పవన్ - దత్‌లపై రంధ్రాన్వేషణ తగునా?
తెలుగు రాష్ట్రాలు వరద ముంపుతో తల్లడిల్లుతున్నాయి. ప్రజలు ఆవాసాలు కోల్పోయి తిండికి లేక విలవిలలాడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలు వరద ముంపుతో తల్లడిల్లుతున్నాయి. ప్రజలు ఆవాసాలు కోల్పోయి తిండికి లేక విలవిలలాడుతున్నారు. ఇలాంటి సమయంలో మేమున్నాం అంటూ టాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. కష్టంలో ఎప్పుడూ టాలీవుడ్ తనవంతు సహాయం చేస్తూనే ఉంది. చాలా మంది రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలకు లేని మంచి మనసు సినీపరిశ్రమ ప్రముఖులకు ఉందని నిరూపణ అయింది. కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు.. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోను పలు నగరాలు వరదలతో నీట మునిగినప్పుడు, అతలాకుతలం అయినప్పుడు మన స్టార్లు భారీ మొత్తాలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రి నిధికి పంపించి తమ ధాతృత్వాన్ని, మంచి మనసును చాటుకున్నారు.
అలాంటి వారిలో పలువురు టాలీవుడ్ హీరోలు ఉన్నారు. అదంతా సరే కానీ.. ఈసారి కూడా మెగా నందమూరి కుటుంబాలు తెలుగు రాష్ట్రాల వరద ముంపు బాధితుల విషయంలో ధీటుగా స్పందించాయి. మెగా కుటుంబం నుంచి ఇప్పటికే కోట్లాది రూపాయలు సీఎం సహాయనిధికి అందిస్తున్నామనే ప్రకటనలు వెలువడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు చొప్పున మొత్తంగా కోటి విరాళం ప్రకటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ ఇరు తెలుగు రాష్ట్రాలకు తలో 50లక్షలు ప్రకటించగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ కూడా అదే విధంగా తలా 50లక్షలు (ఇరు రాష్ట్రాలకు కోటి) ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నారు. వీరితో పాటు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నల గడ్డ, అనన్య నాగళ్ల కూడా ఇరు తెలుగు రాష్ట్రాల వరదబాధితుల కోసం తమ వంతు సహాయాన్ని ప్రకటించారు.
అయితే వీళ్లందరికీ భిన్నంగా టాలీవుడ్ అగ్ర నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత అశ్వనిదత్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. వారు కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ విరాళాల్ని పంపిస్తున్నామని ప్రకటించారు. అశ్వనిదత్ తొలిగా 25లక్షల డొనేషన్ ని ప్రకటించగా, ఏపీ ఉపముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ ఒక కోటి డొనేట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆ ఇద్దరిపైనా ఇప్పుడు కొందరు సెటైర్లు వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇద్దరికీ వ్యాపారాలు ఉన్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో వారి సినిమాలు రిలీజై ఆడుతున్నాయి. అలాంటప్పుడు ఎందుకు ఇలా ఒక రాష్ట్రానికే డొనేషన్ ఇచ్చారు? తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నిస్తున్నారు.
అయితే దీనిని ఏ కోణంలో చూడాలి? దానగుణం, సహాయం అనేవి వ్యక్తిగత ఆసక్తులు.. ఆలోచనలు. అశ్వనిదత్ స్వస్థలం గన్నవరం (విజయవాడ).. పవన్ కల్యాణ్ ఏపీకి ఉప ముఖ్యమంత్రి కదా! అతడి ప్రస్తుత నివాసం హైదరాబాద్ అయినా కానీ, ఏపీలో నాయకుడిగా తనవంతు సేవలు చేస్తున్నారు కాబట్టి తన తొలి ప్రాధాన్యత ఆ రాష్ట్రం కాకుండా ఇంక ఏది అయ్యి ఉంటుంది? ఇలా దానంలో సాయంలో కూడా రంధ్రాన్వేషణ తగునా? అని ఒక సెక్షన్ విమర్శకుల్ని ప్రశ్నిస్తున్నారు. అన్నిటికీ మరీ ఇంత డీప్ గా వెళ్లాల్సిన అవసరం లేదు కదా? ఒకవేళ ఏపీకి డబ్బు రూపేణా సాయం ప్రకటంచి, తెలంగాణ వరద బాధితులకు భారీ మొత్తంలో నిత్యావసరాలను లేదా వస్త్రాలను నేరుగా బాధితులకు అందజేసే ఆలోచన వారికి ఉండి ఉండొచ్చు కదా! ఆ విషయం ఎవరికి తెలుసు? అని కూడా కువిమర్శకుల్ని ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు.