'కిస్సిక్' సాంగ్.. 'ఊ అంటావా' రేంజ్ లో ఊపేస్తుందా?
రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో వచ్చిన ఈ పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
సుకుమార్ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. 'నాన్నకు ప్రేమతో' మినహా ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాల్లోనూ స్పెషల్ నంబర్ ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్ లో వచ్చిన ఈ పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. 'ఆర్య' మూవీలోని 'ఆ అంటే అమలాపురం' దగ్గర నుండి 'పుష్ప: ది రూల్' చిత్రంలోని 'ఊ అంటావా మావా' వరకు.. ప్రతీ పాట చార్ట్ బస్టర్ గా నిలిచింది. అందుకే 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ పై అందరి దృష్టి పడింది.
"పుష్ప 2: ది రూల్" సినిమా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కిస్సిక్' వచ్చేసింది. చెన్నైలో ఆదివారం గ్రాండ్ గా జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ లో ఈ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. తెలుగుతో పాటుగా తమిళ, హిందీ వెర్షన్ పాటను వదిలారు. కలర్ ఫుల్ సెట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల మీద ఈ పార్టీ సాంగ్ ను షూట్ చేశారు. ఈ పాట ఇలా వచ్చిందో లేదో, అలా మొదటి భాగంలో 'ఊ అంటావా'తో కంపేరిజన్స్ మొదలైపోయాయి.
'కిస్సిక్' సాంగ్ అప్డేట్ వచ్చినప్పుడే.. 'ఊ అంటావా' రేంజ్ లో ఉంటుందా? అంటూ చర్చలు జరిగాయి. అందులో ఐటమ్ బాంబ్ గా కనిపించిన సమంత రూత్ ప్రభును శ్రీ లీల మ్యాచ్ చేస్తుందా లేదా? అంటూ డిస్కషన్స్ చేశారు. ఎందుకంటే 'పుష్ప 1' ఐటమ్ సాంగ్ పాన్ ఇండియాని ఊపేసింది. డీఎస్పీ ట్యూన్, చంద్రబోస్ రాసిన లిరిక్స్.. సామ్ స్టెప్పులు, మత్తెక్కించే ఎక్స్ ప్రెసన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు 'కిస్సిక్' పాట బాగానే ఉందని అంటున్నారు కానీ, ఊ అంటావా స్థాయిలో లేదనే మాట వినిపిస్తోంది.
'కిస్సిక్' పాటకి 'దెబ్బలు పడతాయ్' అంటూ చంద్రబోస్ వెరైటీ లిరిక్స్ రాయగా.. సింగర్ సుబ్లాషిణి పాడారు. దీనికి గణేష్ ఆచార్య మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. లిరికల్ వీడియోలో ఒక్క స్టెప్పును మాత్రమే చూపించారు. ఊ అంటావా పాటలో బన్నీ ఒడిలో సమంత కూర్చొని వేసే ఫ్లోర్ మూమెంట్ హైలైట్ అయింది. చూడగానే ఆకట్టుకునే అలాంటి డ్యాన్స్ మూమెంట్ ను 'పుష్ప 2' సాంగ్ లో చూపించలేదు. దేవిశ్రీ ట్యూన్ కూడా ఇన్స్టెంట్ గా ఆకట్టుకునేలా లేదనే కామెంట్లు వస్తున్నాయి.
నిజానికి అన్ని పాటలు ఇనిస్టెంట్ గా హిట్టవ్వాలని లేదు. కొన్ని సాంగ్స్ వినగా వినగా బాగా ఎక్కుతాయి. మరికొన్ని పాటలు సినిమా రిలీజైన తర్వాత చాలా పెద్ద హిట్ అవుతాయి. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ విషయంలోనూ గతంలోనూ చాలా సార్లు ఇలానే జరిగింది. ఇప్పుడు 'కిస్సిక్' పాట కూడా అలానే జనాల్లోకి వెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొదటిసారి విన్నప్పుడు కాస్త మిశ్రమ స్పందన వచ్చినా.. రెండోసారి విన్నప్పుడు బెటర్ గా అనిపిస్తుందని అంటున్నారు. 'పుష్ప 2' లో ఈ స్పెషల్ సాంగ్ కచ్ఛితంగా స్పెషల్ గా ఉంటుందని, రాబోయే రోజుల్లో పాన్ ఇండియాని షేక్ చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.