నాని నాలుగేళ్ల ప్రయత్నం.. శనివారంతో అయ్యేనా!
నాని కి కూడా ఈ సినిమా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల మంచి విజయాన్ని తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
నేచురల్ స్టార్ నాని కెరీర్ ఆరంభంలో తెలుగు తో పాటు తమిళంలో కూడా పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించాడు. తమిళంలో ఒక డైరెక్ట్ సినిమా కూడా చేయడం ద్వారా అక్కడి ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యాడు. అయితే ఆ తర్వాత కాలంలో టాలీవుడ్ లో బిజీ అవ్వడం, ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే ఎక్కువ సినిమాలు చేయడం ద్వారా తమిళ ప్రేక్షకులకు దూరం అయ్యాడు. మళ్లీ నాని తమిళ ప్రేక్షకుల అభిమానం దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా పాన్ ఇండియా సినిమాలతో నాని తెలుగు తో పాటు అన్ని భాషల్లో హిట్ కొట్టాలని ఆశ పడుతున్నాడు.
శ్యామ్ సింగరాయ్ సినిమాను తెలుగు తో పాటు ఇతర భాషల్లో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దక్కించుకున్న విజయం ఇతర భాషల్లో దక్కించుకోలేక పోయింది. ఆ తర్వాత కూడా నాని నటించిన కొన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇటీవల విడుదల అయిన హాయ్ నాన్న సినిమాతో అయినా హిందీ మరియు తమిళంలో హిట్ కొట్టాలి అనుకున్న నానికి నిరాశే మిగిలింది. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో అలరించే ప్రయత్నం చేయబోతున్నాడు.
సరిపోదా శనివారం అంటూ విభిన్నమైన టైటిల్ ను పెట్టి, ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేసినప్పటి నుంచి కూడా సినిమా పై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. తెలుగు తో పాటు హిందీ, తమిళం, కన్నడం మరియు మలయాళంలో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇతర భాషలకు సూర్య శనివారం అంటూ టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. విభిన్నమైన కాన్సెప్ట్ తో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటించింది. కీలక పాత్రలో తమిళ స్టార్ దర్శకుడు ఎస్ జే సూర్య నటించడం విశేషం.
హిందీలో పెద్దగా బజ్ లేకపోయినా తమిళంలో మాత్రం ఈ సినిమాకు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. తమిళ దర్శకుడు కమ్ నటుడు అయిన ఎస్‌జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం ద్వారా అక్కడి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ సినిమా కచ్చితంగా మినిమం ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఎస్ జే సూర్య వల్ల మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు లేక పోలేదు అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.
నాని కి కూడా ఈ సినిమా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల మంచి విజయాన్ని తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 29న సరిపోదా శనివారం పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది. నాని ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. వివేక్ ఆత్రేయతో ఇంతకు ముందు చేసిన సినిమా విషయంలో జరిగిన తప్పు ఇప్పుడు జరగకుండా చూసుకున్నట్లుగా నాని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.