నిషిలో శశిలా.. 'నారి' పవర్ఫుల్ సాంగ్!
తాజాగా చిన్మయి శ్రీపాద ఆలపించిన మరో పాటను విడుదల చేశారు. నిషిలో శశిలా అంటూ సాగే ఈ పాటతో ఎంతో మంచి సందేశం అంధించారు.
సినిమా అనేది కేవలం వినోదానికే పరిమితం కాకుండా ఏదో ఒక మంచి సందేశం ఇవ్వగలిగితే తప్పకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతాయు. ఇక కొందరు దర్శకులు నిర్మాతలు సమాజంలో జరుగుతున్న సమస్యలను సినిమాలు ప్రతిబింబిస్తూ, మార్పుకు దారి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అదే రూట్లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'నారి'. ఆమని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మహిళల హక్కులు, సాధికారత, సమాజంలో వారికి ఎదురవుతున్న సమస్యలను స్పష్టంగా చూపించనుంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ సినిమా కథాంశానికి అనుబంధంగా విడుదలైన క్లిప్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో 7 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఓ విద్యార్థిని తన టీచర్‌తో మాట్లాడుతూ సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలను నిశితంగా వివరిస్తూ ఉండటం, ఆ మాటలు ప్రతి ఒక్కరికీ తాకేలా ఉండటం దీనికి కారణం.
ఈ క్లిప్ వెనుక నారి సినిమా ఉందని తెలుసుకున్న ప్రభుత్వం కూడా సినిమాపై ఆసక్తి కనబర్చింది. మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్లింప్స్, టీజర్‌ను విడుదల చేసి చిత్రబృందాన్ని ప్రశంసించటం ఈ సినిమా ప్రాధాన్యతను చూపిస్తోంది. ఇటీవల చిత్రబృందం మరో కీలక అప్‌డేట్‌ను అందించింది. ఈడు మగాడేంట్రా బుజ్జి అనే పాటను విడుదల చేశారు. ర్యాప్ సింగర్ సీషోర్ పాడిన ఈ పాట మహిళల సాధికారత, సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివక్షను నెపథ్యంలో సాగింది.
ఇప్పటికే 8 మిలియన్ల వ్యూస్‌తో ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా చిన్మయి శ్రీపాద ఆలపించిన మరో పాటను విడుదల చేశారు. నిషిలో శశిలా అంటూ సాగే ఈ పాటతో ఎంతో మంచి సందేశం అంధించారు. ప్రతీ లైన్ కూడా ఆలోచింపజేసేలా ఉంది. ముఖ్యంగా వినోద్ కుమార్ విన్ను అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ప్రసాద్ సానా రచించిన ఈ పాట మహిళల సామర్థ్యాన్ని, వారి శక్తిని చాటేలా ఉంది.
దర్శకుడు సూర్య వంటిపల్లి మాట్లాడుతూ, మహిళల సమస్యలను హైలైట్ చేసే చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుందని, అందులో ఈ సినిమా మరో ఘన విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకముందని తెలిపారు. కథ చాలా బలంగా ఉంటుందని, ముఖ్యంగా క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా రూపొందించామని అన్నారు. ముఖ్యంగా ఆమని నటన సినిమాలో హైలైట్ కానుందని చెప్పారు. నిర్మాత శశి వంటిపల్లి మాట్లాడుతూ, ప్రతి కుటుంబం ఈ చిత్రాన్ని చూడాల్సిన అవసరం ఉందని అన్నారు. స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా ఈ సినిమా ద్వారా ఆలోచన మార్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.
ఈ కథ సమాజానికి ఒక సందేశాన్ని అందించేలా ఉంటుందని, ప్రతి కుటుంబం ఈ సినిమాను థియేటర్లో చూసి ఆదరించాలన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 7న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. నారి కేవలం సినిమా అనిపించుకునేలా కాకుండా, ఒక పవర్‌ఫుల్ మెసేజ్‌ను అందించేలా రూపొందింది.