రీఎంట్రీకి రెడీ అయిన రంభ?
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా చక్రం తిప్పిన వారంతా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి దూసుకెళ్తున్నారు.;
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా చక్రం తిప్పిన వారంతా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి దూసుకెళ్తున్నారు. రమ్యకృష్ణ, ఖుష్బూ, మీనా, ఆమని, మధుబాల, ఇంద్రజ లాంటి ఎంతోమంది ఈ వయసులో కూడా బిజీగా ఉండటం చూసి ఆశ పుట్టిందో ఏమో కానీ అలనాటి అందాల తార రంభ కూడా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.
1992లో రాజేంద్ర ప్రసాద్ తో కలిసి నటించిన ఆ ఒకట్టి అడక్కు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రంభ తక్కువ టైమ్ లోనే పెద్ద హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. డెబ్యూ తర్వాత వచ్చిన ఏవండీ ఆవిడ వచ్చింది మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవడంతో రంభకు వరుస అవకాశాలు దక్కాయి. ఆ తర్వాత చిరంజీవి, వెంకటేష్, జగపతి బాబు, సుమన్ తో కలిసి వరుస పెట్టి సినిమాలు చేసింది.
రంభ నటించిన సినిమాల్లో ఎక్కువ సక్సెస్ అవడం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. రంభ క్రేజ్ గురించి ఇప్పటి జెనరేషన్‌కు తెలియకపోయినా ఆమె పేరు మాత్రం అందరికీ తెలుసు. రంభకు ఎంతో మంది కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. మహా సముద్రం సినిమాలో డైరెక్టర్ అజయ్ భూపతి రంభ కటవుట్ పెట్టి మరీ ఆమెపై ఓ సాంగ్ ను రాయించాడంటే తన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో స్పెషల్ సాంగ్ లో డైరెక్టర్ ఈవీవీ రంభనే కావాలని పట్టుబట్టి మరీ తీసుకునేంత క్రేజ్ ను రంభ ఆ రోజుల్లో సంపాదించుకుంది. కానీ 1999 తర్వాత ఆమెకు వరుస ఫ్లాపులు పడటంతో సినిమాల నుంచి కొంత గ్యాప్ తీసుకుని పెళ్లి చేసేసుకుంది.
ఆ తర్వాత అల్లు అర్జున్ దేశముదురు, ఎన్టీఆర్ యమదొంగలో స్పెషల్ సాంగ్స్ లో మెరిసి అందరితో వావ్ అనిపించుకున్న రంభ, 2008లో చేసిన దొంగ సచ్చినోళ్లు మూవీ తర్వాత ఇండస్ట్రీకి మొత్తానికి దూరమైపోయింది. మధ్యలో రంభ దగ్గరకు ఆఫర్లు వెళ్లినా వాటన్నింటినీ రంభ సున్నితంగానే తిరస్కరించింది. అయితే సినిమాల మీద ఫోకస్ చేయడానికి తనకు ఇదే కరెక్ట్ టైమ్ అని రంభ ఇప్పుడు చెప్పడం చూస్తుంటే అలనాటి తార రీఎంట్రీకి రెడీ అయిపోయిందని అర్థమైపోతుంది. మరి సరైన కథతో వెళ్లి రంభను ముందుగా ఎవరు ఇంప్రెస్ చేస్తారో చూడాలి.