రామ్‌చరణ్‌ కు నేషనల్ అవార్డ్ రాలేదని ఫీల్ అవుతున్న కల్యాణ్ బాబాయ్!

ఇందుకుగాను తప్పకుండా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వస్తుందని భావించానని, ఫ్యూచర్ లో అవార్డు రావాలని పవన్ అన్నారు.

Update: 2025-01-05 14:30 GMT

రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ శనివారం సాయంత్రం రాజమండ్రిలో చాలా గ్రాండ్ గా జరిగింది. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత బాబాయ్ - అబ్బాయ్ లను ఒకే వేదిక మీద చూడటంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ తన అన్నయ్య కుమారుడు చరణ్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. చిన్నప్పటి నుంచే ఎంతో క్రమశిక్షణతో పెరిగాడని, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడని కొనియాడారు. ఇక చెర్రీ యాక్టింగ్ గురించి మాట్లాడుతూ 'రంగస్థలం' సినిమాలో అద్భుతంగా నటించాడని ప్రశంసించారు. ఇందుకుగాను తప్పకుండా బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ వస్తుందని భావించానని, ఫ్యూచర్ లో అవార్డు రావాలని పవన్ అన్నారు.

''రామ్ చరణ్ ఏడేళ్ల వయసులో తెల్లవారుజామునే హార్స్‌ రైడింగ్‌ నేర్చుకోవడానికి వెళ్లేవాడు. చిన్నప్పటి నుంచి అంత క్రమశిక్షణతో ఉండేవాడు. అతనిలో ఇంత ప్రతిభ, సమర్థత ఉందని ఎవరికీ తెలియలేదు. సినిమాలో తప్ప బయట డ్యాన్స్ చేయడం నేనెప్పుడూ నా లైఫ్ లో చూడలేదు. మ్యూజిక్ పెడితే కాళ్ళు కూడా ఆడించడు కానీ, అద్భుతమైన డ్యాన్సర్. సుకుమార్‌ డైరెక్షన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్‌ నటన చూసి బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు వస్తుందనుకున్నా. అంత గొప్ప పెర్ఫార్మన్స్ చేసాడు. అతను ఆంధ్రాలో పెరగలేదు.. తమిళనాడు, హైదరాబాద్ లో పెరిగాడు. గోదావరి జిల్లాల తాలూకు భావాలు, కల్చర్ ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు. అవన్నీ తెలియకపోయినా ఆ క్యారక్టర్ లో ఇమిడిపోయి, కొన్ని తరాలుగా గోదావరి ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగా తను యాక్ట్ చేసిన విధానం నాకు అమితంగా నచ్చింది. అతనిలో అంత గొప్ప నటుడు ఉన్నాడు. చిరంజీవిగారి వారసుడు అలా కాకపోతే ఎలా ఉంటాడు. తండ్రికి తగ్గ వారసుడు. తండ్రి మెగాస్టార్‌ అయితే, కొడుకు గ్లోబల్‌ స్టారే అవుతాడు'' అని పవన్ కళ్యాణ్ అన్నారు. భవిష్యత్‌లో రామ్ చరణ్ ఉత్తమ నటుడు కావాలి.. ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలని ఆకాక్షించారు.

2018లో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ''రంగస్థలం'' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో చిట్టిబాబు అనే వినికిడి లోపం ఉన్న యువకుడిగా చరణ్ చాలా బాగా నటించారు. దీంతో 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడిగా ఎంపిక అవుతారని అందరూ అనుకుకున్నారు. కానీ ఆ ఏడాది ఆయుష్మాన్ ఖురానా (అంధాధున్) & విక్కీ కౌశల్ (ఉరి: ది సర్జికల్ స్ట్రైక్) వంటి ఇద్దరు బాలీవుడ్ హీరోలకు బెస్ట్ యాక్టర్స్ గా అవార్డు ఇచ్చారు. 'రంగస్థలం' సినిమా ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగంలో నేషనల్ అవార్డును గెలుచుకుంది. చెర్రీకి వంద శాతం నేషనల్ ఫిలిం అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినా రాలేదనే విషయాన్ని పవన్ కల్యాణ్ ఇప్పుడు గుర్తు చేసుకున్నారు. అయితే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చి, రామ్ చరణ్ కు రాలేదని పవన్ ఫీల్ అవుతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

''పుష్ప: ది రైజ్'' సినిమాలో అద్భుతమైన నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. తద్వారా ఉత్తమ నటుడిగా జాతీయ పురష్కారాన్ని అందుకున్న మొట్టమొదటి తెలుగు యాక్టర్ గా బన్నీ చరిత్ర సృష్టించారు. అంతకముందు కింగ్ అక్కినేని నాగార్జున 'అన్నమ్మయ్య' చిత్రానికి స్పెషల్ మెన్షన్ యాక్టర్ క్యాటగిరిలో నేషనల్ అవార్డు సాధించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం బెస్ట్ యాక్టర్ గా జాతీయ అవార్డును గెలుపొందారు. కాకపోతే అంతకంటే ముందే ''రంగస్థలం'' మూవీకి రామ్ చరణ్ కు ప్రతిష్టాత్మక పురష్కారం వస్తుందని పవన్ కళ్యాణ్ ఆశించారట. ఇదే విషయాన్ని 'గేమ్ చేంజర్' ఈవెంట్ లో చెప్పారు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో 'అల్లు అర్జున్ Vs మెగా ఫ్యామిలీ' అనే విధంగా ఫ్యాన్ వార్స్ జరుగుతున్న తరుణంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో, బన్నీకి అవార్డు వచ్చి చెర్రీకి రాలేదని నిరాశ చెందినట్లుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం వారంతా ఒకే ఫ్యామిలీకి చెందినవారని, ఆయన మాట్లాడిన దాంట్లో పరమార్ధాలు వెతకడం సరికాదని అంటున్నారు.

