చీరకట్టు కనికట్టు.. యూత్ లో ట్రెండీగా మారిన శారీస్!

యువకులు సైతం అమ్మాయిలను రకరకాల చీరకట్టుల్లో చూడటానికే ఇష్టపడుతున్నారు.

Update: 2024-06-19 23:30 GMT

"చీరలోని గొప్పతనం తెలుసుకో.. చీర కట్టి ఆడతనం పెంచుకో.. సింగారమనే దారంతో చేసింది చీర.. ఆనందమనే రంగులనే అద్దింది చీర.. మమకారమనే మగ్గంపై నేసింది చీర" అంటూ గీత రచయిత చంద్ర‌బోస్ రాసిన 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' పాట ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇందులో చెప్పినట్లుగానే, నేటి తరం యువతులందరూ ఇప్పుడు చీర కట్టులోనే తమ అందమంతా దాగుందని అంటున్నారు. యువకులు సైతం అమ్మాయిలను రకరకాల చీరకట్టుల్లో చూడటానికే ఇష్టపడుతున్నారు.


ఇంద్ర ధనస్సు వర్ణాలను రంగరించి, ప్రకృతి అందాలను అచ్చేసిన చీరలంటే.. ఏ మహిళకు మాత్రం ఇష్టపడదు. తమ తనువుపై మెరిసిపోతున్న శారీలను చూస్తే యువతుల మనసంతా మురిసిపోతూ ఉంటుంది. అప్పట్లో పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలు.. ఇలా ఏదైనా సందర్భం వచ్చినప్పుడల్లా ఆడవాళ్ళు చీరల్లో దర్శనమివ్వడం మనం చూసేవాళ్ళం. అప్పటి సినిమాల్లో హీరోయిన్లు చీరకట్టులో ప్రేక్షకులను కనికట్టు చేసి అలరించేవారు. 'చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది దీని తస్సదియ్య, అందమంతా చీరలోనే ఉన్నది' అంటూ చీర ప్రాముఖ్య‌త‌ను, గొప్ప‌ద‌నాన్ని వ‌ర్ణిస్తూ పాటలు పాడుకునేవారు. కానీ రాను రాను ఆ ట్రెండ్ మారుతూ వచ్చింది.


మోడ్రన్ కల్చర్ కు అలవాటు పడిపోయిన అమ్మాయిలు, నాగరికత పేరుతో ట్రెండీ కాస్ట్యూమ్స్ ధరిస్తూ వచ్చారు. సినిమాల్లో హీరోయిన్లు కూడా పొట్టి పొట్టి మిడ్డీ డ్రెస్సుల్లో ఎక్స్ పోజింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆడియెన్స్ సైతం అలాంటి వస్త్రధారణలోనే నటీమణులను చూడటానికి ఇష్టపడ్డారు. అయితే ఇటీవలి కాలంలో మళ్ళీ ట్రెండ్ మారింది. ఈతరం కథానాయికలందరూ చీరకట్టులోనే అసలైన కనికట్టు ఉందని తెలుసుకున్నారు.. చీరల్లోనే హాట్ అందాల విందును అందిస్తున్నారు. యూత్ కూడా హీరోయిన్లను ట్రెండీ ఔట్ ఫిట్స్ లో కంటే శారీలలో చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.


చీరకట్టులో ఇప్పటి సినిమా హీరోయిన్ల అందాల ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు సీనియర్ బ్యూటీల దగ్గర నుంచి కుర్ర భామల వరకూ.. అందరూ ఎక్కువగా చీరల్లోనే కనిపిస్తున్నారు. అప్పటిదాకా మోడ్రన్ దుస్తుల్లో చూసి, ఇప్పుడు ఒక్కసారిగా శారీల్లోకి మారిపోయిన ముద్దుగుమ్మల అందాలను వర్ణించడం కష్టమనే చెప్పాలి. కనిపించీ కనిపించని నడుము సోయగాలతో, యువ హృదయాలను కొల్లగొడుతున్న కొందరు నటీమణులు.. సోషల్ మీడియాలోనూ తమ చీరకట్టుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.


శారీల ట్రెండ్ మళ్ళీ మొదలైన తర్వాత, చీరకట్టులో ఉన్న అందం మరే డ్రెస్ లోనూ ఉండదని ఈ జనరేషన్ అమ్మాయిలు గుర్తించారు.. మగువలకు కొత్త అందాన్ని తీసుకొస్తాయని భావిస్తున్నారు. అందుకే మోడ్రన్ డ్రెస్ లలో కంటే చీరల్లో కనిపించడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే చీర కట్టుకునే యువతులు.. ఇప్పుడు తరచుగా చీరలు ధరిస్తూ, వివిధ భంగిమల్లో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గూగుల్ లో 'గర్ల్స్ ఇన్ శారీ' అని నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంటే, ప్రస్తుతం శారీ ట్రెండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


నిజానికి 'చీర' అనేది సంస్కృత పదం. అది మన నాగరికతలో భాగం. తెలుగు సంస్కృతికే కాదు, భారతీయతకి అద్దం పట్టే అలంకరణ చీరకట్టు. చీర కట్టుకోవడం అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచే ఉందని చరిత్రకారులు పేర్కొన్నారు. రామాయణ కాలంలో నారచీరలు వాడిన సందర్భాలను అయోధ్య కాండలో చూడొచ్చు. వనవాసానికి సిద్ధమవుతున్నప్పుడు రామ లక్ష్మణులతో పాటు సీత కూడా కైకేయి యిచ్చిన నార చీరలు ధరించిందని.. అయితే సీతాదేవి నారచీరలు ధరించవలనసిన అవసరం లేదని చెప్పి, రాజవంశీయులు ధరించే వస్త్రాలను ఆమెతో ధరింపజేశారని పురాణాలు చెబుతున్నాయి.


భారతీయ సంప్రదాయల్లో మహిళల వస్త్రధారణ ఎంతో గొప్పది. చీరకట్టు మనదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఇప్పుడు 108 రకాల చీర కట్టు పద్ధతులు ఉన్నాయని అంటుంటారు. వివిధ పద్ధతుల్లో శారీలు కట్టుకోవడం కూడా ఫ్యాషన్ అయిపోయింది. యూత్ కి ట్రెండ్ గా మారడంతో, సినిమాల్లోనూ చీర కట్టుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. నేటితరం యువతులకు చీరలోని గొప్పదనం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ లాంటి సంచలన దర్శకుడు ప్రస్తుతం 'శారీ'(SAAREE) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.


Tags:    

Similar News