మ‌త్స్య‌కార గ్రామంలో ప్ర‌త్య‌క్ష‌మైన చై.. ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది?

నాగ చైతన్య క‌థానాయ‌కుడిగా #NC23 త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

Update: 2023-08-03 17:10 GMT

ఎంపిక చేసుకున్న పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేయాలంటే దానికి ప‌రిశోధ‌న అవ‌స‌రం. పాత్ర‌కు ప్రాణం పోయాలంటే చాలా హార్డ్ వ‌ర్క్ చేయాలి. ఇప్పుడు అక్కినేని నాగ‌చైత‌న్య చేస్తున్న‌ది అదే. అత‌డు ప్ర‌స్తుతం మ‌త్స్య‌కార గ్రామాల‌కు వెళ్లి అక్క‌డ వారి జీవ‌న శైలిని ప‌రిశీలించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. త‌న పాత్ర‌కు వంద‌శాతం న్యాయం చేసేందుకే ఈ ప్ర‌య‌త్నం. గ‌తంలోను మ‌న హీరోలు మ‌త్స్య‌కార పాత్ర‌ల కోసం ఇలా ప‌రిశోధ‌న‌కు వెళ్లిన సంద‌ర్భాలున్నాయి.

రంగ‌స్థలంలో గోదారి జిల్లాలోని విలేజీ కుర్రాడిగా క‌నిపించేందుకు రామ్ చ‌ర‌ణ్ ఎలాంటి వ‌ర్క్ చేసారో తెలిసిన‌దే. ఇప్పుడు అదే తీరుగా నాగ‌చైత‌న్య కూడా త‌న పాత్ర కోసం శ్ర‌మిస్తున్నారు. నేర్చుకునే జిజ్ఞాస‌తో స్ఫూర్తిని నింపుతున్నారు.

ఈ సినిమా కోసం కేవ‌లం నాగ‌చైత‌న్య మాత్ర‌మే కాదు.. మొత్తం చిత్ర‌బృందం చాలా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. నాగ చైతన్య క‌థానాయ‌కుడిగా #NC23 త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రానికి చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. సీనియర్‌ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాస్‌ నిర్మించనున్నారు. ఫిషింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

అందుకే ఇప్పుడు నాగ‌చైత‌న్య శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కె మచ్చలేశం గ్రామం వరకు వెళ్లారు. మత్స్యకారులు వారి కుటుంబాలతో వారి జీవనశైలి గురించి తెలుసుకునేందుకు చై గ్రామ వాసుల‌తో సంభాషించారు.

ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య గ్రామ‌స్తుల‌తో క‌లిసి ఉన్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోల్లో నాగ‌చైత‌న్య గుబురుగ‌డ్డం కోర‌మీసాల‌తో గెట‌ప్ ని పూర్తిగా మార్చిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌త్స్య‌కారుడిగా త‌న పాత్ర కోస‌మే చైత‌న్య ఇంత‌గా మేకోవ‌ర్ ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ఈ సినిమా కథ యథార్థ ఘటనల స్పూర్తితో రూపొందిందని నాగ చైతన్య ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 2018లో ఈ (మ‌చ్చ‌లేశం) గ్రామంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథ రూపొందింది. శ్రీ‌కాకుళం విలేజీతో పాటు ఏపీలోని మ‌త్స్య‌కార గ్రామాలు స‌హా పొరుగున ఉన్న తీర ప్రాంతాల్లోను చిత్రీక‌ర‌ణ సాగిస్తార‌ని తెలిసింది. ఈ చిత్రం అద్భుతమైన ప్రేమకథతో రూపొంద‌నుంద‌ని స‌మాచారం.

Tags:    

Similar News