ఓటీటీలోనూ 'పుష్ప 2' అస్సలు తగ్గేదేలే
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన పుష్ప 2 సినిమా రీలోడెడ్ స్ట్రీమింగ్ మొదలు కావడమే ఆలస్యం ప్రేక్షకులు ట్రెండింగ్‌లో ఉంచారు.
బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 'పుష్ప 2' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. థియేట్రికల్ రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యింది. సాధారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం సినిమాలు నాలుగు లేదా ఆరు వారాల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. కానీ పుష్ప 2 సినిమాకు థియేట్రికల్ రన్ ఎక్కువ రోజులు కొనసాగిన కారణంగా, రీ లోడెడ్ వర్షన్ అంటూ మరో వారం రోజుల పాటు థియేటర్‌లకు జనాలను రప్పించే ప్రయత్నం జరగడంతో ఓటీటీలో స్ట్రీమింగ్ ఆలస్యం అయ్యింది. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన పుష్ప 2 సినిమా రీలోడెడ్ స్ట్రీమింగ్ మొదలు కావడమే ఆలస్యం ప్రేక్షకులు ట్రెండింగ్‌లో ఉంచారు.
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమాను 5.8 మిలియన్‌ల వ్యూస్‌ను పుష్ప 2 సినిమా దక్కించుకుంది. తెలుగు సినిమాకు ఇది ఆల్‌టైమ్ రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. అంతకు ముందు లక్కీ భాస్కర్ సినిమాకి 4 రోజుల్లో 5.1 మిలియన్‌ల వ్యూస్ దక్కాయి. కల్కి 2898 ఏడీ సినిమాకి 4 రోజుల్లో 4.5 మిలియన్‌ల వ్యూస్ దక్కాయి. మొత్తంగా పుష్ప 2 సినిమా థియేట్రికల్ రన్‌లోనే కాకుండా ఓటీటీలోనూ అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. వ్యూస్ దక్కడంతో పాటు ఏకంగా ఏడు దేశాల్లో ఈ సినిమా నెం.1లో ట్రెండ్ అవుతూ నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తోంది.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అత్యధికంగా చూస్తున్న సినిమాగా సైతం పుష్ప 2 సినిమా నిలిచింది. 15 దేశాల్లో ఈ సినిమాను ప్రేక్షకులు అత్యధికంగా చూసే సినిమాల జాబితాలో నిలిచింది. ఇక 20కి పైగా దేశాల్లో టాప్ 10లో ట్రెండ్ కావడం విశేషం. నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో నెం.2 స్థానంను నెట్‌ఫ్లిక్స్‌లో పుష్ప 2 దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమికులతో పాటు విదేశీ భాషల సినీ ప్రేక్షకులు సైతం ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నారు. సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో పబ్లిసిటీ దక్కింది. పాటలు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. అందుకే పుష్ప 2 సినిమాను విదేశీయులు సైతం చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీలోనూ కచ్చితంగా రికార్డ్‌లు సృష్టిస్తుందని అంతా భావించారు. అందుకే విడుదలకు ముందు ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ దాదాపుగా రూ.250 కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. తెలుగు సినిమాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డ్ సాధించింది. వెయ్యి కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. రూ.2000 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే.