జనవరి 10.. మెగా ఫ్యామిలీకి అచ్చి రాలేదా?
అయితే శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ కు, ఆడియెన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్.శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ "గేమ్ ఛేంజర్". అగ్ర నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన మూవీ ఇది. స్టార్ కాస్టింగ్, టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ప్రమోషనల్ కంటెంట్ పెద్దగా బజ్ క్రియేట్ చెయ్యకపోయినా, కాంబినేషన్ మీద నమ్మకంతో మెగా ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. అయితే శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ కు, ఆడియెన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
దాదాపు ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో సినిమా కావడం, దర్శకుడు శంకర్ తెలుగులో తీసిన తొలి చిత్రం కావడంతో 'గేమ్ చేంజర్' పై ఒకింత ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. గోబల్ స్టార్ గా ట్యాగ్ మార్చుకున్నాక చెర్రీ నుంచి రాబోతున్న మూవీ అవ్వడంతో అభిమానులు ప్రత్యేకంగా భావించారు. కచ్ఛితంగా సక్సెస్ సాధించాలని కోరుకున్నారు. కానీ వారందరికీ నిరాశే ఎదురైంది. రొటీన్ స్టోరీ, అవుట్ డేటెడ్ స్క్రీన్ ప్లే అండ్ మేకింగ్ తో శంకర్ చేసిన ప్రయత్నం ఏ దశలోనూ మెప్పించలేకపోయింది.
'గేమ్ ఛేంజర్' సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో, జనవరి 10వ తేదీ మెగా ఫ్యామిలీకి అచ్చి రాలేదనే చర్చలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి. దీనికి కారణం సరిగ్గా ఏడేళ్ల క్రిందట ఇదే రోజున 'అజ్ఞాతవాసి' సినిమా రిలీజైంది. పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. పవర్ స్టార్ కెరీర్ లో మైలురాయి 25వ సినిమాగా తెరకెక్కింది. అయితే భారీ అంచనాలతో 2018 సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.
ఏళ్లు గడుస్తున్నా 'అజ్ఞాతవాసి' గాయం నుంచి మెగా అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిన సిల్వర్ జూబ్లీ సినిమాని ఈ విధంగా గుర్తు పెట్టుకోవాల్సి వచ్చినందుకు నేటికీ బాధ పడుతూ ఉంటారు. సినిమా వచ్చి ఏడు సంవత్సరాలు అయిందంటూ ట్విట్టర్ ఎక్స్ లో ఆ జ్ఞాపకాలను తలచుకుంటూ ట్రెండ్ చేశారు. 'గేమ్ ఛేంజర్' రిజల్ట్ తో ఆ గాయాన్ని మర్చిపోయేలా చేయాలని బలంగా కోరుకున్నారు. కానీ ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.
బాబాయ్ పవన్ కల్యాణ్ - అబ్బాయ్ రామ్ చరణ్ ఇద్దరూ జనవరి 10వ తేదీన ఆశించిన విజయాలను అందుకోలేకపోయారు. అప్పుడు 'అజ్ఞాతవాసి', ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' నిరుత్సాహ పరిచాయి. దీంతో ఆ డేట్ మెగా హీరోలకు కలిసి రాదని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఈ సందర్భంగా చివరగా 2019 సంక్రాంతికి 'వినయ విధేయ రామ' మూవీతో చరణ్ డిజార్డర్ చవి చూసారనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
గతేడాది మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్', 'మట్కా' వంటి రెండు మెగా డిజాస్టర్లు అందుకున్నారు. ఇప్పుడు కొత్త ఏడాదిలో 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్ సరైన ఆరంభం ఇవ్వలేకపోయారు. ఈ నేపథ్యంలో చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' చిత్రంపై మెగా అభిమానులు బోలెడన్ని అసలు పెట్టుకున్నారు. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి మెగా ఫ్యామిలీని మళ్ళీ సక్సెస్ టాక్ ఎక్కిస్తారని నమ్ముతున్నారు.