ఇదిలా ఉంటే రామ్ చరణ్ నుం చూస్తే తనకు చాలా గర్వంగా ఉంటుందని, అప్పుడప్పుడు అసూయగా ఉంటుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ''చరణ్‌ పుట్టినప్పుడు నేను ఇంటర్‌ చదువుతున్నా. ఇంటి దైవం ఆంజనేయ స్వామి పేరు రావాలని మా నాన్న రామ్ చరణ్ అని పేరు పెట్టారు. రాముడి చరణాల వద్ద ఉండే వ్యక్తి హనుమంతుడు. ఎంత బలం ఉన్నా వినయ విధేయలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి. ఎంత ఎదిగినా, శక్తిమంతుడైనా, ఆంజనేయుడిలాగా తన శక్తి తనకు తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని ఆలోచించి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. చిరంజీవి నాకు అన్నయ్య మాత్రమే కాదు, తండ్రిలాంటి వారు. మా వదిన నాకు మాతృమూర్తి. నేను బాబాయ్ అయినా, చరణ్‌ నాకు తమ్ముడిలాంటి వాడు. చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని'' అని పవన్ చెప్పారు.

''రామ్ చరణ్ ను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది.. ఆనందంగా ఉంటుంది. కానీ అతని హార్స్ రైడింగ్ చూస్తే నాకు చాలా అసూయగా ఉంటుంది. నాకు చాలా తక్కువ సందర్భాల్లో అసూయ పడుతుంటాను. ‘మగధీర’లో రామ్ చరణ్ గుర్రపు స్వారీ చూసినప్పుడు, ఎంత అద్భుతంగా చేస్తున్నాడు అని అసూయపడ్డా. చిన్నప్పుడు నేనూ నేర్చుకుని ఉంటే ఇంత అద్భుతంగా హార్స్ రైడింగ్ చేసుండేవాడిని కదా అనిపించింది. జీవితంలో నేనెప్పుడూ హార్స్ రైడింగ్ నేర్చుకోలేదు. కానీ రామ్ చరణ్ అన్నీ నేర్చుకున్నాడు. ఇంగ్లాండ్ కి వెళ్లి డ్యాన్సింగ్ ఇన్స్టిట్యూట్ లో డ్యాన్స్ నేర్చుకున్నాడు''

''మగధీరుడు, అల్లూరి సీతారామరాజుగా జీవించేసాడు. తోటి నటీనటులపైన ఇష్టం చూపించేవాడు. రామ్ చరణ్ ఇండస్ట్రీలో అందరు హీరోలకు ఫ్రెండ్. చాలా గౌరవంగా ఉండేవాడు. మా నాన్న ఏం తలచుకొని పేరు పెట్టాడో తెలియదు కానీ, సంవత్సరంలో కనీసం 100 రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయస్వామి దీక్ష చేస్తుంటాడు. ‘ఇవన్నీ ఎందుకురా’ అని అడిగితే, ‘నేను బాధ్యతతో మెలగడానికి, నియంత్రిచుకోడానికి, అహంకారం లేకుండా ఉండటానికి’ అని అంటాడు. ఎప్పుడూ చెప్పుల్లేకుండా తిరుగుతూ ఉంటాడు. నేనైనా వేసుకున్న చెప్పులు విప్పడానికి అప్పుడప్పుడు ఇబ్బంది పడతాను. రామ్ చరణ్ మూమూలు హీరో కాదు.. హాలీవుడ్ దాకా వెళ్ళాడు.. ఆస్కార్ వరకూ వెళ్ళాడు. ఎంత గుండె ధైర్యం అంటే, అవసరమైతే సూటు బూటు వేసుకొని తయారవుతాడు.. లేదంటే అయ్యప్ప మాల వేసుకొని కనిపిస్తాడు. అలాంటి వ్యక్తికి వ్యక్తిత్వంలో ఎంత బలం ఉండాలి. రామ్ చరణ్ పదహారణాల మంచి తెలుగువాడు. మా బంగారం.. ఒక తల్లికి పుట్టకపోయినా నా తమ్ముడు. ఎప్పుడూ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు. అతనికి అద్భుత విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఒక బాబాయిగా కాదు, అన్నగా ఆశీర్వదిస్తున్నాను. ఐ లవ్‌ వ్యూ రామ్‌ చరణ్‌'' అని పవన్ కల్యాణ్ అన్నారు.

Tags:    

Similar News