75 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఎన్టీఆర్ తొలి పారితోషికం ఎంతంటే?

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ, అన్న‌గారు ఎన్టీఆర్ న‌టించిన మొద‌టి సినిమా ఏది? పాత త‌రం వెంట‌నే చెప్ప‌గ‌లుగుతుంది కానీ నేటి జెన్ -జెడ్ జ‌న‌రేష‌న్ కి గుర్తు చేయాల్సిన ప‌రిస్థితి ఉంది.

Update: 2024-11-24 07:42 GMT

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ, అన్న‌గారు ఎన్టీఆర్ న‌టించిన మొద‌టి సినిమా ఏది? పాత త‌రం వెంట‌నే చెప్ప‌గ‌లుగుతుంది కానీ నేటి జెన్ -జెడ్ జ‌న‌రేష‌న్ కి గుర్తు చేయాల్సిన ప‌రిస్థితి ఉంది. తెలుగు సినిమా 100 ఏళ్ల చ‌రిత్ర‌లో తొలిత‌రం పేజీల‌ను అలంక‌రించిన, వీకీ చ‌రిత్ర‌లో అసాధార‌ణ స్టార్‌గా ఏలిన మేటి న‌టుడు ఎన్టీఆర్ టాలీవుడ్ లో ప్రారంభ‌రోజుల‌ను ఓసారి స్మ‌రిస్తే...

`మన దేశం` ఎన్టీఆర్ న‌టించిన మొద‌టి చిత్రం. 1949లో విడుదలైన ఈ సాంఘిక చిత్రం విడుద‌లై నేటికి 75 సంవ‌త్స‌రాలు పూర్త‌యింది. ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు బ్రిటీష్ పోలీస్‌గా ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. దీనికి ఎల్.వి.ప్రసాద్ ద‌ర్శ‌కుడు. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా `విప్రదాస్` అనే బెంగాలీ నవల ఆధారంగా తెర‌కెక్కింది. భారత స్వాతంత్య్ర‌ సంగ్రామం ఈ చిత్ర కథకు నేపథ్యం.

ఈ చిత్రంతో పరిచయమైన ఎన్.టి. రామారావు తరువాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధులయ్యారు. అలాగే ఈ చిత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత దర్శత్వం వహించిన మొదటి సినిమా. గాయని పి. లీల కూడా ఈ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగంలో నేపథ్యగానంలో ప్రవేశించారు. ఇందులో రామారావు పోలీసు వేషం వేశాడు. సినిమా కథనంలో బుర్ర కథ, ఒగ్గు కథ, వీధి నాటకాలు, బొమ్మలాటలు వంటి సాంస్కృతిక కళారూపాలను కథ‌నానికి జోడించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను ఉప‌యోగించారు.

సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను, స్వాతంత్రం సిద్ధించిన తరువాత దిగజారిన విలువలను చూపించారు.

ఇది బెంగాలీ కథ ఆధారంగా వెలువడిన మొదటి తెలుగు సినిమా. తరువత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కథలుగా మారి విజయవంతమయ్యాయి. స్వాతంత్య్రం రాకముందు ప్రారంభించినప్పటికి కొన్ని కారణాలవల్ల స్వాతంత్య్రానంత‌రం పూర్తిచేసి విడుదల చేయ‌గ‌లిగారు. ఈ చిత్రంలో పోలీసు ఇన్స్పెక్టరు పాత్ర పోషించిన ఎన్.టి.ఆర్.కు రూ.2000 పారితోషికం ఇచ్చారు.

నిజంగానే లాఠీ ఛార్జ్ తో రెచ్చిపోయిన ఎన్టీఆర్:

ఎల్వీ ప్ర‌సాద్ వ‌ద్ద ఫోటో చూసిన నిర్మాత‌ బిఏ సుబ్బారావు ఎన్టీఆర్ ని స్క్రీన్ టెస్ట్ కి రావాల్సిందిగా పిల‌వ‌గానే విజ‌య‌వాడ నుంచి ఆయ‌న మ‌ద్రాసు రైలెక్కారు. అలా తొలిసారి సినిమా కోసం ఫోటోషూట్ లో పాల్గొన్నారు ఎన్టీఆర్. టెస్ట్ పూర్త‌య్యాక మ‌రో ఆలోచ‌న లేకుండా త‌ను తీస్తున్న `ప‌ల్లెటూరి పిల్ల` చిత్రంలో హీరోగా అవ‌కాశం క‌ల్పించారు. కానీ ఆ సినిమా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో మ‌ధ్య‌లో ఆగిపోయింది. అప్ప‌టికే ఎల్వీ ప్ర‌సాద్ మ‌న‌దేశం కాస్టింగ్ ఎంపిక‌లు పూర్తి చేసి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. ఇక ఈ సినిమాలో సీనియ‌ర్ న‌టులంతా ఓకే అయ్యాక చివ‌రిగా కానిస్టేబుల్ పాత్ర‌కు ఎన్టీఆర్ అయితే స‌రిపోతాడ‌ని ఎంపిక చేసుకున్నారు. హీరోని అరెస్ట్ చేసి ఉద్య‌మ‌కారుల‌ను అణ‌చివేసే సీన్ లో ఎన్టీఆర్ రంగ ప్ర‌వేశం.. అత‌డు పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఉద్య‌మ‌కారుల‌పై లాఠీ ఛార్జ్ చేసారు. దీంతో ఎన్టీఆర్ దూకుడుకు బెదిరిన ఎల్వీ ప్ర‌సాద్ ఇది రంగ‌స్థ‌లం కాద‌ని, అక్క‌డిలా కాకుండా ఇక్క‌డ కేవ‌లం కొడుతున్న‌ట్టు న‌టించాల‌ని సూచించారు. మొత్తానికి ఎన్టీఆర్ చ‌రిష్మా చూసాక ఇత‌డు పెద్ద స్టార్ అవుతాడ‌ని ఆరోజుల్లోనే ఎల్వీ ప్ర‌సాద్ అంచ‌నా వేసారు. కృష్ణ‌వేణి- మీర్జాపూర్ రాజా నిర్మించిన ఈ చిత్రంతో ఎన్టీఆర్ అనే న‌టుడు భార‌తీయ సినిమా తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు.

Tags:    

Similar News