అండర్ వరల్డ్ మాఫియాకి ఝడిసి ముంబైకి వెళ్లని సినీప్రముఖుడు!
నగరంలో అండర్ వరల్డ్ మాఫియా సంస్కృతి కారణంగా ముంబైకి వెళ్లే అవకాశాన్ని తిరస్కరించినట్లు ఏఆర్ రెహమాన్ వెల్లడించారు.
నగరంలో అండర్ వరల్డ్ మాఫియా సంస్కృతి కారణంగా 1990ల ప్రారంభంలో ముంబైకి వెళ్లే అవకాశాన్ని తిరస్కరించినట్లు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ వెల్లడించారు. సుభాష్ ఘాయ్ లాంటి అగ్ర నిర్మాత నన్ను ముంబైకి రావాల్సిందిగా అడిగారు.. కానీ అప్పటి మాఫియా పరిస్థితుల వల్ల ముంబైకి మారలేదని రెహమాన్ తాజా ఇంటర్వ్యూలో మరోసారి చెప్పారు.
తనకు తాయిలాలు వేసి చెన్నై నుంచి షిఫ్ట్ చేయించాలని పలువురు నిర్మాతలు ప్రయత్నించినట్టు రెహమాన్ చెప్పారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ నుంచి తాను ముంబైకి మారితే ఓ పెద్ద నిర్మాత తనకు భారీ ఇల్లు ఇస్తానని `ది హిందూ` పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ చెప్పాడు. అయితే ఆ సమయంలో తాను ముంబై నగరంలో నివసించడం సౌకర్యంగా ఫీలవ్వలేనని చెప్పి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్టు వెల్లడించారు.
AR రెహమాన్ ఇంకా చాలా విషయాలపై ముచ్చటించారు. 1994 లో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన ఒక పెద్ద నిర్మాత నేను చెన్నై నుండి బయటికి మారితే బంజారాహిల్స్‌లో నాకు పెద్ద స్థలం ఇస్తానని చెప్పాడు. నేను అతనిని చూసి నవ్వాను. తర్వాత నేను ఉత్తరాది పరిశ్రమ(హిందీ)కి ప్రాధాన్యతనిచ్చినప్పుడు.. సుభాష్ ఘాయ్ నన్ను హిందీ నేర్చుకోమని అడిగారు. ఎందుకంటే అక్కడి ప్రజలు నన్ను ప్రేమిస్తారు. నాకు భాష తెలిసి ఉండాలి. కానీ అది ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా సంస్కృతి ఏల్తున్న సమయం.. కాబట్టి నేను అతడి అభ్యర్థనను కూడా పరిగణించలేదు.. అని రెహమాన్ వ్యాఖ్యానించారు.
``భారతదేశంలో పని చేసిన కొన్ని సంవత్సరాలకు నేను ఇంగ్లండ్‌లో పని చేసాను. కానీ నా భార్య భారతదేశానికి తిరిగి వెళ్లాలనుకునే ముందు UKలో మూడు నెలలు మాత్రమే గడిపింది. అప్పుడు US కు నా భార్య వెళ్లాలనుకుంది. కుటుంబం అందరికీ నచ్చినట్లు మేము అక్కడ ఒక ఇల్లు కూడా కొన్నాము. కానీ ఈసారి మళ్లీ నా ఆలోచన మారింది. అందరం తిరిగి చెన్నై ఇంటికి తిరిగి వచ్చేశాము`` అని తెలిపారు. ఆసక్తికరంగా రెహమాన్ అనేక హిందీ చిత్రాలకు పనిచేసినప్పటికీ ముంబైలో ఎప్పుడూ నివసించలేదు. ప్రస్తుతం ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో చెన్నైలో నివసిస్తున్నారు. ఆరుసార్లు జాతీయ అవార్డు పొందిన గాయకుడు-కంపోజర్ అయిన లెజెండరీ ఏ.ఆర్ రెహమాన్ వెల్లడించిన విషయాలు అభిమానులను ఎంతో ఆశ్చర్యపరుస్తున్నాయి.