రామ్ చరణ్ 'అన్‌స్టాపబుల్‌' జీవిత పాఠాలు..!

చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలని, అనుభవం ఉన్న పెద్దల మాట వింటే మనం తప్పులు చేయకుండా ఉంటామని తెలిపారు.

Update: 2025-01-18 06:40 GMT

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్‌' టాక్ షోలో ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 'ఆహా' ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయిన ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ ఎపిసోడ్‌ రెండో భాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో చరణ్‌ గురించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అపజయాలు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కొన్నాడనే విషయం మీద చరణ్ మాట్లాడారు. చేసిన తప్పుల నుంచి నేర్చుకోవాలని, అనుభవం ఉన్న పెద్దల మాట వింటే మనం తప్పులు చేయకుండా ఉంటామని తెలిపారు.

''చిన్నప్పటి నుంచీ ప్రతీది నాకు లెర్నింగ్ ఎక్స్పీఎరియన్స్. ఏది జరిగినా దాన్నుంచి నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎవరూ పర్ఫెక్ట్ కాదు. నేను కూడా ప్రారంభంలో కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పుల నుంచి నేర్చుకున్నాను. మళ్ళీ మళ్ళీ అవే తప్పులను చేయకుండా ఉంటే చాలు. దేనికైనా సమయ పాలన అనేది చాలా ముఖ్యం. చాలా వరకు కాలమే అన్నింటికీ ఆన్సర్ ఇస్తుంది. ప్రతీ దానికి యాక్షన్ కు వెంటనే రియాక్షన్ ఇవ్వాలని తాపత్రయపడకూడదు. మన టర్న్ వచ్చే వరకూ వెయిట్ చేయాలి. ప్రతి సంవత్సరం మనది కాదు.. ప్రతి వారం, నెల మనది కాదు. కొన్నిసార్లు మనకి ఫెంటాస్టిక్ గా ఉంటుంది.. కొన్నిసార్లు అనుకూలంగా ఉండదు అనేది మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి'' అని చరణ్ చెప్పారు.

''ఇంట్లో పెద్దల మాట వినడం.. వాళ్ల అనుభవాల నుంచి నేర్చుకోవడం ద్వారా, మనం తప్పులు చేయకుండా ముందుగానే జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది'' అని రామ్ చరణ్ అన్నారు. ''మనకు లో-పాయింట్ లేదు అనుకోకుండా.. ప్రతి మనిషికి లో-పాయింట్ ఉంటుందనే విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం రియాలిటీలో బ్రతకాలి. ఎప్పుడూ దానికి ఎదురెళ్లాలని అనుకోకూడదు. ఆ సమయంలో మనకు ఏదైనా జరిగినప్పుడు మనం దానికి ఎదురెళ్లకుండా, దాన్ని యాక్సెప్ట్‌ చేయడమే గెలిచినట్లు'' అని పేర్కొన్నారు.

''ఒక సినిమా బాగా ఆడనప్పుడు, లేదా ఫ్యామిలీలో ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు బాధ పడటానికి ఎంతో కొంత టైం మనం ఇవ్వాలి. ఎందుకంటే ఆ బాధ నుంచే పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఇంట్లో ఎవరికీ కుమిలిపోయే తత్త్వం కూడా లేదు. సమస్యని పరిష్కరించుకునే దిశగా వెళ్లిపోతుంటాం. లక్కీగా ఉమ్మడి కుటుంబంలో, కావాల్సిన వారందరితో కలిసి ఉండటం నాకు అడ్వాంటేజ్. ప్రతీ ఒక్కరూ వచ్చి కాపుకాసేస్తారు. మేమంతా కలిసే ఉంటాం.. ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు అనే ఫీలింగ్ లేకుండా చేస్తారు. దేవుడి దయ వల్ల, ఇంతమంది శ్రేయోభిలాషులు నా పక్కనే ఉన్నందుకు కృతజ్ఞతలు''

''ఒక సినిమా హిట్టయినా, ఫ్యామిలీలో ఏదైనా డౌన్ అయ్యే సందర్భం వచ్చినా.. నా అభిమానులు మాత్రం ఎక్కడో నాపై పూర్తి నమ్మకంతో ఉంటార ని మనస్ఫూర్తిగా చెబుతున్నా. మనం డిజప్పాయింట్ అవుతాం కానీ, ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉంటారు. వాళ్ళు అస్సలు డిజప్పాయింట్ అవ్వరు. అందుకే వాళ్ళు మనకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తో సమానం'' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలలో ఎప్పుడూ తన విషయాలను పెద్దగా చెప్పుకోని చెర్రీ.. ‘అన్‌స్టాపబుల్‌’ షోలో ఇలా జీవిత పాఠాలు, ఫిలాసఫీ మాట్లాడటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ చూస్తుంటే ముచ్చటేస్తోందని మెగాభిమానులు ఈ వీడియో క్లిప్పింగ్స్ ని వైరల్ చేస్తున్నారు.

Tags:    

Similar News