రీమేక్‌లపై వేడెక్కిస్తున్న రవితేజ కామెంట్
కానీ మహమ్మారి తర్వాత ముఖ్యంగా పాన్-ఇండియా చిత్రాల ట్రెండ్ లో రీమేక్‌లు చేయడం అనవసరమని రవితేజ అభిప్రాయపడ్డారు.
మాస్ మహారాజా రవితేజ నటించిన తెలుగు బ్లాక్‌బస్టర్‌లు బాలీవుడ్‌లో రీమేకై అక్కడా విజయం సాధించాయి. హిందీ సినిమా తారలకు కూడా భారీ హిట్‌లను అందించాయి. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్‌ను ఆపడానికి సమయం ఆసన్నమైంది. ప్రేక్షకులు 'ఒరిజినల్ భాషల్లో' వచ్చిన సినిమాలను ఎలాగైనా ఓటీటీలు యూట్యూబుల్లో చూస్తున్నారు కాబట్టి ఈరోజుల్లో రీమేక్ చేయడం అర్థంపర్థంలేనిదని రవితేజ భావిస్తున్నాడు.
SS రాజమౌళి దర్శకత్వం వహించిన 'విక్రమార్కుడు' హిందీలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా ''రౌడీ రాథోడ్ పేరుతో రీమేక్ అయింది. మరో రవితేజ బ్లాక్ బస్టర్ 'కిక్' అదే పేరుతో హిందీలో రీమేక్ అయింది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కి ఈ చిత్రం బిగ్ బ్లాక్ బస్టర్. కానీ మహమ్మారి తర్వాత ముఖ్యంగా పాన్-ఇండియా చిత్రాల ట్రెండ్ లో రీమేక్‌లు చేయడం అనవసరమని రవితేజ అభిప్రాయపడ్డారు. ''ఈరోజు రీమేక్‌లు అనవసరం. దానిలో అర్థం లేదు. ఈరోజు అన్ని భాషల సినిమాలు చూస్తున్నాం. నేడు ప్రతి సినిమా ఐదు భాషల్లో విడుదలవుతోంది. పాత, 70ల నాటి చిత్రాలను మాత్రమే రీమేక్ చేయవచ్చు. ఈ రోజు రోహిత్ శెట్టి - కరణ్ జోహార్ వంటి దర్శకులు ప్రేక్షకులకు నాస్టాల్జిక్ ట్రీట్ ఇస్తారు...'' అని అన్నారు.
రవితేజ ప్రస్తుతం తన తదుపరి భారీ చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల ప్రమోషన్స్ కు సిద్ధమవుతున్నాడు. తెలుగు పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్‌కి వంశీ రచనతో పాటు దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. అక్టోబర్ 20న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రవితేజ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మంచి యాక్షన్ చిత్రం ఎప్పటికీ బాగా ఆడుతుందని నమ్మకం వ్యక్తం చేసారు. ప్రజలు యాక్షన్ చిత్రాలను ఇష్టపడతారు. ఈ సంవత్సరం ఉదాహరణగా పఠాన్, గదర్ 2, జవాన్, అన్ని పెద్ద యాక్షన్ చిత్రాలను పరిశీలించాలి. భారతదేశంలోని ప్రజలు యాక్షన్ చిత్రాలను ఇష్టపడతారు. నేను తప్పు చేయకపోతే 88 శాతం యాక్షన్ చిత్రాలను ఇష్టపడతాను. యాక్షన్ చిత్రాలకు ప్రేక్షకులు ఉంటారు'' అని అన్నాడు.