సర్ ప్రైజ్ ఇచ్చిన మహేష్-రాజమౌళి!
తాజాగా షూటింగ్ మొదలు పెట్టడమే కాదు ఓ షెడ్యూల్ కూడా పూర్తయిందన్న వార్త వెలుగులోకి వచ్చింది.
సర్ ప్రైజ్..షాకింగ్ లు ఇవ్వడం రాజమౌళికి కొత్తేం కాదు. ఆయన సినిమా మొదల్లవడం...ముగించడం వంటి విషయాలేవి మీడియాకి అధికారికంగా తెలియవు. ఆనోటా ఈనోట తెలిసిన సమాచారం మేరకు రాసుకోవడం మినహా మాత్రం ఏ విషయం చెప్పడు. అన్నింటిని గోప్యంగా ఉంచుతాడు. `బాహుబలి` దగ్గర నుంచి రాజమౌళి ఇదే స్ట్రాట జీతో ముందుకెళ్తున్నారు. అయితే ఎస్ ఎస్ ఎంబీ 29 మాత్రం లాంచింగ్ ఫోటోలు బయటకు వచ్చాయి.
కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టినట్లు మాత్రం అధికారిక సమాచారం లేదు. తాజాగా షూటింగ్ మొదలు పెట్టడమే కాదు ఓ షెడ్యూల్ కూడా పూర్తయిందన్న వార్త వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్‌ను నిర్మించి అందులో కీలక సన్నివేశాలు చిత్రీకరించారుట. అలాగే సిటీలో పలు చోట్ల సినిమాకి సంబంధించిన ఖరీదైన సెట్లు వేసారుట. వాటిలో షూటింగ్ కి రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఈనెలఖరు నుంచి మరో కొత్త షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. అందులో మహేష్ తో పాటు కీలక తారాగణమంతా పాల్గొంటుందిట. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ ఇది. అలాంటి సెట్లను హైదరాబాద్ లోనే నిర్మించినట్లు తెలుస్తోంది. అవసరం మేర కొన్ని కీలక సన్నివేశాల కోసం అమెజాన్ అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. `బాహుబలి` షూటింగ్ సమయంలోనూ భారీ వార్ సన్నివేశాల కోసం జార్జియా వెళ్లిన సంగతి తెలిసిందే.
మహేష్ మూవీ షూటింగ్ కూడా అలాగే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారుట. ఇందులో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నారుట. మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంకా చర్చలు ఓ కొలిక్కి రాలేదు. వచ్చిన తర్వాత విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్నందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు.