డబ్బులతో దందా.. ఫ్యాన్స్ కోసం మెగాస్టార్ హెచ్చరిక
ఈ క్రమంలో ఓ వివాదం కూడా వైరల్ అయ్యింది. అయితే వెంటనే మెగాస్టార్ ఓ క్లారిటీ ఇచ్చేశారు.;

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ షూట్ స్టార్ట్ కానుంది. ఈ మూవీని సంక్రాంతి 2026 సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాలతో పాటు, అభిమానులపై తన ప్రేమను చాటుకుంటూ ముందుకు సాగుతున్న చిరంజీవి, మరోసారి తన క్లాస్‌ను చూపించారు.
ఇటీవల లండన్ లో ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటూనే మరోవైపు అభిమానులతో స్నేహబంధాన్ని కొనసాగిస్తూ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. బ్రిటన్ ప్రభుత్వం అందించిన లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కోసం లండన్ వెళ్లిన చిరంజీవికి అక్కడి తెలుగు ప్రజల నుంచి ఆదరణ ఊహించని స్థాయిలో వచ్చింది. బ్రిటిష్ పార్లమెంట్‌లో అవార్డు అందుకున్న తర్వాత నిర్వహించిన అభిమాని సత్కార వేడుకలు, ఫ్యాన్స్ మీట్ అటెంప్ట్‌లో కాస్త హడావుడి చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఓ వివాదం కూడా వైరల్ అయ్యింది. అయితే వెంటనే మెగాస్టార్ ఓ క్లారిటీ ఇచ్చేశారు.
ఫ్యాన్స్ మీట్ పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమానికి చాలామంది అభిమానులు వెళ్లేందుకు ఉత్సాహం చూపించగా, కొంతమంది వ్యక్తులు ఈ అవకాశాన్ని కమర్షియల్ గా మార్చేందుకు ప్రయత్నించారని సమాచారం. ఈ మీట్ కోసం టికెట్ ఫార్మాట్ లో డబ్బులు వసూలు చేస్తున్నారన్న వార్తలు బయటకు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అభిమాన సంఘాలు దీనిపై స్పందించి స్పష్టత ఇవ్వాలని కోరారు. అభిమానులకు, తమ అభిమానాన్ని వ్యక్తీకరించే అవకాశం డబ్బుల ద్వారా కాకుండా, హృదయపూర్వకంగా రావాలని పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో చిరంజీవి స్వయంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ వివరణ ఇచ్చారు. "నా అభిమానులారా, మీరు నన్ను చూసేందుకు ఎంతగా ఆసక్తిగా ఉన్నారో నాకు తెలుసు. అయితే, కొంతమంది ఈ మీటింగ్స్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇది పూర్తిగా తప్పు. ఎవరైనా డబ్బులు వసూలు చేసినట్లయితే, వెంటనే తిరిగి ఇవ్వాలి. ఈ చర్యలను నేను ఎప్పుడూ ప్రోత్సహించను. మన మధ్య ఉన్న బంధం విలువైనది.. అది డబ్బుతో కొలవలేం. దయచేసి ఈ విషయంలో జాగ్రత్త వహించండి" అని చిరంజీవి పోస్ట్ చేశారు.
తన అభిమానులను కమర్షియల్ ఫార్మాట్ నుంచి దూరంగా ఉంచేందుకు తీసుకున్న ఈ స్టాండ్ మెగాస్టార్‌కు ఉన్న విలువను మరోసారి రుజువు చేసింది. ఫ్యాన్స్‌తో బలమైన భావోద్వేగ అనుబంధం ఏర్పరచుకున్న చిరంజీవి, ఎక్కడైనా తన పేరును వాడుకొని డబ్బులు వసూలు చేయడం తప్పని స్పష్టంగా తెలియజేశారు. ఈ వ్యాఖ్యలతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అభిమానులు చిరంజీవి మాటలకు గౌరవం ఇచ్చారు.