వరుణ్ వాలెంటైన్ గొడవ తేలిపోయింది

డిసెంబర్ 8 కి రావాల్సిన ఈ సినిమా 2024 ఫిబ్రవరి 16న రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా వెల్లడిస్తూ ఓ గ్లిమ్స్ వీడియోని సైతం రిలీజ్ చేసింది.

Update: 2023-12-11 16:44 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ట్రిప్ లో ఉన్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా వరుణ్ తేజ్ 'గాండీవ దారి అర్జున' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ గా మంచి అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. ఇక ప్రస్తుతం 'ఆపరేషన్ వాలెంటైన్' అనే సినిమాలో నటిస్తున్నాడు వరుణ్ తేజ్.


శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. మానుషి చిల్లర్ ఈ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కనిపించనున్న ఈ సినిమాని తొలుత డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేయడంతో పాటు కొత్త రిలీజ్ డేట్ ను నేడు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

డిసెంబర్ 8 కి రావాల్సిన ఈ సినిమా 2024 ఫిబ్రవరి 16న రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా వెల్లడిస్తూ ఓ గ్లిమ్స్ వీడియోని సైతం రిలీజ్ చేసింది. ఈ వీడియోలో ఇండియా పై ఓ భీకర దాడి జరిగినట్లు ప్రారంభంలో చూపించారు. ఆ తర్వాత దీనికి బదులుగా భారత్ అతిపెద్ద వైమానిక దాడి చేసినట్టు వీడియో చుస్తే స్పష్టం అవుతుంది. గ్లిమ్స్ వీడియో లో యుద్ధ విమానాల విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

పలు యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పై తెరకెక్కించిన మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇక గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో సతమతమవుతున్న వరుణ్ తేజ్ కి ఆపరేషన్ వాలెంటైన్ మూవీ కీలకంగా మారింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ సినిమాతోనే వరుణ్ తేజ్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. అందుకే ఈ సినిమాతో ఎలాగైనా మంచి కం బ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు వరుణ్ తేజ్.

సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్, సందీప్ ముద్దా పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్స్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ లో యాడ్ ఫిలిం మేకర్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. మరి ఈ సినిమా వరుణ్ తేజ్ కి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News