పుష్ప 2: హిందీ మార్కెట్‌లో కొత్త రికార్డులు

ఈ సినిమా హిందీ వెర్షన్‌కు లభించిన విశేష స్పందన ఇప్పటివరకు హిందీ మార్కెట్‌లో ఏ సౌత్ సినిమాలకు లభించలేదు.

Update: 2024-12-06 13:33 GMT

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ కేవలం టాలీవుడ్‌లోనే కాదు, హిందీ మార్కెట్‌లో కూడా తన సత్తా చాటుతూ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు లభించిన విశేష స్పందన ఇప్పటివరకు హిందీ మార్కెట్‌లో ఏ సౌత్ సినిమాలకు లభించలేదు. ఆ రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది. విడుదలైన మొదటి రోజే అనేక రికార్డులను తిరగరాసి, భారతీయ సినిమా చరిత్రలో ఓ కొత్త ట్రెండ్ ను ప్రారంభించింది.

హిందీ వెర్షన్ తొలి రోజే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్ 72 కోట్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటివరకు బాలీవుడ్‌లో ఓ సౌత్ డబ్బింగ్ ఫిల్మ్ సాధించిన అత్యున్నత రికార్డు ఇదే. పైగా రిలీజ్ రోజు హాలిడే కూడా కాదు. అలాగే ఫెస్టివల్ డే కూడా కాదు. వర్కింగ్ డే లో ఇలాంటి ఫీట్ సాధించడం గమనార్హం. సాధారణ రోజుల్లోనే ఇంతటి కలెక్షన్లు సాధించడంతో హిందీ బెల్ట్‌లో అల్లు అర్జున్ క్రేజ్‌ను స్పష్టంగా చూపించింది.

పుష్ప సిరీస్ మొదటి భాగంతోనే అల్లు అర్జున్ హిందీ ప్రేక్షకులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా పార్ట్ 1 లాంగ్ రన్ లో 100 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు పుష్ప 2 మొదటి రోజే 72 కోట్లు రావడం విశేషం. ఇక రెండవ రోజు ఆ స్థాయిని మరింత పెంచుకుంటూ హిందీ బెల్ట్‌లో అగ్రశ్రేణి సౌత్ హీరోల సరసన నిలిచాడు. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అల్లు అర్జున్ మాస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాను హిందీ ఆడియన్స్‌కు ప్రత్యేకంగా గుర్తుండిపోయేలా చేశాయి.

తొలి రోజు సాధించిన కలెక్షన్లు గతంలో బాలీవుడ్‌లో హిట్ అయిన పెద్ద చిత్రాల రికార్డులను బద్దలు కొట్టాయి. హిందీ మార్కెట్‌లో ప్రభాస్, యశ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి తారలు మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు వారి సరసన అల్లు అర్జున్ తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. పుష్ప 2 హిందీ వెర్షన్ కలెక్షన్లు బాలీవుడ్ పెద్ద చిత్రాలకు సమానంగా నిలిచాయి.

ఈ సినిమా హిందీ వెర్షన్ లో సాధించిన మరో రికార్డ్ ఏమిటంటే, ఇది డబ్బింగ్ సినిమాగా అన్ని రకాల రికార్డులను తిరగరాసింది. ఇంతవరకు బాహుబలి 2, కేజీఎఫ్ 2 వంటి డబ్బింగ్ చిత్రాలు హిందీ మార్కెట్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించగా, ఇప్పుడు పుష్ప 2 ఆ రికార్డులను సమీపించింది. ప్రత్యేకంగా, హాలిడే లేకుండా సాధించిన ఈ విజయంతో సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది.

మొత్తానికి, పుష్ప 2: ది రూల్ హిందీ మార్కెట్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, సౌత్ సినిమాల దిశలో ఓ ట్రెండ్ సెట్ చేసింది. అల్లు అర్జున్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి అర్ధమవుతుంది. ఈ విజయంతో సౌత్ హీరోలు హిందీ బెల్ట్‌లో మరింత పాగా వేసే అవకాశం స్పష్టమవుతోంది. పుష్ప 2 ఈ విజయాన్ని ఇంకా ఎక్కడి దాకా తీసుకెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News