`పుష్ప 2` లబ్ డబ్.. హిందీ బెల్ట్‌లో అంచనా ఇలా ఉంది!
తాజాగా ఉత్తరాదికి చెందిన ప్రముఖ సినీవిశ్లేషకుడు, మరాఠా మందిర్ అధినేత మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ.
ఇటీవలి కాలంలో పాన్ ఇండియన్ సినిమాల టార్గెట్ ఒక్కటే. దేశంలో విస్తారంగా టికెట్లు తెగే ఉత్తరాది (హిందీ) మార్కెట్ ని కొల్లగొడితే మెజారిటీ కలెక్షన్స్ రాబట్టినట్టే. ఏదైనా సినిమా పాన్ ఇండియాలో బంపర్ హిట్ అన్న టాక్ వస్తే, అందులో సగం పైగా వసూళ్లు ఉత్తరాది ఎగ్జిబిషన్ నుంచి మాత్రమే సాధ్యం. అందుకే ఇటీవల దక్షిణాది నుంచి రిలీజవుతున్న సినిమాలన్నీ హిందీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కుతున్నాయి.
ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వం వహించిన `పుష్ప 2: ది రూల్` డిసెంబర్ 5న విడుదలకు సిద్దమవుతుండగా, ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ట్రైలర్ ఆశించిన రేంజుకు చేరుకుంది. దీనికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ ట్రైలర్ పెంచిన ఉత్సాహంతో దేశంలోని చాలా రికార్డులను పుష్ప2 తిరగరాయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హిందీ బెల్ట్ లో పుష్పరాజ్ రఫ్ఫాడిస్తాడన్న నమ్మకం మేకర్స్ లో ఉంది.
తాజాగా ఉత్తరాదికి చెందిన ప్రముఖ సినీవిశ్లేషకుడు, మరాఠా మందిర్ అధినేత మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ... పుష్ప 2 ట్రైలర్ అన్నిచోట్లా దూసుకెళ్లిందని, దీంతో ఉత్తరాదినా ప్రీరిలీజ్ బిజినెస్ కి ఎదురే లేదని వ్యాఖ్యానించారు. అయితే పుష్ప 1తో పోలిస్తే పుష్ప 2 పాటలు ఆశించినంతగా హిందీ ఆడియన్స్ కి చేరువ కాలేదని ఆయన చెప్పారు. పుష్ప 1 పాటలు అన్ని భాషల్లో బంపర్ హిట్. పుష్ప ట్రాక్ లను ఆడియన్స్ విపరీతంగా ఆస్వాధించారు. పుష్ప డైలాగులు కూడా ఇప్పటికీ ట్రెండింగులో ఉన్నాయి. కానీ సీక్వెల్ విషయంలో అది రిపీటవుతుందా లేదా? అన్న సందేహం వ్యక్తం చేసారు ఆయన. సీక్వెల్ పాటల గురించి తనకు ఇప్పటివరకు ఎలాంటి ఆలోచనా లేదని అన్నారు. రెండవ భాగం హిందీ పాటలు `పుష్ప: ది రైజ్`తో పోలిస్తే తగినంత సంచలనాన్ని సృష్టించలేదని అన్నారు.
అయితే పుష్ప 2 కి ఉత్తరాదిన భారీ ప్రీరిలీజ్ బిజినెస్ సాధ్యమే. ట్రైలర్ కావాల్సినంత బూస్ట్ ఇచ్చింది. మొదటి రోజు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే చాలు వసూళ్ల హవాకు తిరుగుండదని కూడా ఆయన అంచనా వెలువరించారు. మొదటి భాగంలో మాదిరిగానే బన్ని యాక్షన్, ఆహార్యం, డైలాగులు, హుక్ స్టెప్పులు ఆడియన్స్ కి కనెక్టయితే అది సినిమాకి మరింత బజ్ పెంచుతుంది. మాస్ ఆడియన్స్ ని రిపీటెడ్ గా థియేటర్లకు రప్పించగలిగే వీలుందని అంచనా వేసారు. పుష్ప 2 హిందీ బెల్ట్ లోను ఇప్పటివరకూ ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసే అవకాశాన్ని కూడా ఆయన కొట్టి పారేయలేదు. 2024-25 సీజన్ లో పుష్ప 2 మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ది బెస్ట్ గా నిలుస్తుందని అతడు అంచనా వేస్తున్నారు.