ఫ్యాన్స్ కూడా అదే కోరుతున్నారు మాస్ రాజా..?

ఒక సినిమా హిట్ అయితే దానికి ఎంత మంది కష్టపడ్డా క్రెడిట్ ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేస్తారు.

Update: 2024-08-30 11:30 GMT

ఒక సినిమా హిట్ అయితే దానికి ఎంత మంది కష్టపడ్డా క్రెడిట్ ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేస్తారు. తెర వెనక టీం ఎంత కష్టపడినా తెర మీద కథను నడిపించి ప్రేక్షకులను మెప్పించిన వారికే ఎక్కువ క్రెడిట్ దక్కుతుంది. అందుకే డైరెక్టర్ ఎంత కష్టపడ్డా హీరో తర్వాతనే ఆయనకు గుర్తింపు ఉంటుంది. ఐతే స్టార్ హీరోలు ఈమధ్య ఒరిజినల్ కథలు కాకుండా రీమేక్ ల మీద దృష్టి పెడుతున్నారు. ఒకప్పుడు అంటే రీమేక్ లకు ఎక్కువ డిమాండ్ ఉంది కానీ OTT లు వచ్చాక ప్రతి సినిమా అది వేరే భాషలో ఉన్నా కూడా సబ్ టైటిల్స్ తో చూసి మరీ అర్థం చేసుకుంటున్నారు.

అందుకే సాధ్యమైనంత వరకు రీమేక్ లను చేయకుండా ఉండాలనే స్టార్స్ కి చెబుతున్నారు. ఐతే కొన్ని క్రేజీ కాంబినేషన్స్ మాత్రం రీమేక్ కథ అయినా వర్క్ అవుట్ అవుతుందని చేస్తున్నారు. కానీ తీరా రిజల్ట్ చూస్తే తేడా కొట్టేస్తుంది. రీసెంట్ గా అలా భారీ క్రేజ్ తో వచ్చి దారుణంగా పోయిన సినిమా మిస్టర్ బచ్చన్. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వచ్చింది.

హిందీ సినిమా అంతా సీరియస్ టోన్ లో సాగగా.. హరీష్ శంకర్ రైడ్ మూల కథ మాత్రమే తీసుకుని మన దగ్గర వర్క్ అవుట్ అయ్యేలా కామెడీ ఎంటర్టైనింగ్ మిక్స్ చేశాడు. ఐతే సినిమాకు అనుకున్నదంతా రివర్స్ అయ్యింది. ప్రీ రిలీజ్ బజ్ తో రవితేజ కూడా హిట్ కొట్టేస్తున్నాం అనుకుని జోష్ నింపుకోగా రిజల్ట్ చూశాక ఉన్న జోష్ పోయేలా చేసింది. అందుకే రవితేజ ఇక మీదట రీమేక్ సినిమాలకు నో అనేయాలని డిసైడ్ అయ్యాడట.

మాస్ రాజా ఫ్యాన్స్ కూడా కొన్నాళ్లుగా అదే చెబుతున్నారు. రవితేజకు ఉన్న ఫ్యాన్ బేస్ కి ఒరిజినల్ కథ అది కూడా కాస్త కొత్తగా ఉండేలా చూసుకుంటే చాలు సక్సెస్ అవుతుంది. ఐతే మరీ సీరియస్ టోన్ లో టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు చేసినా ఆడియన్స్ హిట్ చేయలేదు కాబట్టి డిఫరెంట్ కథతో తన మార్క్ ఎంటర్టైనింగ్ తో సినిమాలు చేస్తే బెటర్. మిస్టర్ బచ్చన్ ఇచ్చిన షాక్ వల్ల రవితేజ తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ ని కూడా కన్విన్స్ అయ్యేలా చేస్తుంది.

Tags:    

Similar News