సితార 50.. ఆ ఇద్దరిలో ఎవరంటే..

హారిక హాసిని అనుబంధ సంస్థగా ఇండస్ట్రీలోకి వచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ వరుస సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంటోంది;

Update: 2025-03-20 16:53 GMT

హారిక హాసిని అనుబంధ సంస్థగా ఇండస్ట్రీలోకి వచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ వరుస సినిమాలతో మంచి గుర్తింపు అందుకుంటోంది. ఎక్కువగా మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ మంచి ప్రాఫిట్స్ అందుకుంటోంది. దీని వెనుక త్రివిక్రమ్ ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉండడంతో మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. కంటెంట్ పరంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు, మార్చి 28న విడుదల కానున్న మ్యాడ్ స్క్వేర్ తో మరోసారి ఫన్ ఎంటర్టైనర్‌ను తెరపైకి తీసుకురాబోతోంది.

ఇదిలా ఉండగా, సంస్థ అధినేత నాగవంశీ తమ 50వ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా నిర్మాణ వ్యాపారంలో 50వ చిత్రం ఏ బ్యానర్‌కి అయినా ప్రత్యేకమైనది. అందుకే, ఈ సినిమా బడ్జెట్, కంటెంట్ పరంగా చాలా గ్రాండ్‌గా ఉండాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే, ల్యాండ్ మార్క్ సినిమా కోసం ఏ హీరో అయితే బెటర్ ఛాయస్ అవుతారనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ నేపథ్యంలో మ్యాడ్ ఇంటర్వ్యూలో హీరో సంగీత్ శోభన్, నిర్మాత నాగవంశీకి ఆసక్తికరమైన ప్రశ్నను వేశాడు. “మీ 50వ సినిమా కోసం పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సి వస్తే, ఎవరిని ఎంచుకుంటారు?” అనే ప్రశ్నకు నాగవంశీ అద్భుతమైన సమాధానం ఇచ్చారు.. 'పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న స్థాయిలో తన రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తారు, ఇంకా ఎక్కడికి వెళతారు అనే దానిపై ఫోకస్ ఉంటుంది. అందుకే ఆయనతో సినిమా చేయాలనే ఆలోచన చేయను. ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాను..' అని అన్నారు.

అయితే ఇద్దరిలో, ఒకరు మాత్రమే అని అడిగితే, తారక్ నే ఎంచుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చారు. నాగవంశీ ఇచ్చిన సమాధానం పూర్తిగా ప్రాక్టికల్ కోణంలో ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో కీలకమైన దశలో ఉన్నారు. అసలే డిప్యూటీ సీఎం. కాబట్టి కచ్చితంగా అడిగినా కూడా ఆయన చేయకపోవచ్చు. మరోవైపు, ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం తన ప్రాజెక్ట్స్‌ను ఒక దశాబ్దం ముందే ప్రణాళికలతో ప్లాన్ చేసుకుంటూ కెరీర్‌ను మరింత పాన్ ఇండియా లెవెల్‌కి తీసుకెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు.

మొత్తంగా చూస్తే, సితార ఎంటర్టైన్‌మెంట్స్ 50వ సినిమా కోసం నాగవంశీ ఎన్టీఆర్‌నే కరెక్ట్ ఛాయిస్‌గా చూడడం అర్థం చేసుకోవచ్చు. అభిమానులు కూడా ఆయన నిర్ణయాన్ని సమర్థించవచ్చు. ఏదేమైనా సితార 50వ ప్రాజెక్ట్ అధికారికంగా ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి. భారీ స్థాయిలో తెరకెక్కబోయే ఈ సినిమా దర్శకుడు ఎవరన్నది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News