ఇట్స్ పార్టీ టైమ్.. తగ్గేదేలే అంటున్న రష్మిక
ఉల్లాసంగా ఉరుములతో కూడిన చప్పట్లతో నిండిన గదిలో బన్ని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను రష్మిక రీషేర్ చేసింది. బన్నీకి హృదయపూర్వక అభినందనలు తెలిపింది.
'పుష్ప: ది రైజ్' చిత్రంలో నటనకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. దీంతో ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న తొలి తెలుగు స్టార్‌గా నిలిచాడు. ఈ ప్రత్యేక సందర్భంలో రష్మిక మందన్న తన సహనటుడు అల్లు అర్జున్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ చిత్రంలో పుష్పరాజ్ ని ప్రేమించి పెళ్లాడే ఇష్టసఖి శ్రీవల్లిగా రష్మిక నటించిన సంగతి తెలిసిందే.
గురువారం నాడు ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో అల్లు అర్జున్ విక్టరీపై రష్మిక మందన్న ఆనందం వ్యక్తం చేసింది. ఉల్లాసంగా ఉరుములతో కూడిన చప్పట్లతో నిండిన గదిలో బన్ని ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను రష్మిక రీషేర్ చేసింది. బన్నీకి హృదయపూర్వక అభినందనలు తెలిపింది. తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో "పుష్పరాజ్.. అసలు తగ్గేదేలే..అభినందనలు.. ఇది పార్టీ టైమ్" అని వ్యాఖ్యానించింది. ఇక పెద్ద తెరపై పుష్పరాజ్ - శ్రీవల్లి రొమాన్స్ ఒక రేంజులో పండిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్యా సన్నివేశాలు మాస్ ఆడియెన్ లో గిలిగింతలు పెట్టాయి.
జాతీయ అవార్డుపై అల్లు అర్జున్ స్పందన
తాజా విక్టరీతో తన్మయానందంలో ఉన్న అల్లు అర్జున్ మొదటి స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్ తన కుటుంబం స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఎంతో ఎమోషనల్ అయ్యాడు. హర్షధ్వానాల నడుమ అతడు తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ ను దర్శకుడు సుకుమార్‌లను కౌగిలించుకుని పెక్ లు కురిపించాడు. బన్ని భార్య స్నేహ కూడా విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో విజేతగా నిలిచింది. ఈ చిత్రంలో పుష్ప రాజ్ పాత్రకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోగా, స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ చిత్రానికి అందించిన సేవలకు గాను ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) అవార్డును అందుకున్నారు.