రజనీతో రణవీర్.. షారూఖ్ నో చెప్పాక..!
విక్రమ్- లియో చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తలైవర్ 171 షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమవుతుంది. విక్రమ్- లియో చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. కాస్టింగ్ ఎంపికలు జరుగుతున్నాయి.
అయితే ఈ సినిమాలో ఓ కీలకమైన అతిథి పాత్ర కోసం కింగ్ ఖాన్ షారూఖ్ ని లోకేష్ కనగరాజ్ సంప్రదించారని కథనాలొచ్చాయి. అయితే ఇటీవలి కాలంలో వరుసగా అతిథి పాత్రల్లో నటిస్తున్నందున ఇప్పట్లో తాను అలాంటి పాత్రలో చేయబోనని ఖాన్ చెప్పారట. లోకేష్ కనగరాజ్ తో పని చేయాలనుందని అతడి ఐడియా నచ్చిందని చెప్పినా కానీ, అతిథి పాత్రను సున్నితంగా తిరస్కరించారని కథనాలొచ్చాయి.
అయితే షారూఖ్ కాదన్న తర్వాత అదే పాత్ర కోసం రణవీర్ సింగ్ ని సంప్రదించారని తాజాగా తెలుస్తోంది. ప్రస్తుతం రణవీర్ తో చర్చలు జరుగుతున్నాయి. పూర్తి స్క్రిప్ట్ విన్న తర్వాత రణవీర్ సింగ్ ఓకే చేయాల్సి ఉంది. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఏప్రిల్ 2024లో ప్రారంభమవుతుంది. 2025లో విడుదలవుతుంది.
ఈ సినిమాకి పాన్ ఇండియా అప్పీల్ కోసం అన్ని పరిశ్రమల నుంచి డైనమిక్ స్టార్లను ఎంపిక చేస్తున్నారు దర్శకుడు లోకేష్. తెలుగు, మలయాళం నుంచి కూడా ప్రముఖ స్టార్లను ఎంపిక చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం 2024లో విడుదల కానున్న టీజే జ్ఞానవేల్ సినిమా షూటింగ్లో ఉన్నారు.