ఆ ముగ్గురిలా మెగాస్టార్ కంబ్యాక్ అయ్యేదెలా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ బిగ్ డిజాస్టర్.
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ బిగ్ డిజాస్టర్. అంతకుముందు సైరా నరసింహారెడ్డి సహా పలు చిత్రాల్లో నటించినా కానీ ఆశించిన రేంజు విజయం దక్కలేదు. కొన్ని విజయాలు వచ్చినా విక్రమ్-జైలర్- గదర్ 2 తరహాలో చిరు పేరు మార్మోగలేదు. యునానిమస్ బ్లాక్ బస్టర్ మాత్రం దక్కలేదు. ఇటీవలి కాలంలో విక్రమ్ తో కమల్ హాసన్, జైలర్ తో రజనీకాంత్, గదర్2తో సన్నీడియోల్ లాంటి స్టార్ల గ్రేట్ కంబ్యాక్ గురించి విస్త్రతంగా చర్చ సాగింది. ఆ ముగ్గురి చుట్టూ ఇటీవల పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులను టేకాఫ్ చేస్తున్నారు. అయితే ఆ రేంజులో మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ అయ్యేదెపుడు?... అన్నదే ఇప్పుడు చిక్కు ప్రశ్న.
అయితే ఇప్పుడు చిరంజీవి నుంచి అలాంటి ఒక గొప్ప విజయవంతమైన చిత్రాన్ని అభిమానులు ఆశిస్తున్నారు. అతడు రీమేక్ ల జోలికి వెళ్లకుండా ఒరిజినల్ కథతో ఇలాంటి బ్లాక్ బస్టర్ కొట్టడం ద్వారా బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే దీనికోసం చిరు ఏం చేయబోతున్నారు? అంటే.. దానికి తాజాగా సమాధానం దొరికింది.
మెగాస్టార్ చిరంజీవి `భోళా శంకర్` సినిమాతో భారీ డిజాస్టర్‌ను ఎదుర్కొన్నారు. దీంతో ఇలాంటి చెత్త రీమేక్‌లు చేయడం మానేయాలని అభిమానుల్లో గొడవ ముదిరింది. అందుకే ఇప్పుడు చిరు బింబిసార ఫేమ్ వశిష్టతో చిత్రాన్ని ప్రకటించారు. ఇది ఒరిజినల్ కథతో రూపొందే సినిమా. పూర్తిగా దర్శకరచయితలు ఎఫర్ట్ పెట్టి ఒక కొత్త స్క్రిప్టును నెరేట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రం వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏప్రిల్ నాటికి చిత్రీకరణను ముగించి అటుపై పోస్ట్ ప్రొడక్షన్‌కి వెళ్లనున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్. అంటే భోళాశంకర్ తర్వాత ఏడాదిన్నరకు చిరు నుంచి తదుపరి సినిమా రానుందన్నమాట. కారణం ఏదైనా కానీ.. మెగాస్టార్ ఈసారి చాలా సమయం తీసుకుని అయినా ఒక మంచి విషయం సినిమాతో పునరాగమనం అదరగొట్టాలని కసిగా పని చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అలాగే కమల్ హాసన్ తరహాలో భారీ పాన్ ఇండియా చిత్రాలతో చిరు అదరగొట్టాలని కోరుకునే అభిమానులకు కొదవేమీ లేదు.
రజనీకాంత్ - కమల్ హాసన్- సన్నీడియోల్ లాంటి స్టార్లు లేటు వయసులో అద్భుతమైన బ్లాక్ బస్టర్లతో కంబ్యాక్ అయిన తీరు అందరిలో స్ఫూర్తిని నింపుతోంది. ఇప్పుడు చిరంజీవికి సమయం ఆసన్నమైంది. మళ్లీ అన్నయ్య గ్యాంగ్ లీడర్ - ఘరానా మొగుడు- రౌడీ అల్లుడు రోజుల్ని తిరిగి తేవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టే చిరు ప్లానింగ్ ఇకపై అయినా సాగుతుందని అంతా భావిస్తున్నారు.