మెగా సీక్వెల్ ఊసే లేదు కానీ ఇంతకీ ఇదేంటీ?
అయితే ఈ సినిమా సీక్వెల్ కథను హక్కుదారు అయిన అశ్వనిదత్ తెరకెక్కించే ముందే ఎవరైనా హైజాక్ చేస్తున్నారా? అంటే అవుననే వైజయంతి మూవీస్ సందేహిస్తోందట.
'జగదేక వీరుడు అతిలోక సుందరి'(1990) సీక్వెల్ ని తెరకెక్కిస్తామని మాతృక నిర్మాత అశ్వనిదత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవితో క్లాసిక్ మూవీ రీమేక్ పై దత్ చాలా ఆసక్తిగా ఉన్నారని కథనాలొచ్చాయి. అయితే ఈ సీక్వెల్ కోసం సరైన కథాంశాన్ని ఎవరూ రెడీ చేయలేదు. ఏళ్ల తరబడి వేచి చూసినా అభిమానులకు శుభవార్త అందలేదు. సరైన సీక్వెల్ స్క్రిప్టు లేకపోవడం వల్లనే ఈ చిత్రాన్ని ఇప్పటివరకూ పట్టాలెక్కించలేదని కూడా అభిమానులు భావిస్తున్నారు. కొందరైతే క్లాసిక్ మూవీని టచ్ చేసే ఆలోచనే రాంగ్ అని లైట్ తీస్కున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే ఈ సినిమా సీక్వెల్ కథను హక్కుదారు అయిన అశ్వనిదత్ తెరకెక్కించే ముందే ఎవరైనా హైజాక్ చేస్తున్నారా? అంటే అవుననే వైజయంతి మూవీస్ సందేహిస్తోందట. కారణం ఏదైనా కానీ జగదేకవీరుడు అతిలోక సుందరిని తెరకెక్కించిన మాతృ సంస్థగా సీక్వెల్ తీసే హక్కులు పూర్తిగా తమకు మాత్రమే ఉన్నాయని, ఇందులో పాత్రల్ని కానీ సన్నివేశాల్ని కానీ కాపీ కొట్టి లేదా తిరిగి సృజించే హక్కులు ఎవరికీ లేవని కూడా వైజయంతి సంస్థ తాజా నోట్ లో ప్రకటించడం కలకలం రేపింది. ఇంద్రలోకం నుంచి ఇంద్రుని కుమార్తె భూలోకానికి వచ్చి ఇక్కడ ఒక మానవుడితో ప్రేమలో పడడం అనే థీమ్ లైన్ తో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తెరకెక్కింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఈ థీమ్ లైన్ ని ఎవరూ కాపీ చేయడానికి లేదని కూడా దత్ నిర్మాణ సంస్థ ప్రకటనలో ఛూఛాయగా పేర్కొంది. ఏది ఏమైనా ఇంత సడెన్ గా వైజయంతి సంస్థ ఇలాంటి ప్రకటన వెలువరించడానికి కారణమేమిటో ఎవరికీ అర్థం కాలేదు.
అయితే ఇటీవలి కాలంలో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సీక్వెల్ తరహా సినిమాని తెరకెక్కించేందుకు ఒక యువదర్శకుడు ప్రయత్నిస్తున్నాడని, అది కూడా మెగాస్టార్ చిరంజీవితోనే ప్లాన్ చేసాడని గుసగుసలు వినిపించాయి. అయితే ఇది వైజయంతి మూవీస్ లో కాకుండా వేరే బ్యానర్ లో నిర్మిస్తున్న సినిమా కాబట్టి దత్ కాంపౌండ్ లో సందేహాలు పుట్టుకొచ్చాయని గుసగుస వినిపిస్తోంది. అలాగే ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమ్యాన్ లోను జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని పోలిన సన్నివేశాలు కనిపిస్తాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి. మరోవైపు మెగాస్టార్ 157ని లాంచ్ చేయనున్నారు. ఇలాంటి సమయంలో వైజయంతి ప్రకటన రకరకాల సందేహాల్ని రేకెత్తించింది. అయితే వీళ్లంతా జగదేక వీరుడు తరహా కథాంశాన్ని సృజిస్తున్నారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఇవన్నీ కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే.