. MAMI ఫిల్మ్ ఫెస్టివల్ లో 'డెస్పాచ్' & 'ది ఫేబుల్' సినిమాలు పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడంపై సంతోషం వ్యక్తం చేసారు.

ఇండిపెండెంట్ సినిమాల గురించి మనోజ్ బాజ్ పాయ్ ప్రస్తావిస్తూ ‘‘నాకు ఇది సినిమా. సినిమా అనేది ఒక కళారూపం. ఇది సౌండ్, వీఎఫ్ఎక్స్ వంటి అనేక అంశాలను కలిగి ఉంటుంది. వినోదం కోసం మాత్రమే కాకుండా.. నైపుణ్యం కళాత్మకతతో విభిన్న కథలను అన్వేషించడానికి కలిసి వస్తుంది. ఎంటర్టైన్ చేయాలంటే, కళాత్మకంగా చేయాలి" అని అన్నారు. "మేము సినిమాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. జోరామ్, డెస్పాచ్, ది ఫేబుల్ చిత్రాలను అలానే తీసుకొచ్చాం. ప్రేక్షకులు థియేటర్‌లకు వస్తారో లేదో నేను అంచనా వేయలేను, కానీ వారు వస్తారని నేను ఆశిస్తున్నాను. జనాలు చూస్తారనే అంచనాతో ఎవరైనా సినిమాలు తీస్తారు. క్వాలిటీ సినిమాకి ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించడానికి యాక్సెసబిలిటీ అనేది కీలకం. అదే మా లక్ష్యం'' అని తెలిపారు.

ఈరోజుల్లో దాదాపుగా అందరికీ ఓటీటీ యాక్సెస్ ఉంది కాబట్టి, తన సినిమాని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడం ద్వారా ఎక్కువమందికి చేరుతుందని మనోజ్ బాజ్ పాయ్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికైతే 'డిస్పాచ్‌' మూవీకి బజ్ లేదు. ప్రమోషనల్ కంటెంట్ విడుదలైన తర్వాత ఈ సినిమా గురించి జనాల్లో డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత, కంటెంట్ బాగుందని టాక్ వస్తే, విశేష ప్రేక్షకాదరణ దక్కుతుంది. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లో మనోజ్‌కి ఉన్న పాపులారిటీని పరిగణనలోకి తీసుకుంటే, ఈ సినిమా జనాల్లోకి వెళ్లడం పెద్ద కష్టమేమీ కాదనే అనుకోవచ్చు. మరి త్వరలోనే Zee5 ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News