డబ్బు లేదని కలని చంపుకోవద్దు!
నేను ఈరోజు ఈస్థాయిలో ఉన్నాను అంటేఅందుకు కారణం మీ ఆశీస్సులనే నమ్ముతాను.
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నిన్నటి రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా యువతని ఉద్దేశిస్తూ మిథున్ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలుచేసారు. 'నా జీవితంలో ఏదీ సులువుగా రాలేదు. ఎంతో కష్టపడ్డాను. నేను ఈరోజు ఈస్థాయిలో ఉన్నాను అంటేఅందుకు కారణం మీ ఆశీస్సులనే నమ్ముతాను.
మనదేశంలో ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారు. వారు ప్రయత్నిస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి బయటకు తీయగలగాలి. సక్సెస్ ఎలా చేరుకోవాలన్న దానిపై నిరంతరంపనిచేయాలి. నేను ప్రతిభావంతులకు చెప్పాలనుకున్నది ఒక్కటే.
మీ దగ్గర లేనిది డబ్బు మాత్రమే. అందుకోసం మీ ఆశయాలను ఎప్పుడూ చంపుకోకండి. కలలు కనండి వాటిని నెరవేర్చుకోవడం కోసం శ్రమించండి. విజయం ఏదో రోజు మీ ఇంటి గుమ్మం దగ్గర ఉంటుంది. రోజులన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు. పగలు తర్వాత రాత్రి ఎలాగో..వైఫల్యాల తర్వాత విజయం కూడా అంతే. ఇదే స్పూర్తితో యువత ముందుకు సాగాలి` అని అన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అలా ఎదిగిన నటులు ఎంతో మంది ఉన్నారు.
బిగ్ బీ అమితాబచ్చన్ నటుడు అయ్యే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నారు. నటుడిగా పనికిరావ్...ఇండస్ట్రీకి పనికి వచ్చే ముఖం నీదు కాదని ముఖం మీదనే చెప్పేవారు. అయినా ఆయన కృంగిపోలేదు. పట్టువదలకుండా ప్రయత్నం చేసి ఓ లెజెండ్ గా ఎదిగారు. తర్వాత తరం నటులకు స్పూర్తిగా నిలిచారు. ఆయన స్పూర్తితో ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన వాళ్లు ఎంతో మంది.