నితీష్ రామాయణం ఆదిలోనే..!
ఈ ప్రాజెక్ట్‌లో రణబీర్ కపూర్- సాయి పల్లవి సహా ప్రముఖ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నితేష్ తివారీ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకునే లక్ష్యంతో పెద్ద స్క్రీన్ పై `రామాయణం` అనే మహదాద్భుతమైన దృశ్యకావ్యాన్ని తెరకెక్కించాలని ప్రణాళికల్ని సిద్ధం చేసారు. మూడు భాగాలుగా ఈ ఫ్రాంఛైజీని కొనసాగిస్తారని వార్తలు వచ్చాయి. వచ్చే నెల మార్చి 2023లో ప్రొడక్షన్‌ని ప్రారంభించాలని షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఎపిక్ సినిమా కోసం ప్రజలంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో రణబీర్ కపూర్- సాయి పల్లవి సహా ప్రముఖ తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
`రామాయణం`లో కాస్టింగ్ సహా ఏ చిన్న విషయమైనా ఇటీవల పెద్ద వార్తగా మారుతోంది. ప్రాజెక్ట్ చుట్టూ చాలా ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే ఇప్పటివరకూ దర్శకుడు లేదా నిర్మాతల నుండి అధికారిక ధృవీకరణ ఏదీ రాకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. రణబీర్ కపూర్-సాయి పల్లవి మాత్రమే రాముడు- సీత పాత్రలకు అధికారికంగా ఎంపికయ్యారు. రావణుడిగా యష్ ఎంపిక గురించి అధికారిక ప్రకటన లేదు. ఇతర పాత్రధారుల్ని కూడా ప్రకటించలేదు. ముఖ్యంగా నటీనటులకు సంబంధించి ఎక్కువగా కల్పిత కథనాలే వైరల్ అవుతున్నాయి.
తాజా సమాచారం మేరకు.. రామాయణం ఈ సంవత్సరం ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదని, వచ్చే ఏడాదే ప్రారంభమవుతుందని కథనాలొస్తున్నాయి. దీనికి కారణం కూడా సహేతుకంగా కనిపించలేదు. కాస్ట్యూమ్ డిజైన్ ఆశించినంతగా వర్కవుట్ కాలేదు. కాస్ట్యూమ్స్ లుక్ పరంగా దర్శకనిర్మాతల అంచనాలను అందుకోలేకపోవడమే ఆలస్యానికి కారణమని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి పౌరాణిక డ్రామాలకు కాస్ట్యూమ్స్ అత్యంత కీలకం. ఎంపిక చేసుకునే దుస్తులు సగం సినిమాకి కళ తెచ్చేస్తాయి. అవి సరిగా కుదరకపోతే వీక్షకులను అబ్బుర పరచడం అసాధ్యం. అందుకే దీనిపై ప్రతి బిట్ నిర్మాతలు ఫోకస్ చేస్తున్నారని కూడా భావిస్తున్నారు.
అయితే ఈ సమాచారం ఏదీ అధికారికంగా ప్రకటించలేదు. ప్రాజెక్ట్ గురించి ఇంకా మేకర్స్ తమ పనిని తాము చేస్తూనే ఉన్నారని విశ్వసనీయ సోర్స్ చెబుతోంది. అయితే అంతర్గత సమస్యలు అపరిష్కృతంగా ఉన్న కారణంగా ఈ సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.
రామనవమికి లేనట్టేనా?
దర్శకుడు నితీష్ తివారీ నేతృత్వంలోని `రామాయణం` టీమ్ ఏప్రిల్ 17న రామనవమి రోజున అధికారికంగా సినిమాని లాంచ్ చేస్తారని కథనాలొచ్చాయి. ఇది పుకార్ మాత్రమేనని తాజా పరిణామం చెబుతోంది.
రామాయణం ప్రతి భారతీయుని మనసులో ఎంతో పవిత్రమైనది. ఇలాంటి కీలక ప్రాజెక్ట్ ఎందుకు అసందిగ్ధతలకు, ఊహాగానాలకు తావిస్తోంది? ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటనతో మేకర్స్ ఎందుకు ముందుకు రావడం లేదు? కనీసం ఇప్పుడైనా ముందుకెళుతుందా లేదా? అంటూ మదనం కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి అల్లు అరవింద్- మధుమంతెన వంటి దిగ్గజాలు వైదొలగడం కూడా ఆదిలోనే అపశకునంలా కనిపించిందని విశ్లేషిస్తున్నారు.