‘రేవంత్ క్షత్రియ యోధుడు’... ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్జీవీకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని అంటుంటారు.

Update: 2024-08-19 04:35 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్జీవీకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని అంటుంటారు. రేవంత్ సీఎం అయిన తర్వాత అభినందించిన వారిలో ఆయనా ఒకరు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజుకంటే ఎక్కువైన క్షత్రియ యోధుడని.. ఆయన రాజు మాత్రమే కాదు మహారాజు అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ లో అభిప్రాయపడ్డారు.

అవును... తాజాగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా... హైదరాబాద్ లో అన్ని రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని.. రాజులు ఏ రంగంలో అయినా రాణిస్తారని రేవంత్ ప్రశంసించారు. దీనికి వారి శ్రమ, పట్టుదలే కారణమని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ తనకు మంచి మిత్రుడని రేవంత్ తెలిపారు.

ఇక సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్నంరాజు అని.. ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా ఏకంగా హాలీవుడ్ తోనే పోటూ పడుతున్న ‘బాహుబలి’ ప్రభాస్ అని.. ఆయన లేకుండా ఆ పాత్రలు ఊహించుకోలేమని రేవంత్ తెలిపారు. ఇదే క్రమంలో... టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని రేవంత్ కొనియాడారు.

ఇదే క్రమంలో... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో బోసు రాజు పాత్ర అత్యంత కీలకమని.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాకపోయినా పార్టీ గెలుపుకోసం ఎంతో కష్టపడి పనిచేశారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే బోసు రాజు నిబద్ధతకు ప్రాధాన్యమిస్తూ ఆయనను రాహుల్ గాంధీ మంత్రిని చేశారని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో సలహాదరుగా శ్రీనివాస రాజు ఉన్నారని.. మీ మీ సమస్యలను వారి ద్వారా నా దృష్టికి తీసుకురండని క్షత్రియులకు రేవంత్ సూచించారు. ఇదే క్రమంలో... యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో ఛైర్మన్ గా శ్రీనిరాజుని నియమించినట్లు చెప్పారు. ఇది క్షత్రియులపై తమకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.

అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ ల స్పూర్తితోనే మేము ప్రజాసమస్యలపై కొట్లాడామని రేవంత్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని రాజులందరికీ తాను పిలిపునిస్తున్నాట్లు చెప్పిన రేవంత్... ప్రభుత్వం సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. క్షత్రియ భవన్ కు కావాల్సిన స్థలం, సహకారం తమ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిచిన వీడియోని షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ... రేవంత్ రెడ్డి రాజు కన్నా ఎక్కువైన క్షత్రియ యోధుడని.. ఆయన రాజు మాత్రమే కాదు మహారాజు అని కొనియాడారు.

Tags:    

Similar News