రష్మిక కన్నడ చిత్రాల్లో నటించదా?
`ఛావా` ప్రమోషన్ లో భాగంగా రష్మిక తాను హైదరాబాద్ నుంచి ముంబై కి వచ్చినట్లు చేసిన వ్యాఖ్యలతో కన్నడిగులు ఒక్కసారిగా భగ్గుమన్న సంగతి తెలిసిందే.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇక శాండిల్ వుడ్ కి పూర్తిగా దూరమైనట్లేనా? టాలీవుడ్ ని తన సొంత పరిశ్రమగా భావిస్తోందా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది. `ఛావా` ప్రమోషన్ లో భాగంగా రష్మిక తాను హైదరాబాద్ నుంచి ముంబై కి వచ్చినట్లు చేసిన వ్యాఖ్యలతో కన్నడిగులు ఒక్కసారిగా భగ్గుమన్న సంగతి తెలిసిందే. కర్ణాటక కొడగు జిల్లా విరాజ్ పేటకు చెందిన హైదరాబాదీ వాసా? ఆమె దుకాణం ఇక్కడ నుంచి అక్కడకి ఎప్పుడు సర్దేసింది? అంటూ మండిపడుతున్నారు.
పేరొచ్చిన తర్వాత సొంత ఊరు, రాష్ట్రాన్నే మర్చిపోతుందా? అని భగ్గుమంటున్నారు. వేరే ప్రాంతాలకు వెళ్లినప్పు డు సొంతరు గురించి చెప్పడం రష్మికకు అంత భారంగా ఉందా? అంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మొత్తానికి మరోసారి రష్మిక కన్నడిగుల్లో కోపానికి గురైంది. ఈ తంతు రష్మిక విషయంలో కొత్తేం కాదు. గతంలోనూ ఇలా చాలా సందర్భాల్లో దొరికింది. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రష్మిక ఇక కన్నడ సినిమాల్లో కొనసాగే అవకాశం లేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది.
కన్నడ దర్శక, నిర్మాతలు కూడా ఆమెకి అవకాశాలు ఇవ్వకూడదని... ఇస్తే వాళ్లను కూడా బ్యాన్ చేయాలనే నినాదాలు కన్నడిగులు తెరపైకి తెస్తున్నారు. `కిరిక్` పార్టీతో రష్మిక కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు అక్కడే సినిమాలు చేసింది. అటుపై `ఛలో` సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అయింది. అక్కడ నుంచి తెలుగు పరిశ్రమలో రష్మిక కెరీర్ వెనక్కి తిరిగి చూడకుండా సాగిపోతుంది. టాలీవుడ్ లో అగ్రనటిగా ఎదిగి తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
అక్కడా `యానిమల్` తో సక్సెస్ అయింది. అటుపై `పుష్ప2` తో పాన్ ఇండియాలో మరింత సంచలనమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు, హిందీలో బిజీగా ఉంది. సౌత్ లో కన్నడ మినహా ఇతర భాషల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. కానీ అమ్మడు టాలీవుడ్...బాలీవుడ్ సినిమాలకే కమిట్ అవుతుంది.