కొత్త రచ్చ.. సినిమా ఫంక్షన్ కి పెయిడ్ ఆడియన్స్
అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ ట్రెండ్ మొదలయ్యిందా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తోంది.
దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తున్న విషయం తెల్సిందే. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా దాదాపు అన్ని పార్టీలు కూడా మీటింగ్స్ కు, రోడ్డు షో లకు జనాలను డబ్బులు లేదా మందు బిర్యానీ ప్యాకెట్స్ ఇచ్చి తీసుకు వస్తున్నారు. ఈ నెల రోజులు కొంత మందికి అదే జీవనాధారం అనడంలో కూడా సందేహం లేదు. అయితే సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ ట్రెండ్ మొదలయ్యిందా అంటే ఔను అనే సమాధానం వినిపిస్తోంది.
ఇటీవల ఒక హిందీ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది. ఆ ఈవెంట్ గురించి మీడియాలో పెద్దగా ప్రచారం జరగలేదు, సినిమా విడుదల అయ్యింది... విడుదల తర్వాత కూడా సినిమా గురించి జనాలు మాట్లాడుకునే స్థాయిలో ఆడలేదు.
ఆ హిందీ సినిమా విడుదల అయ్యి ఫెయిల్ అవ్వడం, థియేటర్ల నుంచి వెళ్లి పోవడం కూడా జరిగింది. అయితే ఈ సమయంలో ఆ సినిమా నిర్మాతలు మరియు ఈవెంట్ నిర్వహించిన సంస్థ పై జూనియర్ ఆర్టిస్టులు కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం దుమారం రేపుతోంది.
అసలు విషయం ఏంటంటే.. ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ను నిర్వహించిన సంస్థ ఆడియన్స్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో కృష్ణా నగర్, యూసుఫ్ గుడా కు చెందిన వంద మంది జూనియర్ ఆర్టిస్టులను ఒకొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున మాట్లాడింది.
ముందుగా అనుకున్న ప్రకారం జూనియర్ ఆర్టిస్టులు సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరు అయ్యారు. కానీ వారికి అందాల్సిన పేమెంట్ మాత్రం అందలేదు. ఒక రోజు రెండు రోజులు వారం రోజులు చూసిన జూనియర్ ఆర్టిస్టులు నిర్మాణ సంస్థ పై మరియు ఈవెంట్ నిర్వహించిన సంస్థ పై ఫిర్యాదు చేశారు.
ఈ వింత కేసును చీటింగ్ కేసుగా పోలీసులు నమోదు చేసినట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే చిత్ర నిర్మాతలకు మరియు ఈవెంట్ సంస్థలకు నోటీసులు వెళ్లాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన నోటీసులు చూసి నిర్మాతలు షాక్ అయ్యారట. సినిమా పోయిన బాధలో ఉంటే ఈ నోటీసులు ఏంటి అంటూ ఈవెంట్ ను నిర్వహించిన సంస్థ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
ఈ వివాదాన్ని హైదరాబాద్ లో మేము పరిస్కరిస్తాం అంటూ ఈవెంట్ సంస్థ నిర్మాతలకు హామీ ఇచ్చిందని, ప్రస్తుతం పోలీసుల ద్వారా జూనియర్ ఆర్టిస్టులతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఇలాంటి పెయిడ్ ఆడియన్స్ ఈవెంట్స్ గతంలో ఎన్ని జరిగాయో కదా అంటూ ఇప్పుడు జనాలు గుసగుసలాడుకుంటున్నారు.