పృథ్వీ క్షమాపణ.. "బాయ్‌కాట్" కాదు "వెల్కమ్ లైలా" అనండి!

సాధారణంగా సినిమా ప్రమోషన్లో హీరోలు, దర్శకులు, ఇతర నటీనటులు తమ పాత్రలు, సినిమా విశేషాలు మాత్రమే చెబుతుంటారు.

Update: 2025-02-13 16:09 GMT

'లైలా’'సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు భారీ వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. సాధారణంగా సినిమా ప్రమోషన్లో హీరోలు, దర్శకులు, ఇతర నటీనటులు తమ పాత్రలు, సినిమా విశేషాలు మాత్రమే చెబుతుంటారు. కానీ, ఈసారి పృథ్వీ చేసిన కామెంట్ రాజకీయ రంగు పులుముకోవడంతో పెద్ద దుమారం రేగింది. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతూ, వైసీపీ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది.

ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ పృథ్వీ రాజ్ తన పాత్ర గురించి వివరించేందుకు మేకల సత్తి అనే క్యారెక్టర్‌ను ప్రస్తావించాడు. సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు 150 మేకలు ఉండేవి, చివరికి 11 మాత్రమే మిగిలాయని వ్యాఖ్యానించాడు. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక కాకతాళీయమా తెలియదని అన్న మాటలు పెద్ద గొడవకు దారితీశాయి. సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు ‘బాయ్‌కాట్ లైలా’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు.

విషయం మరింత వేడెక్కడంతో హీరో విశ్వక్ సేన్ స్పందించాల్సి వచ్చింది. ఈ వివాదం సినిమాపై చెడు ప్రభావం చూపిస్తుందని భావించి, మీడియా ముందు వచ్చి క్లారిటీ ఇచ్చాడు. సినిమా కథకు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం సరదాగా చెప్పిన మాటలే తప్ప ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం లేదని చెప్పాడు. అయినా సరే, వివాదం తగ్గకపోవడంతో పృథ్వీ రాజ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న పృథ్వీ, ఈ వివాదంపై తాజాగా మరోసారి స్పందించాడు. అయితే, తాను ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను వక్రీకరించారని వెల్లడించాడు. ఇదే సమయంలో, “నాకు ఎవరి మీద ద్వేషం లేదు. నా వల్ల సినిమా దెబ్బతినకూడదు” అంటూ అందరికీ క్షమాపణలు చెప్పాడు.

“బాయ్‌కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అనండి” అంటూ పృథ్వీ తన వెర్షన్‌ను నెమ్మదిగా మార్చుకున్నాడు. సినిమాను రాజకీయ అంశాలతో ముడిపెట్టకుండా చూడాలని కోరాడు. విశ్వక్ సేన్ కష్టపడి చేసిన ఈ చిత్రానికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో, అభిమానులను సినిమాలో భాగం కావాలని కోరాడు.

ఈ వివాదం సినిమాపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ‘లైలా’ సినిమా ఈ ట్రోలింగ్‌ను అధిగమించి, విజయాన్ని అందుకుంటుందా? లేక ఈ వివాదం కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందా? అన్నది చూడాల్సిన విషయం. ఇకపోతే, పృథ్వీ రాజ్ చేసిన క్షమాపణలతో ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందా? లేక ఇంకా కొనసాగుతుందా? అన్నది కూడా ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News