నోలన్‌ సినిమా.. ఏదో అనుకుంటే ఇంకేదో

మన ‘గజిని’ సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన ‘మొమెంటో’తో మొదలుపెట్టి.. ‘టెనెట్’ వరకు అద్భుతమైన, ప్రయోగాత్మక చిత్రాలతో ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు క్రిస్టోఫర్ నోలన్.

Update: 2023-07-22 15:50 GMT

మన ‘గజిని’ సినిమాకు స్ఫూర్తిగా నిలిచిన ‘మొమెంటో’తో మొదలుపెట్టి.. ‘టెనెట్’ వరకు అద్భుతమైన, ప్రయోగాత్మక చిత్రాలతో ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు క్రిస్టోఫర్ నోలన్. ఆయనకు ఇండియాలో కూడా భారీగా అభిమానగణం ఉంది. నోలన్ కొత్త చిత్రం ‘ఓపెన్ హైమర్’ రిలీజ్ ముంగిట ఇండియాలో వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. ఈ వారం వివిధ ప్రాంతీయ భాషల్లో బోలెడన్ని సినిమాలు రిలీజైనప్పటికీ.. ఇండియన్ బాక్సాఫీస్‌లో ‘ఓపెన్ హైమర్’కే అగ్రతాంబూలం దక్కింది. ఆ సినిమాకే అడ్వాన్స్ బుకింగ్స్ గట్టిగా జరిగాయి. ఇండియాలో ఈ వారం బిగ్గెస్ట్ రిలీజ్ అదే. ఓపెనింగ్స్ పరంగా కూడా అదే నంబర్ వన్ సినిమాగా నిలిచింది. ఐతే ఈ సినిమా మీద భారతీయ ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు మాత్రం నిలబడలేదు. ఇండియా అనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విషయంలో మిశ్రమ స్పందన వస్తోంది.

నోలన్ సినిమా అంటే ఔట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలతో ప్రేక్షకుల బుర్రలకు పని పెడుతుంది. ఆయన సినిమాలు ఇచ్చే థ్రిల్లే వేరు. ఎవ్వరూ ఊహించని విధంగా కథనం.. సన్నివేశాలు నడుస్తాయి. అలాగే విజువల్‌గా అవి గొప్ప అనుభూతిని ఇస్తాయి. ఐతే ‘ఓపెన్ హైమర్’ ఈ కోవకు చెందిన సినిమా కాదు. ఈ సినిమా బాలేదని కాదు. ఇందులో నోలన్ ప్రతిభ చూపించలేదని కాదు. విషయ పరంగా చూస్తే ఆయన కెరీర్లో ఉత్తమ చిత్రాల జాబితాలో ‘ఓపెన్ హైమర్’ కచ్చితంగా ఉంటుంది. కానీ ఇది జనరంజకమైన సినిమా మాత్రం కాదు. రెండో ప్రపంచయుద్ధ సమయం నాటి పరిస్థితుల నేపథ్యంలో ఓపెన్ హైమర్ అనే ఎటామిక్ సైంటిస్ట్ బయోగ్రఫీని ఇందులో చాలా ఇంటెన్స్‌గా, ఎమోషనల్‌గా చూపించాడు నోలన్. అప్పటి అమెరికన్ రాజకీయాలను ఇందులో లోతుగా చూపించాడు. ఒక సైంటిస్ట్ జీవితాన్ని క్యారెక్టర్ స్టడీ లాగా సినిమాలో చూపించాడు. ఇందులో ఎమోషన్స్ అత్యంత కీలకం. పెర్ఫామెన్స్‌లు కూడా అదిరిపోయాయి. కానీ నోలన్ సినిమా నుంచి ఆయన అభిమానులు ఆశించే మెరుపులు, థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇందులో లేదు. అందుకే మెజారిటీ ఆడియన్స్, ముఖ్యంగా ఇండియన్స్ ఈ సినిమా విషయంలో నిరాశను వ్యక్తం చేస్తున్నారు. హైడ్రోజన్ బాంబు చుట్టూ సినిమా అంటే యుద్ధాలు, భారీతనంతో విజువల్‌గా గొప్ప అనుభూతిని ఇస్తుంది అనుకుంటే.. ఎమోషన్ల మీదే సినిమా నడవడంతో వారికి రుచించడం లేదు. సినిమా కలెక్షన్ల పరంగా నోలన్ గత సినిమాలకు దగ్గరగా కూడా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు.

Tags:    

Similar News