కల్కి 2898 AD: శభాష్ నాగి!

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "కల్కి 2898 AD". రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించినఫాంటసీ మూవీ ఇది.

Update: 2024-06-22 06:46 GMT

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా "కల్కి 2898 AD". రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించినఫాంటసీ మూవీ ఇది. మరో ఐదు రోజుల్లో థియేటర్ లలోకి రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల వదిలిన ట్రైలర్ లో కథేంటనేది పెద్దగా రివీల్ చెయ్యకపోయినా, అందులోని విజువల్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు లేటెస్టుగా వచ్చిన ట్రైలర్ లో అధ్బుతమైన యాక్షన్ సీన్స్ తో పాటుగా కథ గురించి కొన్ని హింట్స్ ఇచ్చారు.


'కల్కి 2898 AD' అనేది హిందూ పురాణాల స్ఫూర్తితో తీసిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ. ఫ్యూచర్ వరల్డ్ ను ఊహించి దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. హాలీవుడ్ సినిమాల్లో భవిష్యత్ నగరాలు ఎలా ఉంటాయో చూపిస్తే, ఈ చిత్రంలో కాశీ లాంటి భారతీయ నగరాలు ఎలా ఉండబోతున్నాయనేది చూపించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కథంతా కాశీ, కాంప్లెక్స్, శంబాల అనే మూడు ప్రపంచాల మధ్య సాగుతుందని ఇప్పటికే మేకర్స్ రివీల్ చేశారు. దీనికి తగ్గట్టుగానే కథను మూడు ప్రపంచాలకు లింక్ చేస్తూ రిలీజ్ ట్రెయిలర్ ను కట్ చేశారు.


కారణ జన్ముడిని కడుపులో మోస్తున్న ఒక తల్లి(దీపికా పదుకునే).. దుష్టుల నుంచి ఆమెను రక్షించే అశ్వద్ధామ (అమితాబ్ బచ్చన్).. సర్వ భోగాలు లభించే ఆకాశంలోని కాంప్లెక్స్ సిటీకి వెళ్లాలని కోరుకునే భైరవ (ప్రభాస్).. ఈ క్రమంలో అశ్వద్ధామతో తలపడే భైరవ.. చివరకు కాశీ ప్రజలకు రక్షకుడిగా మారిన భైరవ.. ఇలాంటి సన్నివేశాలను మనం కల్కి కొత్త ట్రైలర్ లో చూడొచ్చు. విజువల్ గ్రాఫిక్స్ కట్టిపడేసేలా ఉంటే, ప్రభాస్ - అమితాబ్ మధ్య వచ్చే ఫైట్ నెక్స్ట్ లెవల్ లో ఉంది. బుజ్జితో డార్లింగ్ చేసే విన్యాసాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ సాంగ్ ద్వారా బ్యాగ్రౌండ్ స్కోర్ ను నడిపించిన మ్యూజిక్ డైరెక్టర్ సంతోశ్ నారాయణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.


ఓవరాల్ గా 'కల్కి 2898 AD' రిలీజ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకోవడమే కాదు, సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. భారీ కాన్వాస్ లో హాలీవుడ్ మూవీస్ కు ఏమాత్రం తగ్గకుండా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఒక విజువల్ వండర్ ను ఆవిష్కరించబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. అందులోనూ కల్కి కథను మన హిందూ పురాణాలకు లింక్ చేస్తూ, భవిషత్ ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడి విజన్ ను, దాన్ని ప్రజెంట్ చేసిన తీరును కచ్ఛితంగా మెచ్చుకొని తీరాల్సిందే. బిగ్ స్క్రీన్ మీద 3డీలో ఈ సినిమా చూస్తే, ప్రేక్షకులకు సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ గ్యారంటీ అనిపిస్తోంది.


'కల్కి 2898 AD' చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, మాళవికా నాయర్, అన్నా బెన్, శోభన, రాజేంద్ర ప్రసాద్, శాశ్వత చటర్జీ, పశుపతి, బ్రహ్మానందం నటించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అతిథి పాత్రలు పోషించారు. మరికొన్ని సర్ప్రైజింగ్ క్యామియోలు ఉన్నట్లు టాక్. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఈ చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది.






 


Tags:    

Similar News