బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి అతడ్ని అరెస్టు చేసిన అధికారులు
పులిగోరు గొలుసును ధరించిన కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్ పై పలువురు ఫిర్యాదు చేయగా.. దీనికి స్పందనగా అటవీ శాఖ అధికారులు సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు.
భాష ఏదైనా బిగ్ బాస్ రియాల్టీ షోకు ఉండే ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఈ రియాల్టీ షో తొలుత హిందీలో మొదలు కాగా.. తర్వాతి కాలంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో.. పలు భాషల్లో ఈ రియాల్టీ షోను నిర్వహిస్తున్నారు. ఏ భాషలో నిర్వహించిన విజయం మాత్రం ఖాయమన్నట్లుగా ఉండే ఈ రియాల్టీ షోలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో అటవీ శాఖ అధికారులు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి మరీ.. ఒక కంటెస్టెంట్ ను అరెస్టు చేశారు.
కన్నడ బిగ్ బాస్ లో ఈ షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. పులిగోరు గొలుసును ధరించిన కంటెస్టెంట్ వర్తుర్ సంతోష్ పై పలువురు ఫిర్యాదు చేయగా.. దీనికి స్పందనగా అటవీ శాఖ అధికారులు సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా వర్తుర్ పై కేసును నమోదు చేశారు. వాస్తవానికి సంతోష్ పై ఫిర్యాదులు వచ్చిన వేళ.. ఆయన్ను తమకు అప్పగించాలని అధికారులు కోరారు.
దీనికి బిగ్ బాస్ నిర్వాహకులు తొలుత ఒప్పుకోలేదు. దీంతో సీరియస్ హెచ్చరికలు చేసిన తర్వాత.. తప్పనిసరి పరిస్థితుల్లో కాస్త వెనక్కి తగ్గారు. దీంతో.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఫారెస్టు అధికారులు సంతోష్ ను కస్టడీలోకి తీసుకున్నారు. పులిగోరు అతనికి ఎలా వచ్చిందన్న అంశంపై ప్రశ్నలు వేసినట్లుగా చెబుతున్నారు. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించినందుకు అతనిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పి..తమతో తీసుకెళ్లారు. కోర్టు ఎదుట హాజరుపర్చనున్నారు. బిగ్ బాస్ రియాల్టీ షో చరిత్రలో ఇలా హౌస్ లోకి వెళ్లి.. ఒక కంటెస్టెంట్ ను అదుపులోకి తీసుకున్న ఉదంతం ఇదేనని చెబుతున్నారు.